కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం
అసాంఘిక కార్యకలాపాలతో జంకుతున్న స్థానికులు
సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో ఎన్నో అడ్డాలు
నిత్యం రద్దీగా ఉండే మూసాపేట నుంచి కైత్లాపూర్‌ మీదుగా హైటెక్‌సిటీ వంతెన వరకు గల ప్రధాన మార్గానికి ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశాలు తాగుబోతుల అడ్డాగా మారాయి. కైత్లాపూర్‌ వద్ద రాష్ట్ర గృహనిర్మాణ మండలికి చెందిన వెంచర్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో పరిస్థితి  దారుణంగా ఉంది. తాగుబోతులు రోడ్లపైనే తిష్ఠవేసి ఇబ్బందులకు గురి చేస్తుండడంతో అటువైపుగా వెళ్లాలంటేనే మహిళలు జంకుతున్నారు.
ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలోని మన్సూరాబాద్‌ జనప్రియ ఎన్‌క్లేవ్‌ పార్కుకు సమీపంలోని చెట్ల కింద పట్టపగలే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. గంజాయి పీల్చుతూ పోకిరీలు మత్తులో జోగుతుంటారు. అటువైపు నుంచి వెళ్లాలంటేనే స్థానికులు జంకుతున్నారు. ఇదొక్కటే కాదు ఇలాంటి అడ్డాలు సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో చాలానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు వాపోతున్నారు.
రాజీవ్‌ రహదారికి సమీపంలో..! కీలకమైన రాజీవ్‌ రహదారికి సమీపంలోని   అలియాబాద్‌ చౌరస్తా దాటిన తర్వాత మజీద్‌పూర్‌ చౌరస్తా దగ్గర మహిళలు బస్సుల కోసం ఎదురు చూడాలంటేనే జంకుతున్నారు. ఈ ప్రాంతంలో వ్యభిచారం జోరుగా జరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ రహదారికి 500 మీటర్ల దూరంలోని శామీర్‌పేట్‌ మినీ స్టేడియంలో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం నుంచే తాగుబోతుల హల్‌చల్‌ మొదలవుతోంది. పట్టపగలే వ్యభిచారం జరుగుతోంది. యువత గంజాయి పీలుస్తూ కనిపిస్తుంటారు.
హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ పక్కన..
నాగోలు మెట్రో స్టేషన్‌కు సమీపంలోని ఆర్టీఏ కార్యాలయం వెనుక.. మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ, హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ పక్కనున్న అప్రోచ్‌ రోడ్డు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిర్మానుష్యమైన ప్రాంతం కావడంతో తాగుబోతులు రెచ్చిపోతున్నారు.
తరచూ ఎక్కడో చోట మృతదేహాలు..
కొందరేమో ఎక్కడో చంపేసి మృతదేహాలను శివారు ప్రాంతాల్లో కాల్చేసి వెళ్లిపోతున్నారు. మరికొందరేమో ఇక్కడికి తీసుకొచ్చి దారుణంగా హతమారుస్తున్నారు. ఆనవాళ్లు దొరక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుండటంతో చనిపోయింది ఎవరనేది తెలుసుకోవడం పోలీసులకు అసాధ్యంగా మారింది. ఒక్క దుండిగల్‌ ఠాణా పరిధిలోని బహదూర్‌పూర్‌ సాయినాథ్‌ సొసైటీలో కాలిపోయిన పలు గుర్తు తెలియని మృతదేహాలు లభించాయి. అదే ప్రాంతంలో పాడుపడిన బ్యాగులో ఓ యువతి మృతదేహం బయటపడింది. బౌరంపేట్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం దొరికింది. మల్లంపేట్‌ నిర్మానుష్య ప్రాంతంలో డ్రైనేజీలో తాజాగా ఓ అస్థి పంజరం బయటపడింది.
అర్ధరాత్రే కాదు.. పగలూ భయమే! ఏదో జరిగినప్పుడే హడావుడి..!
నిర్మానుష్య ప్రాంతాలు కావడం, నిఘా లేమితో శివారుల్లోని చాలా ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఏదో ఘటన జరిగినప్పుడే పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత అటువైపు కూడా చూడటం లేదు. పోనీ.. ప్రధాన ప్రాంతాల్లో జరుగుతున్న ఆగడాలకైనా అడ్డుకట్ట వేస్తున్నారా అంటే అదీ లేదు. పక్కా సమాచారమున్నా తెలిసీ తెలియనట్లుగా వదిలేస్తుండడంతో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. శామీర్‌పేట్‌ ఠాణా పరిధిలోని ఉద్దమర్రిలో రోడ్డు పక్కనే వైన్స్‌ ఉండటంతో మందుబాబుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. డయల్‌ 100కు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు వాపోతున్నారు. మన్సురాబాద్‌ జనప్రియ ఎన్‌క్లేవ్‌ పార్కు దగ్గర పట్టపగలే గంజాయి అమ్ముతున్నారంటూ సాక్షాత్తూ రాచకొండ పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడం గమనార్హం.
అర్ధరాత్రే కాదు.. పగలూ భయమే!