అనగనగా ఒక ఊరు… దుర్భర దారిద్ర్యం.. హీరో పెద్దగా చదువుకోలేదు.. బాధ్యతలు.. అనేక చిన్న చిన్న పనులు చేసి ధనవంతుడైపోతాడు.. హీరోయిన్ ని పెళ్లిచేసుకుంటాడు. కుటుంబం అంతా నవ్వులతో నిలబడుతారు.. శుభం కార్డ్.. సినిమా అయిపోతుంది. మనమూ మర్చిపోతాం..

ఆ పిల్లవాడు ఆ సినిమాను మర్చిపోలేదు.. పగలూ రాత్రి ఆ సినిమా అతన్ని వెంటాడింది. ఆ హీరోలాగే గొప్పవాడైపోవాలని కలలు కన్నాడు.. ఆ హీరోలాగే ఇంట్లోంచి పారిపోయాడు. ఆ హీరోలాగా బొంబాయి చేరాడు… ఆ సినిమా నుండి జీవితం నేర్చుకున్నాడు.. ఆ సినిమా 1978లో వచ్చిన అమితాబ్ హీరోగా నటించిన ‘త్రిశూల్’. చిల్లిగవ్వ చేతిలో లేని అమితాబ్ రియల్ ఎస్టేట్ కింగ్ గా మారే ‘Rags to Riches’ టేల్. . ఆ పిల్లవాడు 17 సంవత్సరాల “రాజా నాయక్”.

కర్ణాటకలోని చిన్న ఊరు. నిరుపేద దళిత కుటుంబం. ఐదుగురు తోబుట్టువులలో పెద్దవాడు.. గంపెడు సంసారాన్ని ఈదలేక అష్టకష్టాలు పడుతున్న రైతుకూలీ తల్లిదండ్రులు చిన్న చిన్నవస్తువులు తాకట్టు పెట్టుకుంటూ రోజులను వెళ్లదీస్తున్న దుస్థితి. నీళ్ళతోనే కడుపునింపుకున్న రాత్రులు… అలవాటైన ఈ పేదరికంలో ఒక ఆదివారంనాడు చూసిన మూడు గంటల సినిమా రాజా నాయక్ లో ఏదో తట్టిలేపింది. పగలూ రాత్రి ఒకటే ఆలోచన.. అమితాబ్ లా గొప్పవాడు కావాలి.. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా బొంబాయి రైలెక్కాడు. ఎక్కడో తిరిగాడు.. పదహారేళ్ళకే ఎంతో పరిణితి సాధించాడు. ఎలాగైనా డబ్బుసంపాదించాలన్న కసితో ఇల్లు చేరాడు..

ఒకప్పుడు లక్ష పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని రాజానాయక్ సంవత్సర టర్నోవర్ ఇప్పుడు అక్షరాలా 65 కోట్లు.

దేశవ్యాప్తంగా MCS లాజిస్టిక్స్, అక్షయ్ ఎంట్రప్రెస్సెస్, బెంగళూరులో ‘పర్పుల్ హేజ్’ – 3 అతిపెద్ద కమర్షియల్ కాంప్లెక్సులు అతని సొంతం. 250 ఉద్యోగులకు పని కల్పిస్తున్న రాజాకు 3600 చదరపు గజాల డూప్లె భవనం ఒకప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగిన యాభై రెండేళ్ల రాజానాయక్ కు ఇప్పుడు BMW, బెంజ్, 2 స్కోడా కార్లు, 2 ఫోర్డ్ కార్లు ఉన్నాయి.

నమ్మకం కలగడం లేదు కదా?  ఇప్పుడు రాజానాయక్ కర్ణాటక’ దళిత్ ఛాంబర్ ఆఫ్ కామెర్స్ అండ్ ఇండస్ట్రీ’ (DICCI) కి ప్రెసిడెంట్ గా ఉన్నారు.. ఎలా సాధ్యమైంది. నిజమేనా? ఏం చేశాడు! అతని ముప్పై ఏళ్ల ప్రస్థానం ఏంటి?

బొంబాయి నుండి తిరిగి ఇల్లుచేరిన రాజాకు దీపక్ అనే పంజాబీ యువకుడు స్నేహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. తల్లి వంట గది డబ్బాలో దాచిన రెండు వేలు ఇచ్చింది. అప్పుచేసి మొత్తానికి పదివేలు కూడగట్టారు. తమిళనాడులోని తిరుప్హూరులోని బట్టల మిల్లుకు వెళ్లారు. ఎగుమతులు నిరాకరించిన (export rejected) టీ షర్టులను ఒక్కొక్కటీ యాభై రూపాయలకు కొనుగోలు చేశారు.

బెంగళూరుకులోని BOSCH కంపెనీ ఆఫీస్ ముందున్న ఫుట్పాత్ పై 100 రూపాయలకు ఒకటి అమ్మడం మొదలు పెట్టారు. ఆ టీషర్ట్ లు అన్నీ నీలి రంగు షేడ్ లో ఉండడం.. ఆ రంగు BOSCH కంపెనీ యూనిఫామ్ కావడంతో లంచ్ టైంలో ఉద్యోగులంతా ఎగబడి కొనేసారు. ఒక్కరోజులో పెట్టిన డబ్బు చేతికి వచ్చింది.

అది మొదలు ఎక్కడ ఏ వస్తువు చవకగా దొరికినా, ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుని, లోకల్ ఎక్సిబిషన్లలో అమ్మేవాళ్ళు. మిగిలిన సరుకును ఇద్దరే ఒక్కోవారం ఒక్కొక్క నగరంలో, టూరిస్ట్ స్థలాల్లో ఫుట్పాత్ పై అమ్మేవాళ్ళు. కిలోల కొద్దీ బనియన్లు, టవళ్ళు, ఇన్నర్ వేర్, కాటన్ హోజరీ ఐటమ్లనుండి టాయిలెట్ సామాను వరకూ ప్రతీ వస్తువు అమ్మారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. ప్రపంచాన్ని జయించాలి. గొప్పవాళ్ళం కావాలి. డబ్బు కూడబెట్టాలి. పన్నెండేళ్లు నిర్విరామంగా శ్రమించారు.

అనవసర ఖర్చుల జోలికి పోలేదు. వ్యసనాలకు దూరంగా ఉన్నారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టారు. వ్యాపారం మొదలుపెట్టి పదేళ్లు అయినా ఆఫీస్ పెట్టుకోలేదు. పంజాబీలు, అగ్రకుల గుజరాతీలు ఎక్కువగా చేపట్టే లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడి పెట్టారు. ప్యాకింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. లక్షలు వస్తున్నా చాలా నిరాడంబరంగాల్లో ప్రొఫైల్లోనే వ్యాపారం చేయసాగారు. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగారు.

రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు, ప్రైవేటీకరణ  సులభతరమైన లైసెన్సుల విధానం పదేళ్ళలో ఎదగడానికి దోహదం చేసాయంటారు రాజా. ఇప్పటికీ తన జీవితం కలలాగా అనిపిస్తుందట. ఆయనకు జీవితాన్నిచ్చిన దీపక్ ఈ మధ్యే మరణించారు. ముప్పై ఏళ్లపాటు చిందించిన స్వేదం కళ్ళముందు అద్భుతమై సాక్షాత్కరిస్తే మౌనమైపోతారు రాజా. ఎన్ని ఎదురుదెబ్బలు, ఎంత వివక్ష, ఎన్ని గాయాలో ఇక్కడికి చేర్చాయంటారు.

తన చెల్లిని విద్యకు దూరం చేసిన వివక్ష. తన వారికి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ‘కళానికేతన్ ఎడ్యుకేషన్ సొసైటీ’ స్థాపించి పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు.

చిన్నగదితో ప్రారంభమైన స్కూల్ ఇప్పుడు నాలుగంతస్థుల భవనం. అక్కడ టీచర్ గా ఉద్యోగానికి వచ్చిన పేద ఆటో డ్రైవర్ కూతురు అనితతో ప్రేమలో పడ్డాడు. వివాహం చేసుకున్నాడు. అతని సంస్థలకు అనిత ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్నారు. వారికి ముచ్చటైన ముగ్గురు కొడుకులు.

నడిరోడ్డు మీద ఉన్న రోజుల్లో దళితుడని అతను ఇచ్చిన నీటిని తాగని ఒక సంఘటన రాజా మరువలేదు. ‘జల్ ‘ డ్రాప్స్ పేరుతో వాటర్ బాట్లింగ్ యూనిట్ స్థాపించాడు. ఇప్పుడు రూ.9.50కి దొరికే జల్ నీళ్ళ బాటిళ్ల షేర్ అతని టర్న్ ఓవర్ లో యాభై శాతం.

రాజా నాయక్ అదృష్టాన్ని ఎన్నడూ నమ్ముకోలేదు. అలుపు లేని శ్రమ.కలల్ని సుసాధ్యం చేసుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కృషి ఉంటే అసాధ్యం అనేదే లేదని నిరూపించిన రాజా నాయక్ కథ స్ఫూర్తి దాయకం. త్వరలో పేదల కోసం, దళితుల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.

ఇంకా రాజా నాయక్ కు ఒక కల మిగిలే ఉందట. బిజినెస్ సర్కిల్లో గొప్పగా చెప్పుకునే 100 కోట్ల క్లబ్లో చేరాలని. ఈ మధ్యనే ‘ చియా’ బియ్యంతో నూనె తయారీని ప్రముఖ అంతర్జాతీయ సంస్థతో కలిసి చేపట్టారు.. త్వరలోనే ఆ మైలురాయిని కూడా చేరుకుంటారని ఆశిద్దాం.

రజిత కొమ్ము