బీజేపీ మహిళా అభ్యర్థిపై కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు

భోపాల్‌ : కాంగ్రెస్‌ నుంచి ఇటీవల బీజేపీలో చేరి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఓ మహిళా అభ్యర్థి పట్ల మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్వాలియర్‌లోని డాబ్రా నియోజకవర్గంలో ఎన్నికల సభలో కమల్‌నాథ్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ అభ్యర్థి సాధారణమైన వారని, ఆమె లా ‘ఐటెం’ కాదని బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవిని ఉద్దేశించి అన్నారు. మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 3నఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. కమల్‌నాథ్‌కు నోటీసు పంపిస్తామని, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని జాతీయ మహిళా కమిషన్‌ పేర్కొంది. దళిత మహిళను కించపరచినందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై బీజేపీలోనూ నిరసనలు వ్యక్తమయ్యా యి. కమల్‌నాథ్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లేఖ రాశారు. ఇమర్తీ దేవికి క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర మంత్రి తోమర్‌ లేఖ రాశారు. దళిల మహిళలను గౌరవించడం కమల్‌నాథ్‌కు తెలియదని ఇమర్తీ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా, కేంద్ర మంతి నరేంద్ర సింగ్‌ తోమర్‌, రాష్ట్ర మంత్రులు కమల్‌నాథ్‌ వైఖరిని నిరసిస్తూ సోమవారం మౌనదీక్ష చేశారు.

Courtesy Andhrajyothi