• మురళి బాటలోనే మరో ఆరుగురు ఐఏఎస్‌లు
  • అప్రధాన శాఖలపై అసహనంతో వీఆర్‌ఎస్‌కు సిద్ధం
  • ఎస్సీ, ఎస్టీలపై చులకన భావం :పలువురి మనోగతం 
    తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఐఏఎస్‌లు గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం మూట గట్టుకుంటున్నది. ఈ విషయాన్ని ఆయా వర్గాల ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పలుమార్లు సర్కారు దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదన్న ఆవేదనలో వారు ఉన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తే మరిన్ని సమస్యలు తప్పవన్న ఉద్దేశంతో కొందరు సెలవుపై వెళ్లి తమ నిరసనను పరోక్షంగా వ్యక్తం చేశారు. అయినా సర్కారు నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ఆవేదనతో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దళిత, గిరిజన ఐఏఎస్‌లకు అప్రధాన శాఖలు కేటాయిస్తున్నారంటూ బాహాటంగా విమర్శించారు. ఐఏఎస్‌ల పట్ల ఇలాంటి వివక్ష తగదన్నారు.
    అదే బాటలో మరి కొందరు 
    ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే మరి కొందరు దళిత, గిరిజన ఐఏఎస్‌లు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. వీరందరూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తాము ఏ విధమైన వివక్షను ఎదుర్కొంటున్నామో ఆ విషయాలను ఇటీవల ఈ ఐఏఎస్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి వివరించినట్టు తెలిసింది. తమను అప్రధాన శాఖలను కేటాయించడంలో ఆంతర్యమేమిటనీ, దళితులమైనందుకే తమను చిన్న చూపు చూస్తూన్నరంటూ సీఎస్‌ ఎదుట సదరు అధికారులు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారనీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర ఐఏఎస్‌లను చులకనగా చూస్తున్నారని సీఎస్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ సీనియారిటిని పరిగణనలోకి తీసుకోకుండా అప్రధాన శాఖల్లో డైరెక్టర్లుగా నియమించడం, తమ కండ్ల ముందే ఐఏఎస్‌ పూర్తి చేసుకున్న జూనియర్లకు తాము సమాధానం చెప్పాల్సిన దుస్థితి కల్పించారు. ఇది న్యాయమేనా? ప్రధానంగా సచివాలయంలో ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న వారిని, ఇతర శాఖలకు కమిషనర్‌గా బదిలీ చేయడమేంటని నిలదీసినట్టు సమా చారం. ఉద్యోగ విరమణ వయస్సు దగ్గర పడుతున్నప్పుడు ప్రమోషన్లు కల్పిం చాల్సి ఉండగా, డిమోషన్లు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

మాట వినని వారిని కూడా.. 
సర్కారు మాట వినని ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తున్నారన్న ఆందోళన కూడా ఇతర ఐఏఎస్‌లలో వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను అమలు చేయలేమనీ, పాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కోర్టుల ముందు నిలబడాల్సి వస్తుందని కొందరు ఐఏఎస్‌లు అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా వైఎస్‌ హయాంలో జరిగిన ఉదంతాలను మరికొందరు సీనియర్‌ ఐఏఎస్‌లు సీఎస్‌కు వివరించారు. మాట వినని ఐఏఎస్‌ను వెంటనే అక్కడి నుంచి అప్రధాన శాఖలకు బదిలీ చేయడం సముచితం కాదంటూ వారు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
రాజకీయ ఒత్తిళ్లు 
ఐఏఎస్‌లపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయనీ, వారు చెప్పింది వినకుంటే అందరి ముందు బదిలీ చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్‌లు రాష్ట్రానికి మార్గదర్శకుల్లాంటి వారు.అవసరాన్ని బట్టి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొంచి పని చేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేననీ, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించా లని కొందరు విశ్రాంత ఐఏఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. అధికారులను స్వేచ్ఛగా పని చేయనిస్తేనే పాలన సజావుగా కొనసాగుతుందన్నారు. ముఖ్య మంత్రి రక్షణ కోసం పోలీసులు ఎలా చెబితే అలా సీఎం నడుచుకోవాల్సి ఉంటుం దనీ, అదే విధంగా ప్రజా సంక్షేమం కోసం ఐఏఎస్‌ అధికారులు సూచించిన విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని తెలిపారు. అధికారం కోసం ప్రభుత్వం ఆదేశించిన విధంగా నడుచుకోవాలన్న నిబంధనలు లేవని అభిప్రాయపడ్డారు.
వివక్షతోనే వీఆర్‌ఎస్‌ : కేవీపీఎస్‌ 
ప్రభుత్వం దళిత ఐఏఎస్‌ పట్ల చూపుతున్న వివక్షతోనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిగల్ల భాస్కర్‌, టి స్కైలాబ్‌ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. పేదల సంపూర్ణ సాధికరత ప్రగాఢ సంకల్పంతో ఆకునూరి మురళి పని చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ హాయాంలో 16 మంది దళిత, గిరిజన ఐఏఎస్‌ అధికారుల పట్ల వివక్ష, అణిచివేతకు గురయ్యారని తెలిపారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినతి పత్రం సమర్పించినా ప్రభుత్వంలో మార్పు రాలేదని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు మురళి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాల కోసం ఎంతగానో శ్రమించారన్నారు. ఒక కలెక్టర్‌గా ఆదివాసి గూడెంలో నిద్ర చేపట్టారని గుర్తు చేశారు. ఇలాంటి వారికి పదోన్నతులు ఇవ్వకుండా అప్రధాన శాఖ కేటాయించడం అన్యాయమని విమర్శించారు.

 

                                                                                      (Courtacy Nava Telangana)