సాయంత్రం 5 గంటలు.. బీహార్ లోని పట్నా జిల్లా ఆలంపూర్ గోనపుర గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఆ గ్రామ సర్పంచ్ అభాదేవి విధుల్లో బిజీగా ఉన్నారు.. ఇంతలో ఒక ఫోన్ కాల్ .. సమీప గ్రామంలో ఒక అమ్మాయిని కొందరు యువకులు వేధిస్తున్నారన్న సమాచారం అందించారు.. వెంటనే అభాదేవి టేబుల్ పై ఉన్న రివాల్వర్ తీసుకొని వాహనంలో అక్కడకు చేరుకుంది. ఆమె రాకను గమనించిన రౌడీలు పారిపోయారు..ఇలా ఒక్క ఈవ్ టీజింగే కాదు మహిళలకు సంబంధించిన పలు సమస్యలను తీర్చడంలో ఆమె ముందుంటున్నారు.

18 గ్రామాల్లో మహిళలకు ఆమే పెద్ద దిక్కు!

అలంపూర్ గోనోపుర గ్రామ పంచాయతీ కింద మొత్తం 18 గ్రామాలున్నాయి. ఆకతాయిలు, రౌడీలు, గూండాలకు ఆమె పేరు చెబితేనే హడలిపోతారు. అవసరమైతే కాల్చేందుకు కూడా వెనకాడరని మహిళా సంఘాలు చెబుతున్నాయి. 2011, 2016 సంవత్సరాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా ఊరుకోరు. పోలీసులు సైతం ఈవ్ టీజింగ్ కేసులు తమ వద్దకు వస్తే ఆమె దగ్గరకే వెళ్లమని సూచించడం విశేషం. ఆమెను సహించలేని కొందరు 2015లో ఆభాదేవి పై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకొంది. దీంతో తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2016లో ఉన్నతాధికారులు తుపాకీ లైసెన్స్లు మంజూరు చేయడంతో రివాల్వర్లు కొనుగోలు చేసి ప్రాణ రక్షణగా ఉంచుకుంది. భర్త శిక్షణ ఇవ్వడంతో తుపాకీ ప్రయోగించడం నేర్చుకుంది. 2017లో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలు దాడులకు దిగారు. అక్కడకు చేరుకున్న ఆమె ఒక కర్ర తీసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

అభివృద్దిలోనూ ముందంజ అభాదేవి సర్పంచ్ గా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి నూతన భవనాన్ని నిర్మించారు. పాఠశాల భవనాలను కూడా నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇంకా కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎప్పుడూ రివాల్వర్ చేతబట్టుకొని తిరగడంతో ఆమెను స్థానికులు ‘లేడీ సింగం` రివాల్వర్ రాణిగా పిలుస్తున్నారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు సేవచేయడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.