దేశవ్యాప్తంగా కులదురహంకారులు మళ్లీ పెట్రేగిపోతున్నారు. తమ కులమే గొప్ప అన్న ఆధిపత్య భావజాలంతో కిరాతకాలకు ఒడిగడుతున్నారు. కుల కావరంతో కళ్లుమూసుకుపోయి కన్నబిడ్డలను కూడా కడతేరుస్తున్నారు. తాజాగా తెలంగాణ, మహారాష్ట్రలో జరిగిన దారుణోదంతాలు ప్రగతిశీల వాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సమాజం ఎంతో పురోగమించినా పెత్తందారీ పోకడలు కొనసాగుతుండటం కలవరం కలిగిస్తోంది. పాలకుల ఉదాసీనత, న్యాయవ్యవస్థలోని లొసుగులు అగ్రకులాల ఆగడాలకు కళ్లెం వేయలేకపోతున్నాయి.

తెలంగాణలో పరువు తక్కువ హత్య
తమ కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించిందన్న ఏకైక కారణంతో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో కూతురిని తల్లిదండ్రులు హతమార్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం… కలుకుంట్లలోని భాస్కర్‌శెట్టి, వీరమ్మ దంపతుల పెద్ద కూతురు దివ్య(20).. ఏపీలోని కర్నూలులో సెయింట్‌ జోసఫ్‌ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. కరోనా లాక్‌డౌన్‌తో గత రెండు నెలలుగా స్వగ్రామంలోనే ఉండిపోయింది. ఒంట్లో బాలేకపోవడంతో ఆమెను ఇటీవల కర్నూలులోని పప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు.

ఇంటికి వెళ్లాక నిలదీస్తే.. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని దివ్య చెప్పింది. అబార్షన్‌ చేయించుకోవడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో జూన్‌ 6వ తేదీ అర్ధరాత్రి నిద్రిస్తుండగా కూతురిని గొంతు పిసికి చంపేశారు. తమ కుమార్తె గుండెపోటుతో చనిపోయిందని అందరికీ అబద్ధం చెప్పారు. ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణోదంతం వెలుగులోకి వచ్చింది. తక్కువ కులానికి చెందిన యువకుడిని ప్రేమించడం.. పెద్ద కూతురు కులాంతర వివాహం చేసుకుంటే మిగతా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కావన్న ఆలోచనతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసు విచారణలో నిందితులు వెల్లడించారు.

దళిత యువకుడి దారుణ హత్య
అగ్ర కులానికి చెందిన యువతిని ప్రేమించాడన్న అక్కసుతో దళిత యువకుడిని దారుణంగా హింసించి హత్య చేసిన ఘటన మహారాష్ట్రలో పుణే సబర్బన్‌ పింపల్‌ సౌదాగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. విరాజ్‌ విలాస్‌ జాగ్తాప్‌(20) అనే యువకుడు ఆధిపత్య కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. దీంతో అమ్మాయి తరపువారు చాలాసార్లు విరాజ్‌ను బెదిరించారు. జూన్‌ 7న రాత్రి మాట్లాడుకుందాం రమ్మని పిలిచి తమ ఇంటికి పిలిచారు. అమ్మాయి ఇంటికి వెళ్లిన విరాజ్‌ను కులం పేరుతో దూషించి, అసభ్యకరమైన పదజాలంతో యువతి తల్లిదండ్రులు ఘోరంగా అవమానించారు.

అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోతున్న అతడిని వెంబడించి కారుతో ఢీకొట్టి రాళ్లు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. యువతి తండ్రి విరాజ్‌ ముఖంపై ఉమ్మి తన కులదరహంకారాన్ని ప్రదర్శించాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడివున్న విరాజ్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ విరాజ్‌ మృతి చెందాడు. మృతుడి బాబాయ్‌ జితేశ్‌ జాగ్తాప్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దర మైనర్లు సహా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. అయితే తమ కుమార్తెను వేధింపులకు గురిచేయడం వల్లే విరాజ్‌తో తాము గొడవ పడినట్టు నిందితులు పోలీసులతో చెప్పినట్టు సమాచారం.

కులదురహంకార హంతకులను కఠినంగా శిక్షించాలి
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామంలో కులదురహంకార హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 కులదురహంకార హత్యలు జరిగాయని, ప్రభుత్వం నిందితుల పట్ల ఉదాసీనంగా ఉండడం వల్లే ఈ హత్యలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.

గతంలో సిద్ధిపేట జిల్లా గౌరవెల్లిలో ఒక యువతిని ఇంట్లో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి కుల దురహంకార హత్య చేశారని గుర్తు చేశారు. మంచిర్యాలలో కూతురును ముక్కలుముక్కలుగా కోసి చంపి బొక్కల వాగులో వేశారని, నిజామాబాద్‌లో రోజారెడ్డిని కన్న తల్లిదండ్రులే చంపేశారని పేర్కొన్నారు. కులం, కుల కట్టుబాట్లు ప్రజల్లో బలంగా నాటుకోవడం వల్లనే ఇలాంటి కులదురహంకార హత్యలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ దిగజారుడు హత్యలను అరికట్టాల్సిన అవసరముందన్నారు. కులాన్ని, కుల అహంకారాన్ని చంపాలని.. కుల పరువు అనే పనికిమాలిన పదాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత కార్యకర్త మృతిపై జనాగ్రహం