దూషించిన ఎంపీటీసీ తండ్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

మోటకొండూర్‌ : అగ్రకుల అహంకారంతో ఓ వ్యక్తి దళిత మహిళా సర్పంచ్‌ను చిన్నచూపు చూశాడు. ఆమెకు తెలియకుండానే గ్రామ సమావేశాలు నిర్వహించడం, తన మాటే వేదంగా నడుచుకోవాలని చెప్పడమేగాక కులం పేరుతో దూషిస్తున్నాడు. దీంతో బాధితురాలు సహనం కోల్పోయి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలో సోమవారం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ముత్తిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్‌ ఆడెపు విజయ దళితురాలు. అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ అగ్రకులానికి చెందిన 19ఏండ్ల యువతి (అగ్రకులం) కావడంతో ఆమె తండ్రి చాడ శశిధర్‌రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నాడు. సర్పంచ్‌ను పిలువకుండానే గ్రామ సమావేశాలు పెడుతూ ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ప్రతి కార్యక్రమంలోనూ సర్పంచ్‌ పట్ల వివక్షచూపుతూ కులం పేరుతో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దూషిస్తున్నాడు. తాను చెప్పిందే వినాలంటూ బెదిరిం చసాగాడు. ఈయనతో పాటు ఉప సర్పంచ్‌ కొమ్మగాని ప్రభాకర్‌ కూడా సర్పంచ్‌ పట్ల వివక్ష చూపుతున్నాడు. సహనం కోల్పోయిన సర్పంచ్‌ విజయ వారిద్దరిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, ఎస్‌ఐ వెంకన్న ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టి సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.

Courtesy Nava Telangana