ఔరంగాబాద్: దేశంలో దళితులపై దాడులు ఆగడం లేదు. అగ్రవర్ణాలు ఆధిపత్య భావజాలంతో నిమ్నవర్గాలపై దారుణాలకు దిగుతున్నాయి. పరువు పేరుతో పాశవిక హత్యలకు పాల్పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఆధిపత్య కులానికి చెందిన ఓ యువతి.. దళిత యువకుడితో వెళ్లిపోయిందన్న అక్కసుతో అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంబంపై దాడి చేశారు. యువతితో కలిసి వెళ్లిపోయిన యువకుడి మైనర్ తమ్ముడిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి, తల నరికి చంపారు. వైజాపూర్ తాలుకాలోని ఖండాల గ్రామంలో మార్చి 14న ఈ కిరాతక ఘటన చోటుచేసుకుంది.

వైజపూర్ ఎస్ ఐ అనంత్ కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం.. ఖండాల గ్రామానికి చెందిన దేవీదాస్ ఛగన్ డియోకర్ తన కూతురు ప్రియాంక(20) కనబడటం లేదని మార్చి 12న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గ్రామానికే చెందిన అమోల్ గైక్వాడ్(22) ఆమెను తీసుకెళ్లిపోయాడని దేవీదాస్ అనుమానించాడు. తర్వాతి రోజు(మార్చి 13) ఆమోల్ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అమోల్ తో తమ కుమార్తె వెళ్లిపోయిందని నిర్ధారించుకున్న దేవీదాస్, అతడి సోదరుడు రోహిదాస్ కలిసి అమోల్ కుటుంబంపై మారణాయుధాలతో దాడి చేశారు. అమోల్ తమ్ముడు భీమ్‌రాజ్‌ గైక్వాడ్‌(17)ను కిరాతంగా చంపేశారు. అడ్డొచ్చిన అమోల్ తండ్రి బాలాసాహెబ్, తల్లి అల్క, ఇతర కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ సహా హత్యానేరం, మూకుమ్మడి దాడి తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టు ఆదేశాల ప్రకారం రిమాండ్ కు తరలించారు.

ఈ కేసులో నిందితులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని దళిత సంఘాలు ఆరోపించాయి. సమగ్ర విచారణ చేయించి, న్యాయం చేయాలని దళిత సంఘాలు ఆందోళ చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర హోం మంత్రి స్పందించారు. ఔరంగాబాద్ పోలీసులతో నిష్పక్షపాత విచారణ చేయిస్తామని హోంమంత్రి హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు శాంతించాయి. దేశంలో కొనసాగుతున్న అగ్రకుల ఆధిపత్య భావజాలానికి ఈ ఘటన అద్దం పడుతోందని దళిత, బహుజన మేధావులు పేర్కొంటున్నారు.