– దళితుడి హత్య
– 15 మందిపై కేసు

శివపురి : మధ్యప్రదేశ్‌లో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళితుడిని కాల్చి చంపిన దారుణం శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రేంజర్లు, పారెస్టు అధికారులు సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుడిని ఫతేపూర్‌ గ్రామవాసి మదన్‌(38)గా గుర్తించారు. అతని తండ్రి సంఘటన జరిగిన ‘మాధవ్‌ నేషనల్‌ పార్క్‌’లో ఫారెస్ట్‌ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. తమ కుటుంబంలోని ఇద్దరు మహిళలు (మమతా, కాజల్‌) ఆదివారం సాయంత్రం సమీప హ్యాండ్‌ పంప్‌ నుంచి నీరు తీసుకురావడానికి వెళ్ళారనీ, అదే సమయంలో.. అటవీ రేంజర్‌ సురేశ్‌ శర్మ కూడా అక్కడకు వచ్చాడని బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు నీటిని తీసుకువస్తుండటం చూసిన సురేశ్‌ శర్మ కులం పేరుతో ఆ మహిళలను దూషించాడు. ఈ గొడవ చివరకు పెద్దదయింది. శర్మ ఒక మహిళా కానిస్టేబుల్‌ను పిలిపించాడు.

విషయం తెలుసుకున్న మదన్‌, అదని సోదరుడు పంకజ్‌ ఘటనా స్థలివద్దకు వెళ్ళారు. గొడవ మరింత పెరిగ్గా.. మదన్‌పై శర్మ కాల్పులు జరిపాడని తెలిపారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామస్తులు పోలీస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అటవీ అధికారులు, సిబ్బందిపై కేసు నమోదుచేశారు. పెత్తందారులు వాడుకునే చేతి పంపు నుంచి నీళ్లు తీసుకురావటమే గొడవకు కారణమని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Courtesy Nava Telangana