– ఇంకా వెంటాడుతున్న అంటరానితనం
– తమిళనాడులో కులవివక్ష

కడలూరు : మిగిలిన సభ్యులందరూ కుర్చీల్లో కూర్చుంటే… సర్పంచ్‌ అయినా ఆమె కింద కూర్చోవాల్సిందే. దళితురాలు కావటమే అందుకు కారణం. దేశంలో కులవివక్ష కొనసాగుతుందనటానికి తాజాగా మరో ఘటన సాక్షీభూతంగా నిలిచింది. తహిళనాడు కుడ్డలూర్‌లోని వెలుగుచూసిన
ఘటన వివరాల్లోకి వెళితే.. తెర్కుతిట్టై గ్రామానికి దళిత మహిళ రాజేశ్వరి ఈ ఏడాది జనవరిలో సర్పంచ్‌గా ఎన్నికయ్యింది. అయితే వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌ రాజన్‌ ఆధ్వర్యంలో జరిగే పంచాయత్‌ బోర్డు మీటింగులో దళిత మహిళా సర్పంచ్‌ రాజేశ్వరిని నేలపైనే కూర్చోవాలని ఆదేశిస్తున్నారు. దీంతో చేసేదేమి లేక ఆమె నేల మీదే కూర్చుంటున్నది. సభ్యులందరూ మాత్రం కుర్చీల్లో ఆశీనులవుతున్నారు. సర్పంచ్‌గా ఆమె ఎన్నికైన నాటి నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని మీటింగుల్లోనూ కిందే కూర్చున్నానని రాజేశ్వరి వాపోయారు. సభ్యులందరూ వన్నియార్‌ సామాజిక వర్గానికి చెందిన వారనీ, ప్రతీ పంచాయతీ బోర్డు మీటింగ్‌లోనూ తనను కింద కూర్చోవాలని సభ్యులు ఆదేశిస్తారని ఆమె చెప్పారు.

‘జెండాను ఎగరవేయటానికి కూడా నాకు అనుమతిలేదు. అందుకు నాకు అర్హతలేదని చెప్పారు. దీనికి నేను అభ్యంతరం చెప్పేందుకు ప్రయత్నించగా మోహన్‌ రాజన్‌ నన్ను బెదిరించాడు’ అని రాజేశ్వరి తెలిపారు. కాగా ఆమె నేలపై కూర్చున్న ఫొటో వైరల్‌ కావటంతో ‘నేలపై కూర్చోవాలన్నది ఆమె సొంత నిర్ణయం’ అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు రాజన్‌.

తెర్కుతిట్టై గ్రామంలో దాదాపుగా 500 కుటుంబాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువగా వన్నియార్‌ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అలాగే సుమారు 100 వరకు ఎస్సీ కమ్యూనిటీ చెందిన వారున్నారు. ఈ పంచాయతీని ఎస్సీ రిజర్వుడుగా ప్రకటించారు. కాగా, రాజేశ్వరి గురించి విషయం తెలుసుకున్న పోలీసులు వైస్‌ ప్రెసిడెంట్‌ మోహన్‌ రాజన్‌పై హిందూ క్యాస్ట్‌, సెక్షన్‌ 3 (1) (ఆర్‌) కింద ఎస్సీ/ఎస్టీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశారు.

Courtesy Nava Telangana