– ఏఐకేఎస్‌ నేతృత్వంలో దళితులు,గిరిజనులు, రైతుల ఆందోళన
– తమిళ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు
చెన్నై : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో దళితులు, గిరిజనులు, రైతులు రోడ్డెక్కారు. ఎన్నో ఏండ్లుగా తాము నివాస ముంటున్నప్పటికీ ఇంటి పట్టాలు కేటాయించకపోవడంపై రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దాదాపు 800 దళిత కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇప్పించాలనీ డిమాండ్‌ చేస్తూ జిల్లా లోని తెంకనికొట్టారు తాలుకాలోని రైతులు, దళితులు, గిరిజనులు ఆందోళన బాట పట్టారు. ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అనుబంధ సంఘమైన ‘తమిళనాడు వివసాయికళ్‌ సంఘం’ ఆధ్వర్యంలో వారంతా నిరసన ప్రదర్శనలు నిర్వహిం చారు. అలాగే గిరిజనులకు, వేలాది మంది రైతులకు భూమి పట్టాలను పంపిణీ చేయాలని, ఈ ప్రాంతంలోని గ్రామాలకు రవాణా సదుపాయాన్ని కల్పించాలని నిరసనలకు దిగారు. ఎర్రజెండాలు చేతబట్టుకొని వారంతా ఇందులో పాల్గొన్నారు. ఏఐకేఎస్‌ నాయకులు, నిరసనకారుల తమ డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని సమర్పించిన అనంతరం జిల్లా యంత్రాంగం వారికి హామీనిచ్చింది.
శిధిలావస్థలో దళితుల ఇండ్లు
ఈ తాలూకాలో పలు దళిత కుటుంబాలు.. శిధిలావస్థకు చేరుకున్న ఇండ్లలోనే దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ ఇండ్లను 1986 నుంచి 2006 మధ్య తమిళనాడు సర్కారు నిర్మించింది. అయితే ఇప్పుడవి పాడుబడిపోవడంతో అందులో నివసించడం ప్రమాదకరంగా మారింది. ‘ఇక్కడి ఇండ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అవి నివా సానికి ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి శిధిలమైన ఇండ్లను పునరుద్ధరించాలి” అని ఏఐకేఎస్‌ జిల్లా సెక్రెటరీ ప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. ఇక్కడ దాదాపు 800 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. అయినప్పటికీ ఇండ్లకు సంబంధించిన పట్టాలు వారికి ఇప్పటికీ అందకపోడం గమనార్హం.
భూమిపై హక్కులకు గిరిజనుల డిమాండ్‌
ఇరులార్‌ తెగకు చెందిన గిరిజనులకు ఈ తాలూకా పుట్టినిల్లు. కానీ, వారికి ఇప్పటికీ భూమికి సంబంధించిన పట్టాలు లేకపోవడం గమనార్హం. షెడ్యూల్డ్‌ తెగలు ఇతర అటవీ వాసుల చట్టం, 2006 ప్రకారం.. భూ, ఇంటి పట్టాలను తమకు పంపిణీ చేయాలని ఇరులార్‌ తెగ గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. ”సదరు చట్టం ఏండ్ల కిందనే అమల్లోకి వచ్చినప్పటికీ ఈ తెగవారు పట్టాలు పొందే విషయంలో అణచివేతకు గురవుతున్నారు” అని ప్రకాశ్‌ వివరించారు. భూ, ఇంటి పట్టాలు కల్పించకపోవడంతో అనేక గిరిజన కుగ్రామాల ప్రజలు కనీస ప్రాథమిక అవసరాలకు సైతం నోచుకోలేకపోతున్నారు.
పట్టాలు లేని 40వేల ఎకరాల వ్యవసాయ భూములు
ఈ తాలూకాలో గ్రానైట్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఇక్కడ రెండు గ్రామాల రైతులకు చెందిన 40వేల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. కానీ, చట్టం పేరు చెబుతూ రైతులకు పట్టాలను సర్కారు తిరస్కరిస్తున్నది. అంతేకాకుండా మైనింగ్‌ కంపెనీలకు కొమ్ముకాస్తున్నది. అలాగే జిల్లావ్యాప్తంగా హెటెన్షన్‌ పవర్‌ లైన్స్‌, గెయిల్‌ పైప్‌ లైన్స్‌ వంటి పెద్దపెద్ద ప్రాజెక్టులను చేపట్టడంతో తాము భూములు కోల్పోవాల్సివస్తుందనీ, తగిన నష్టపరిహారం లభించదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Courtesy Navatelangana…