ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. మనిషి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కుల పిచ్చి, కుల వివక్ష రాజ్యమేలుతున్నాయి. కులం పేరుతో మనిషిని మనిషే ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు. కుల వివక్ష వికృత రూపానికి అద్దం పట్టే ఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. దళితుడనే కారణంతో దహన సంస్కారాలకు అడ్డుపడ్డారు. కుల అహంకారంతో మృతదేహానికి దారివ్వని దారుణ ఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. వెల్లూరులో కుప్పన్‌ అనే దళితుడు చనిపోయాడు. దహన సంస్కారాల కోసం బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్తున్నారు. ఇంతలో స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొందరు పెద్దలు వారికి అడ్డుపడ్డారు. తమ పొలం నుంచి మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వారు ఎంత వేడుకున్నా ఆధిపత్య కులం వారి మనసులు కరగలేదు. మరో దారి లేక బంధువులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ వంతెన పైనుంచి స్ట్రెచర్‌ ద్వారా మృతదేహాన్ని కిందికి దించారు. అక్కడి నుంచి దహన వాటికకు తరలించారు. దీన్ని కొందరు వ్యక్తులు మొబైల్ లో షూట్ చేసి సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అయ్యింది.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరీ ఇంత దారుణమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనిషికన్నా కులం ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు. బతికున్నప్పుడు ఎలానూ గౌరవం ఇవ్వరు.. కనీసం చనిపోయాక అయినా గౌరవం ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నారు. మానవత్వం చూపించకపోవడం శోచనీయం అంటున్నారు. కులపిచ్చితో, అహంకారంతో దహన సంస్కారాలకు అడ్డుపడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పలార్ నది సమీపంలో శ్మశాన వాటిక ఉంది. అక్కడికి వెళ్లాలంటే.. అగ్రకులం వారి పొలాల మీదుగా వెళ్లాల్సిందే. మరో దారి లేదు. దీంతో నారాయణపురం గ్రామానికి చెందిన దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి 20 అడుగుల ఎత్తులో ఉంది. నాలుగేళ్లుగా వారు ఇలానే చేస్తున్నారు. మృతదేహాలను వంతెన పైనుంచి కిందికి దించి దహన సంస్కారాలు చేస్తున్నారు.

”కుప్పన్(55) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మృతదేహాన్ని పొలాల మీదుగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాము.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. గ్రామంలో దహన వాటికి లేకపోవడంతో నదికి సమీపంలోని ప్రాంతంలో దహన సంస్కారాలు చేస్తున్నాము. పొలాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోడంతో.. నిచ్చెన సాయంతో మృతదేహాలను బ్రిడ్జి పైనుంచి కిందికి దించుతున్నాము. నాలుగేళ్లగా ఇదే విధంగా చేస్తున్నాము” అని నారాయణపురం గ్రామస్తుడు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అగ్రకులానికి చెందిన వారు తమను చంపేస్తారనే భయంతో సైలెంట్ గా ఉంటున్నామని వెల్లడించారు.

ఇప్పుడీ వీడియో వైరల్ కావడంతో అధికారుల్లో చలనం వచ్చింది. వెల్లూరు కలెక్టర్ షణ్ముగ సుందరం స్పందించారు. దీనిపై విచారణ కోసం ఓ రెవెన్యూ బృందాన్ని పంపించారు. విచారణలో తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.

(Courtacy 10TV)