మధ్యప్రదేశ్‌లో ఘటన
నలుగురి అరెస్టు

ఛతర్‌పూర్‌ (ఎంపీ) : ఓ పక్క కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు దళితులపై పెత్తందారులు దాడులకు ఎగబడుతూనే ఉన్నారు. గుర్రమెక్కాడని దళిత వరుడిపై దాడికి ప్రయత్నించారు కొందరు పెత్తందారులు.మధ్యప్రదేశ్‌లోని ఛత్‌పూర్‌ జిల్లా ఛాపర్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుడ్ని కొడుతూ గుర్రం మీది నుంచి కిందికి లాగిపడేసేందుకు ప్రయత్నించారు. అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ దాడికి యత్నించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంత దళితుల సాంప్రదాయం ప్రకారం.. పెండ్లికి ముందు ఊరేగింపుగా వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోవాలి. కాగా, గుర్రం మీద ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరిన తమపై పెత్తందారులు దాడికి తెగబడ్డారని వరుడు రాజేష్‌ అహిర్వర్‌ చెప్పారు, వరుడి తండ్రి శోభాలాల్‌ ఫిర్యాదుతో నిందితులను అరెస్టుచేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎస్సీ /ఎస్టీ (దురాగతాల నిరోధక) చట్టంకింద కేసు నమోదు చేసినట్టు సతారు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి దీపక్‌ యాదవ్‌ తెలిపారు.

Courtesy Nava Telangana