మహిళలపై సామూహిక లైంగికదాడులు

పాట్నా : ఓ వైపు దేశం యావత్తు… హత్రాస్‌ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా బీహార్‌లో మరో దారుణం ఘన వెలుగుచూసింది. మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన దుర్మార్గులు.. ఐదేండ్ల చిన్నారి సహా ఆమెను నదిలో పడేశారు. బక్సర్‌ జిల్లా ఒజా బరోన్‌ గ్రామానికి చెందిన మహిళ, తన ఐదేండ్ల కుమారుడితో కలిసి బ్యాంకుకు వెళ్తుండగా దుండగులు వారిని అపహరించారు.

అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలిని ఆమె కుమారుడిని తాళ్లతో కట్టేసి పక్కన ఉన్న నదిలోకి విసిరివేశారు. మహిళ అరుపులు విన్న స్ధానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు మహిళను కాపాడగలిగారు కానీ.. నీటి ఉధృతికి బాలుగు మృతిచెందాడు. ఈ దారుణంపై స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

సివిల్స్‌ పరీక్ష జరుగుతుండగానే…
యూపీలోని ఝాన్సీలో మరో దారుణం వెలుగుచూసింది. ఈ నెల 11న ఓ పాలిటెక్నిక్‌ కాలేజీలో సివిల్‌ సర్వీసుల పరీక్ష జరుగుతుండగానే.. 17 ఏండ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తన స్నేహితుడిని కలుసుకోవడానికి వెళ్లిన ఆమెను దాదాపు 12 మంది విద్యార్థులు బలవంతంగా లాక్కుపోయారు. ఆమె ఫ్రెండును కొట్టారు. వారిలో ఒకడు బాధితురాలిపై దారుణానికి పాల్పడగా ఇతర విద్యార్థులు దానిని వీడియో తీశారు. కాలేజీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నప్పటికీ ఈ ఘోరం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు భరత్‌ అనే విద్యార్థితో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇతరులకోసం గాలిస్తున్నారు.

Courtesy Nava Telangana