తూర్పుగోదావరి’ ఘటనపై విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ, అమరావతి, రాజమహేంద్రవరం: ఇసుక అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు దళిత యువకుడిని పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్రం గా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. వైసీపీ నాయకుడి ఫిర్యాదు ఆసరాగా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లో గతనెల 18న దళిత యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌కు పోలీసుల సమక్షంలోనే శిరోముండనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ‘నక్సల్స్‌లో చేరి పరువు కాపాడుకుంటాను..అనుమతి ఇవ్వండి’ అంటూ బాధితుడు ప్రసాద్‌ రాష్ట్రపతి గ్రీవెన్స్‌కు ఈనెల 10న లేఖ రాశారు. లేఖపై 24 గంటల్లోపే రాష్ట్రపతి స్పందించారు.

ఘటనపై విచారణ జరపాల్సిందిగా సూచిస్తూ ఏపీ జీఏడీ(సాధారణ పరిపాలన విభాగం) సహాయ కార్యదర్శి ఎ.జనార్ధన్‌బాబుకు బాధితుడి లేఖ ను రాష్ట్రపతి కార్యాలయం పంపించింది. అలాగే, అమరావతి సచివాలయంలోని ఏపీ జీఏడీ సహాయకార్యదర్శి జనార్ధన్‌బాబును కలిసి, కేసుకు సంబంధించిన వివరాలు, ఆధారాలు అందించి సహకరించాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సమాచారం అందింది. కాగా, ‘నన్ను తీవ్రంగా అవమానించినవారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పటికీ నాకు న్యాయం జరగకపోతే నక్సల్స్‌లో చేరిపోయి నా పరువు కాపాడుకుంటాను. నక్సల్స్‌లో చేరడానికి అనుమతించాలి’ అని ఆ లేఖలో ప్రసాద్‌ రాష్ట్రపతిని మొరపెట్టుకున్నారు.  కాగా, నక్సల్స్‌ లో చేరతానని లేఖ రాయడాన్ని ఏలూరు డీఐజీ తప్పుపట్టారు. దీనికి చట్టప్రకారం చర్య తీసుకుంటామని, ప్రసాద్‌ వెనకాల ఎవరున్నారో తనకు తెలుసునని, వారిపై కూడా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈనెల 14వ తేదీలోపు బాధితుడికి న్యాయం జరగకపోతే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మునికూడలిలో నల్లజెండా ఎగరవేస్తానని హెచ్చరించారు. అంతేకాక ఏపీలోని అన్ని దళితవాడల్లోనూ నల్లజెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితుడికి వెంటనే సాయం అందజేయడంలో జాప్యం చేసిన అధికారులు మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్‌ ఇంటికి వెళ్లి రూ.50వేల చెక్కును అందజేశారు. కాగా, దళితులపై దాడులను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో టీడీపీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద ఆందోళన లు నిర్వహించారు. కాగా, ఈ కేసులో అసలు నిందితులపై సత్వర చర్యలు చేపట్టాలని జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ చైర్మన్‌కు టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారం లేఖ రాశారు.

Courtesy Andhrajyothi