నిధులున్నా ఖర్చు చేయని వైనం
క్యారీఫార్వర్డ్‌ కాని సబ్‌ప్లాన్‌ నిధులు

దళిత సంక్షేమానికి కేటాయించిన నిధులను వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రతి సంవత్సరం దళిత ప్రత్యేకాభివృద్ధికి నిధులు కేటాయించడం తప్ప వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదు. వివిధ అభివృద్ధి పనుల కోసం ఆయా శాఖలు బీఆర్‌వోలు విడుదల చేసి చేతులు దులుపుకోవడం తప్ప దళిత సంక్షేమానికి పాటుపడలేదు. గత ఐదేండ్ల కాలంలో ఎస్సీ ప్రత్యేకాభివృద్ధి నిధికి రూ. 68, 585 కోట్లు కేటాయించారు. అందులో నుంచి ఇప్పటి వరకు రూ.30,247.97 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లెక్క ప్రకారం చూస్తే గత ఐదేండ్లలో ఎస్సీల అభివృద్ధి కోసం 20 శాతం కన్నా తక్కువ ఖర్చు చేశారు. ఇందులోనూ సాధారణ పథకాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగించి దళిత సంక్షేమానికి వినియోగించినట్టు లెక్కలు చూపడం గమనార్హం

ఈ ఏడాదిలో కేవలం ఒక్క శాతమే
ఎస్సీ సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో ఈ ఏడాది కనీసం ఒక్క శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. 2019-20 సంవత్సరానికి గాను దళిత ప్రత్యేకాభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 14వేల కోట్లు కేటాయించింది. ఇందులో నుంచి ఈ సంవత్సరం వరకు రూ. 6,68,03 కోట్లకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు ఇవ్వగా అందులో నుంచి రూ. 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మిషన్‌ భగీరథ లాంటి సాధారణ పథకాల కోసం రూ. 240 కోట్లు దారి మళ్లించారు.

నిధులు తగ్గించినా..
ఆర్థిక మాంద్యంతో 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో దళిత ప్రత్యేకాభివృద్ధి నిధిలో భారీ కోత విధించింది. 2018-19 బడ్జెట్‌లో రూ. 16,452 కోట్లు కేటాయించగా, 2019-20 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ. 16, 581 కోట్లు చూపింది. పూర్తి స్థాయి బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ. 14వేల కోట్లు మాత్రమే కేటాయించింది. నిధులు తగ్గించినా ఉన్న డబ్బులను కూడా వాడలేదు. మరో మూడు నెలల్లో బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. క్యారీఫార్వర్డ్‌ విధానాన్ని తెచ్చినా అది అమలుకు నోచుకోకపోవడంతో ప్రత్యేకాభివృద్ధి నిధులు మురిగిపోతున్నాయి.

రుణాలు అంతంతే..
ఈ ఏడాదికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన యాక్షన్‌ ప్లాన్‌ కూడా అమలుకు నోచుకోలేదు. 2019లో సుమారు 40వేల మందికి రుణాలు అందించాలని కార్యాచరణ రూపొందించినా కనీసం నాలుగువేల మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి సుమారు 60 వేల మంది రుణాలు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

(Courtesy Nava Telangana)