రచన సూరజ్ ఎంగ్డే

ఒక నిజాన్ని మనం ఒప్పుకోవాలి. మనది వ్యవసాయ ప్రధాన దేశం. అలాగే కులం ప్రధాన దేశం కూడా. ఈ రెండింటినీ మిళితం చేస్తే మనది కుల వివక్ష ప్రధాన వ్యవసాయ దేశంగా చెప్పుకోవచ్చు.

ఈ తరహా వ్యవస్థ పేదరికాన్ని అత్యాచారాలను మరింతగా పెంచుతుంది. మరోపక్క ఉత్పాదకత తగ్గుదలకు ఇదొక ప్రధాన కారణం.

భారతదేశంలో దళితులు స్వతంత్రంగా లేరు. వీరు విస్థాపితులు. తమ భూమి నుంచే తాము నిర్వాసితులు. మీరంటే రాజ్యానికి అసలు లెక్కలేదు. భూమి లేని తనం దళితుల్ని భారతీయతకు దూరం చేస్తున్నది. న్యాయమైన, రాజ్యాంగపరమైన హక్కులకు దూరంగా ఉంచుతున్నది. దళితులకు నేడు మరొక స్వేచ్ఛాయుత ఊపిరి అవసరం. అదే భూమిపై హక్కు. భూమిపై హక్కు సమానంగా ఏర్పడితే వారు సాధికారత సంతరి చుకోగలుగుతారు. ఈ హక్కు కాగితాలకే పరిమితమై ఉండరాదు.

పౌరులకు వనరులపై హక్కు ఉండాలి.. భూమి ముఖ్యమైన వనరు. భూమి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. భూమిలేని తనం అభద్రతాభావానికి దారితీస్తుంది. సామాజిక ఆర్థిక సంబంధాలన్నీ ప్రధానంగా భూమి చుట్టూ తిరిగేవే. అటువంటి సమాజంలో దళిత బహుజనులకు భూమి ఉండటమనేది ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. భూమి లేకపోవడమనేది జీవిత కాల నష్ట దాయతకు సంకేతం అవుతుంది.

దళితులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భూమి లేని తనమే ప్రధాన కారణం. దేశంలో భూమి అగ్రవర్ణాల చేతిలో కేంద్రీకృతమై ఉన్నది.2015 -16 సెన్సస్ ప్రకారం దళితుల్లో కేవలం 8శాతం మంది కి మాత్రమే వ్యవసాయ భూమి ఉన్నది. కుల జన గణన లెక్కల ప్రకారం 71 శాతం దళితులు భూమిలేని వ్యవసాయ కార్మికులు. గ్రామీణ ప్రాంతాల్లోని 58.4 శాతం దళిత కుటుంబాలకు అసలు భూమే లేదు. అధికంగా ఉన్న హర్యానా బీహార్ వంటి రాష్ట్రాల్లో 85 శాతం మంది దళితులు భూస్వాముల దయాదాక్షిణ్యాల కింద ఆధార పడాల్సి ఉంది. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్ లలో 60 శాతం దళితులది ఇదే పరిస్థితి. బీహార్, హర్యానా, పంజాబ్ ,గుజరాత్, తమిళనాడు, కేరళలోని చాలా జిల్లాల్లో 90 శాతం దళితులు వ్యవసాయ కార్మికులు.

దీంతో ఈ పరిస్థితిని అధిగమించడానికి చాలా మంది దళితులు నగరాలకు వలస వెళ్లి అతి తక్కువ వేతనానికి పని చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇంటిపని వారు సెక్యూరిటీ గార్డులు వంటి తాత్కాలిక పనుల్లో కాలం నెట్టుకొస్తున్నారు. 2011 గణాంకాల ప్రకారం 8.33% భూమిలేని దళితకుటుంబాలు తాత్కాలిక పనులు బిక్షాటన శాత  సైతం చేస్తున్నారు. గతంలోని ప్రణాళికా సంఘం మొదటినుంచి భూసంస్కరణలు అవసరాన్ని నొక్కి చెప్పింది. 1961 నుంచి భూపరిమితి చట్టాలు వచ్చాయి 10 నుంచి 54 ఎకరాల మధ్య వివిధ ప్రాంతాల్లో సీలింగ్ వచ్చింది. కానీ నేటికీ అత్యధికశాతం దళితులు భూమి లేనివారుగానే ఉన్నారు. ప్రస్తుత బ్రాహ్మణ – బనియా పెట్టుబడిదారీ విధానంలో ఆదివాసీలది సైతం ఇదే పరిస్థితి. భూమిలేని అన్ని కులాలు ఆదివాసీలు రకరకాల సిద్ధాంతాల్ని అనుసరించేవారు దేశంలో ఉన్న 72 లక్షల ఎకరాల మిగులు భూమి పంపిణీ కోసం పోరాటాలు చేయాలి మన రాజ్యాంగ పీఠిక. రాడికల్ ప్రతిజ్ఞలు చేసింది. అన్యాయపు సమాజానికి న్యాయం, బానిస బతుకు లకు స్వేచ్ఛ, అసమానతలు తొలగించి సమానత్వాన్ని ప్రతిష్టించే వాగ్దానం చేసింది. 7000 కులాలు, ఉప కులాలు ఉన్న దేశంలో రాజ్యాంగపు హామీని నెరవేర్చుకునేందుకు పీడిత కులాలు వర్గాలు సంఘటితం కావాలి.

(వ్యాసకర్త హార్వర్డ్ కెన్నెడీ విద్యాలయంలో ఫెలో గా ఉన్నారు. క్యాస్ట్ మ్యాటర్స్ పుస్తక రచయిత)(హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో)