• వి. శంకర్

“మా తాతముత్తాతల నాడు ఇక్కడి పొలాల గట్లు మీదుగా నడుచుకుంటూ శవాలు తీసుకుని వెళ్లే వాళ్లం. కానీ ఇప్పుడు అలా లేదు. ఎడ్ల బళ్లు కూడా తిరిగిన బాటలో ఇప్పుడు కాలినడకన వెళ్లడానికి కూడా వీలులేకుండా పోయింది. మంచినీళ్ల కోసం వెళ్లాలి. పిల్లలు బడికి వెళ్లాలి. ఇక వానాకాలంలో అయితే మోకాలి లోతు నీటిలోనే. మ కష్టాలు ఎవరికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం కనిపించడం లేదు. బాట మొత్తం ఆక్రమించేశారు. మే దళితులం కాబట్టి..శవాలు తీసుకెళ్లడానికి కూడా దిక్కలేని స్థితి వచ్చింది. అదే ఇతరులకయితే ఇలాంటి పరిస్థితి ఉండదేమో…” ఇవి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఏ.వేమవరం గ్రామానికి చెందిన సీహెచ్ గంగన్న అనే వ్యక్తి చెప్పిన మాటలు.

ఈనెల 25నాడు తమ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే శవాలను తీసుకెళ్లడానికి తాము పడిన కష్టాలను తలచుకుంటూ అతనిలా వ్యాఖ్యానించారు. పొలం గట్టు మీదుగా వెళ్లడానికి దారి లేక, పంట చేలో దిగి, శవాలను తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడుతున్న తమ కష్టాలను గుర్తు చేసుకుంటూ వెలిబుచ్చిన అభిప్రాయం అది. అన్ని అవసరాలకు అదే బాటలో వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆక్రమణల మూలంగా తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి…
ఇది ఆచంట మండలం ఏ.వేమవరంలో మాత్రమే ఉన్న పరిస్థితి కాదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సమస్యలున్నాయి.

పలు గ్రామాల్లో దళితులకు స్మశానం సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని చోట్ల స్మశాన స్థలాలు లేకపోవడం వల్ల సతమతం అవుతున్నారు.

కాలువలను ఆనుకుని, రోడ్ల పక్కన , ఇతర అరకొర ప్రదేశాల్లోనే అంతిమ సంస్కారం పూర్తిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్మశాన భూముల ఆక్రమణలు మరో పెద్ద సమస్య.

ఆక్రమణల వ్యవహారం అధికార దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో ఈ సమస్య తీవ్రమవుతోంది. రియల్ ఎస్టేట్ పెరిగిన తరుణంలో భూమి విలువ రీత్యా స్మశానాలను కూడా విడిచిపెట్టకుండా ఆక్రమిస్తున్న ఘటనలు అనేక చోట్ల ఉన్నాయి.

ప్రస్తుతం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో తమ స్మశాన్ని ఆక్రమించుకున్నారంటూ దళితులు ఆందోళన చేస్తున్న తీరు దానికి నిదర్శనం.

ఇక కొన్ని చోట్ల దళితుల స్మశానాలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడం మరో సమస్య. ఉన్న బాటలను కూడా కాలక్రమంలో ఆక్రమించడంతో ప్రస్తుతం అనేక చోట్ల దళితుల స్మశానాలకు శవాలను తీసుకెళ్లేందుకు మార్గం లేని దుస్థితి ఏర్పడింది. దాంతో అసలు స్మశానాలు లేక కొందరు, ఉన్న స్మశానాలకు వెళ్లేందుకు మార్గం లేక మరికొందరు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ప్రభుత్వం కూడా అంగీకరించింది.

స్మశాన సమస్యలపై 12 ఏళ్ల క్రితమే జీవో..
రాష్ట్రవ్యాప్తంగా స్మశాన సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని సంకల్పించింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008 అక్టోబర్ 25 నాడు జీవో ఎంస్ నెం. 1235ని విడుదల చేశారు.

దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్మశానాల సమస్య పరిష్కారం కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

గ్రామాల్లో తహాశీల్దార్లు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు బాధ్యత తీసుకుని రెండు నెలల్లోగా కార్యాచరణకు పూనుకోవాలి.

ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే స్మశానాలకు కేటాయించాలి. లేనిపక్షంలో ప్రైవేటు భూములు సేకరించి భూములు ఇవ్వాలి. ప్రజల భాగస్వామ్యం కోసం స్మశానాలకు స్థలాలు ఇచ్చేవారిని ప్రోత్సహించాలి. వాటికి తగిన విధంగా రహదారి ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఉన్న స్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి. స్మశాన స్థలాల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేయాలి. అదే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వ స్థలాలున్న ప్రాంతంలో స్మశానాలకు కేటాయింపులు పూర్తికావాలని స్పష్టమైన ఆదేశాలు జీవోలో ఉన్నాయి.

‘సమస్య చాలా తీవ్రమైనది..కానీ దృష్టి పెట్టడం లేదు’
ఎవరైనా మరణించిన సమయంలో మాత్రమే గుర్తుకు వచ్చే స్మశానాల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ఎవరూ దృష్టి పెట్టడం లేదని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి వ్యాఖ్యానించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “మేము 15 ఏళ్ల క్రితం సర్వే నిర్వహించాము. ఉమ్మడి రాష్ట్రంలో 12వేల గ్రామాల్లో స్మశానాల సమస్యలు గుర్తించాము. నేటికీ ప్రతీ మండలంలో రెండు, మూడు గ్రామాల్లో ఈ సమస్య ఉంది. గతంలో ఇచ్చిన జీవో అమలు మీద శ్రద్ధ చూపడం లేదు. అనేకమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా దళితుల స్మశానాలకు స్థలాలు కేటాయించడం లేదు. కొన్ని చోట్ల ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులను కూడా గతంలో దారి మళ్లించిన అనుభవాలున్నాయి. దళితుల స్మశానాల సమస్యను పరిష్కరించాలి” అని ఆయన కోరారు.

‘ఆక్రమణలు తొలగించడానికి అడ్డంకి ఏమిటి?’
ఎ.వేమవరం వంటి గ్రామాల్లో రికార్డుల ప్రకారం స్మశానాలకు వెళ్లేందుకు అవసరమైన మార్గం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఖాతరు చేయడం లేదని ఎంఆర్పీఎస్ నాయకుడు సిర్రా బాలాజీ అంటున్నారు.

“మేము చాలా సార్లు ఈ సమస్యను ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్రమణలు తొలగిస్తే సమస్య ఉండదు. చాలా చోట్ల స్మశానాలు, అక్కడికి వెళ్లేందుకు ఉన్న మార్గాలు అన్యాక్రాంతం కావడంతో దళితులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెడితే ఇలాంటి సమస్యకు సత్వరమే పరిష్కారం ఉంటుంది” అని ఆయన బీబీసీతో అన్నారు.

‘ఏడాది పొడవునా సమస్యలే..’
వేమవరం నుండి వద్దిపర్రు వెళ్లే మార్గంలో నివసిస్తున్న వారు స్మశానానికి వెళ్లాల్సిన సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా సతమతం అవుతున్నామని స్థానిక మహిళ యూ సునీత చెప్పారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ “మేం నిత్యం అదే గట్టున వెళుతూ ఉంటాం. శవాలను తీసుకెళ్లిన సందర్భంలోనే కాకుండా ఇతర అన్ని అవసరాలకు ఆ బాట మాకు దిక్కు. కానీ ఇప్పుడు ఆక్రమణదారుల మూలంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఎన్నికలప్పుడు వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు గానీ రానురాను గట్టు సన్నగా అయిపోవడమే తప్ప మా సమస్య తీరడం లేదు” అంటూ వివరించారు.

స్పందించేందుకు నిరాకరించిన మంత్రి
ఆచంట నియోజకవర్గంలోని ఏ.వేమవరం సమస్యను అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది. సమస్యపై స్పందించాలని కోరింది. కానీ ఆయన మాత్రం అందుకు ససేమీరా అన్నారు. సమస్య ఉందని అంగీకరిస్తూనే తాను స్పందించలేనని తెలిపారు.

ఈ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పితాని సత్యన్నారాయణ కూడా వైఎస్సార్ హయం నుంచి 2019 వరకూ ఏపీ క్యాబినెట్‌కి ప్రాతినిధ్యం వహించారు. గతంలోనూ, ఇప్పుడూ నియోజకవర్గ ఎమ్మెల్యేనా మంత్రిగా ఉన్నప్పటికీ ఆచంట వాసులకు ఇలాంటి సమస్యలు కొనసాగడం గమనార్హం.

‘క్రైస్తవుల స్మశాన భూముల సమస్య…’
రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సమాధుల నిర్మాణం పెద్ద సమస్యగా మారిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “ఎస్సీల స్మశాన భూముల సమస్యపై గతంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం రావడం లేదు. ముఖ్యంగా క్రైస్తవుల స్మశానాలకు స్థలాల కొరత ఏర్పడింది. దానిపై గతంలో ఉద్యమం కూడా నిర్వహించాము. కానీ హామీలు తప్ప అందుకు అనుగుణంగా భూముల కేటాయింపులు లేవు. ఎవరైనా చనిపోతే సమాధి స్థలం కోసం ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. నగరాలు, పెద్ద పట్టణాల పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మతాల వారీగా స్మశాన స్థలాల కేటాయింపు కోసం ఇచ్చిన జీవో ఆధారంగా వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరణించిన తర్వాతనయినా దళితుల పట్ల వివక్ష కనిపించకుండా చర్యలుండాలి” అని అభిప్రాయపడ్డారు.

‘చర్చించి, నిర్ణయం తీసుకుంటాం…’
రాష్ట్రంలో దళితుల స్మశానాల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రితో చర్చించి, నిర్ణయం తీసుకుంటాం. ఉమ్మడి ఆంధ్రలో విడుదలయిన జీవో అమలుతో పాటుగా మరిన్ని చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలకు గురయిన వాటిపై దృష్టి పెడతాం. తొలుత వాటిని తొలగించేందుకు సర్వే చేయాలని ఆదేశాలు ఇస్తాం “అని చెప్పారు.

Courtesy BBC