ముకుంద రామారావు

దైవభక్తి, ధర్మనిష్ఠ, ప్రేమ, సమానత్వం తరఫునే చోఖామేలా నిశ్శబ్ద పోరాటం చేశాడు. ఛాందసత్వం, కుల అహంకారం మీద తన అభిప్రా యాలు దాచుకోలేదు. ఏనాడూ ఎవరి దగ్గరా న్యూనతా భావాన్ని ప్రదర్శించలేదు. అతని కవితలు, విఠలుని మీద భక్తి ప్రధానమైనవే అయినా, అంటరానితనాన్ని ప్రస్తావించకుండా లేవు.

భక్తి ఉద్యమ మూలాలు దక్షిణ భారతదేశంలో 6వ శతాబ్దానికే ఉన్నాయి. అది మధ్య పశ్చిమ భారతదేశానికి 12వ శతాబ్దానికి ప్రాకి, 17వ శతాబ్దాంతంలోగా మిగతా భారతదేశానికి విస్తరించింది. వివిధ రూపాల్లో, వివిధ కాలాల్లో, వివిధ అభివ్యక్తుల్లో బయటకొచ్చింది. మునుల్లా జీవించిన కవులే ఈ అన్ని శతాబ్దాల్లోనూ దానికి ముఖ్య కారకులు. అందులో స్త్రీలూ ఉన్నారు, అన్నింటికీ దూరంగా ఉంచబడ్డ దిగువ కులాలవారూ ఉన్నారు. దిగువ కులాలగా భావించబడ్డ వారిలో 7-8 శతాబ్దాల మధ్య వాడైన దళిత శైవ భక్తకవి నందనార్‌, 9-10 శతాబ్దాల మధ్య వారైన ప్రముఖ శ్రీ వైష్ణవ భక్త కవులు నమ్మాళ్వార్‌, తిరుమంగై ఆళ్వార్‌, తిరుప్పాణాళ్వార్లు; 14వ శతాబ్దపు నామదేవ్‌, చోఖామేలా, పంజాబ్‌కి చెందిన 15-16 శతాబ్దపు సంత్‌ రవిదాస్‌లు మొదలైనవారున్నారు.

14వ శతాబ్దపు చోఖామేలా (?-1338) నిమ్న కులాల పట్ల జరుగుతున్న వివక్షను, తాను నమ్ముకున్న పండరీపుర విఠలుడికే కాదు, ప్రజలందరికీ, అభంగ్‌ లనే భక్తి పాటలు ద్వారా విన్నవించుకున్నాడు. సరళమైన స్థానిక భాషలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సారాన్ని ప్రజలకు చేరువ చేసాడు.

కన్నడ ప్రాంతానికి చెందిన 12వ శతాబ్దపు మాదర చెన్నయ్య తరువాత, బహుశా చోఖామేలానే మరాఠీ చరిత్రలో నమోదయిన మొదటి దళిత కవి. అతను పుట్టిన సంవత్సరం తెలియదు. పండరీ పురం దగ్గరలో ఉన్న మంగళవేధ గ్రామంలో భార్య సోయరా, కొడుకు కర్మమేలాతో నివసించాడన్నది అందరికీ తెలిసిన సత్యం. అంటరానికులంగా భావించ బడ్డ మహర్‌ దళిత కులానికి చెందినవాడు కావడం మూలాన చివరివరకూ ఎన్నో ఇబ్బందులకు గురికాక తప్పలేదు. అతని కవిత్వం బాధాతప్త హృదయాన్ని, ఆధ్యాత్మిక పరిపక్వతను తెలియజేస్తుంది.

మహర్‌ కులస్థులు గ్రామాన్ని ఊడ్చి శుభ్రంగా ఉంచడం, చచ్చిన పశువులను తొలగించి వాటిని ఊరవతల ఖననం చేయడమేకాక, ఊరికి దూరంగా ఆయా కులస్థులతోపాటే ఉండాలన్నది అప్పటి నియమం. చదువులకు దూరం కావడమే కాకుండా, పై కులస్థులు తినగా వది లేసిన తిండిని ప్రసాదంలా సేకరించి తినడం కూడా అందులో ఒకటి.

చోఖామేలా పండరీపురం ఒకసారి వచ్చినపుడు సంత్‌ నామదేవ్‌ (1270-1350) బోధనల్ని విన్నాడు. అతనిమీద అవి విశేషమైన ప్రభావాన్ని చూపించాయి. అతన్ని గురువుగా స్వీకరించి, షోలా పూర్‌లో ఉన్న పాండురంగ విఠలుని భక్తుడుగా మారిపోయాడు. చోఖామేలా 1280-90 ప్రాంతంలో భార్యా పుత్రునితో పండరీపురానికి నివాసం మార్చుకున్నాడు. పండరీపురంలో అతనిని, అతని కులస్థులతో పాటు ఊరి చివరనే ఉండనిచ్చారు. గుడి లోనికి ప్రవేశం లేకుండా కట్టడి చేసారు. అంచాత భీమా నదికి ఉపనదియైున చంద్రభాగ నది ఒడ్డున, దూరంలోనైనా గుడి కనిపించే స్థలంలో కుటీరం కట్టుకున్నాడు.

సమాజంలో మనుషుల మధ్య వ్యత్యాసం చోఖాకు భరించరాని అన్యాయంగా అనిపించేది. ఆ విధమైన సృష్టికి కారణమైన దేవునికి, తన అభంగ్‌లతో ఫిర్యాదు చేసేవాడు, నిలదీసేవాడు కూడా. ఈ అభంగ్‌ లన్నవి భంగం కాని భక్తిపూరితమైన పాటలు, లేదా భజనలు. ఈ అభంగ్‌లన్నీ మౌఖికంగా ఉండటం మూలాన చోఖా అభంగ్‌లు ఎన్ని ఉన్నాయన్నది సరిగ్గా తెలియదు. 200 నుండి 350 వరకూ ఉంటాయని ఒక అంచనా. వాటిల్లో ఎక్కువ భాగం విఠల్‌ దేవునితో ముడి వేసుకున్నవే అయినా, చాలావరకు అతని ఆత్మ కథల్లా సాగుతాయి. చోఖా మేలా అభంగ్‌లను అనంత భట్‌ అనే భక్తుడు సేక రించి రాసి భద్రపరిచాడు.

విఠలునిపట్ల సంత్‌ కవుల అభంగ్‌లలో మోహ లేదా వివాహ రూపకాలు ఎక్కడా ఉండకపోవడం ఒక విశేషం. విఠలుడు ఒక స్నేహితుడు లేదా సహచరుడు, తండ్రి లేదా తల్లి అన్న ధ్యాసతోనే అన్నీ ఉంటాయి. విఠలునితో సాన్నిహిత్యం ఎంత ఎక్కువ అంటే, అతనికీ తమకూ మధ్య విచక్షణ ఉన్నట్టు అంతగా వారికి అనిపించదు, రెండు అద్దాలు ఒక దాని ఎదురుగా ఒకటి ఉన్నప్పుడు ఏది దేనిని ప్రతిఫలి స్తుందో తెలుసుకోలేనంతగా వారు లీనమయి ఉంటారు.

‘‘సౌకర్యవంతమైన ఆసనం, సౌకర్యమైన పడక ఒకడికి/ శరీరాన్ని కప్పుకుందుకు బట్టైనా ఉండదు కొందరికి/ కొందరు రుచికరమైన ఆహారాన్ని అనుభవిస్తారు/ కొందరు అరగని అన్నాన్నైనా అడుక్కుం టారు/ కొందరు రాజులా గొప్ప గౌరవం పొందుతారు/ కొందరు ఊరంతా యాచకుల్లా తిరుగుతారు/ నీ ఇంటిలో ఇదేమి న్యాయం/ బహుశా నా అదృష్టం బాగులేదేమో’’- అని వాపోయాడు చోఖామేలా.

విఠలుని భక్తిలో లీనమై చోఖా పాడిన అభంగ్‌లు అందరినీ ఆకట్టుకుని, భక్తుల సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందడం మొదలయింది. అది పండరీపురంలోని పైకులాల వారికి, ముఖ్యంగా అక్కడి పూజారులకు కంటగింపుగా తయారైంది. చోఖా గుడిలోకి ప్రవేశించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎవరికీ తెలియకుండా చోఖా గుడిలోకి ప్రవేశిం చాడని, విఠలుని మెడలోని బంగారు హారం సైతం దొంగిలించాడని నేరారోపణ చేసి అనేక విధాల హింసలకు గురిచేసారు. అయినా అతని దుస్థితికి ఎవరినీ అతను ద్వేషించ లేదు. విఠలుని నామస్మరణలో, గుడి ముందు చేతులు జోడించి నిలుచుందుకు తప్ప లోనికి పోయేం దుకు అనుమతిని మాత్రం పొందలేకపోయాడు. సరళంగా సూటిగా అతని కులాన్ని సైతం సూచించకుండావున్న సహజ కవిత్వం అతనిది-

‘‘నీ ముంజేతి మీద గాజుల్ని చూడటానికి/ అద్దం ఎందుకు నీకు?/ విఠలుడి మీద నమ్మకం ఉంచుకో/ మతాచారాల విషయం ఆలోచించొద్దు/ విఠలుడి నామం జపించు/ యోగి మార్గం కోలాహలంతో నిండి ఉండదు/ జపం ఉచితం/ ముందు అది చేయు/ పగలూ రాత్రీ నామం జపించు/ సదాచారుల సాంగత్యంలో పరమానందం ఉంది’’ అంటాడు చోఖా

చోఖా కవితలు అప్పటి సామాజిక పరిస్థితుల్ని చూపించిన దస్తావేజులు. అవి మానవ జీవితాల్ని మరింత అర్థవంతం చేయడానికి ఉద్దేశించినవి. అత్యున్నత స్థాయికి చెందిన సార్వత్రిక కవితలుగా గుర్తించిన అతని కవితల్లోవి కొన్ని ‘‘చెరకు వంకరటింకర, అందులోని రసం కాదు/ విల్లు వంకర, అందులోని బాణం కాదు/ నది వంకరటింకర, దాని నీరు కాదు/ చోఖా వికారి కావచ్చు, అతని భక్తి కాదు/ కేవలం ఆకారం చూసే ఎందుకు మోసపోతావు’’

‘‘పంచభూతాలతో తయారయిన/ సమస్త ప్రపంచం/ అంతే కళం కితమైనపుడు/ దేహం మూలాధారమే అపవిత్రమైనాక/ ఎవరైనా ఒకరు పవిత్రులు/ ఇంకొకరు అపవిత్రులు ఎలా అవుతారు/ ఆరంభం నుండి అంతం వరకూ అపవిత్రమే/ పవిత్రులు ఎవరో ఎలా?’’

‘‘ఆ ప్రవర్తన పట్ల సిగ్గుపడాలి/ ఆ ఆలోచన పట్ల సిగ్గుపడాలి/ ఆ జీవితం పట్ల సిగ్గుపడాలి/ అలా పుట్టినందుకు సిగ్గుపడాలి//
ఆ పాండిత్యం పట్ల సిగ్గుపడాలి/ ఆ పవిత్ర గ్రంథాల పట్ల సిగ్గుపడాలి/ ఆచరించే ఆ అన్ని ఆచారాల పట్లా సిగ్గుపడాలి//
ఆ జ్ఞానం పట్ల సిగ్గుపడాలి/ దయ క్షమ శాంతం లేని, ఆ ఉపదేశం నిరర్థకం//
ఆ ధ్యానం పట్ల సిగ్గుపడాలి/ ఆ పెరిగిన జుట్టు పట్ల సిగ్గుపడాలి/ అనుసరించే ఆ దినచర్యలన్నీ నిష్ఫలం//
ఎప్పుడు పుట్టినా/ అలాంటి మనిషి పట్ల సిగ్గుపడాలి/ చివరికి అతనికి/ అంతులేని నరకమే’’

భక్తులు ప్రజల్లో ఎంత గౌరవాన్ని పేరుని సంపాదించుకున్నా, అప్పటి భూస్వామ్య వ్యవస్థలోని కట్టుబానిసతనం మూలంగా, మంగళవేదాలో సరిహద్దు గోడ కట్టటానికి ఇతర నిమ్న కులస్థులతో పాటు చోఖా వెళ్లక తప్పలేదు. పడరీపురం నుండి అతనిని వెళ్లగొట్టే ప్రక్రియలో భాగమే ఆ కట్టడం పని అని కూడా చెబుతారు. ఆ గోడని కడుతున్న క్రమంలో అది కూలిపోవదంతో, దాని క్రింద అనేకమంది పనివాళ్లు చనిపోయారు. అందులో చోఖా కూడా ఉన్నాడు. ఎవరెవరివో ఎముకలు తప్ప, ఎవరెవరో తెలుసుకోలేని విధంగా, భయానకంగా ఎముకలు అక్కడ పడిఉన్నా, చోఖా గురువు నామదేవ్‌, అక్కడి కొన్ని ఎముకల నుండి వస్తున్న విఠల శబ్దాలతో అవి చోఖావిగా గుర్తించగలిగాడు. ‘‘చోఖా నా జీవితం/ చోఖా నా భావానుబంధం/ చోఖా నా కుటుంబ దైవం/ అతని భక్తి శక్తి గొప్పది/ అతని కోసమే నేను వచ్చాను’’ అని చెప్పుకున్నాడు నామదేవ్‌. అతని అస్థికలను పండరీపురానికి తీసుకొచ్చి చోఖా సమాధిని విఠలుని గుడి ముందే నిర్మింపజేసాడు సంత్‌ నామ దేవ్‌. తన చివరిరోజులు పండరీపురంలోని విఠలుని గుడిలోనే గడిపిన తుకారం (1608-1650) సైతం, ‘‘ఆదర్శాల అద్భుత గ్రంథానివి నువ్వు, అసంఖ్యాక దుర్మార్గుల పని పట్టావు’’ అని చోఖామేలాని కీర్తించాడు.

దైవభక్తి, ధర్మనిష్ఠ, ప్రేమ, సమానత్వం తరఫునే చోఖామేలా నిశ్శబ్ద పోరాటం చేశాడు. ఛాందసత్వం, కుల అహంకారం మీద తన అభిప్రా యాలు దాచుకోలేదు. ఏనాడూ ఎవరి దగ్గరా న్యూనతా భావాన్ని ప్రదర్శించలేదు. అతని కవితలు, విఠలుని మీద భక్తి ప్రధానమైనవే అయినా, అంటరానితనాన్ని ప్రస్తావించకుండా లేవు.

‘‘ఈ పుట్టుకే నాకు ఇవ్వాలనుకుంటే/ ఎందుకు నన్నిలా పుట్టిం చావు?/ ఎలాగో పుట్టనీలే అని వదిలేసావు. నువ్వు క్రూరుడవు/ నేను పుట్టినపుడు నువ్వు ఎక్కడున్నావు?/ ఎవరికి సాయం చేస్తున్నావు?’’ – అని ఆక్షేపించేవాడే, ‘‘అంటరానివాడిని, నిన్నెలా నేను కొలవాలి/ అందరూ నన్ను దూరంగా ఉండమంటున్నారు, నిన్నెలా నేను చూడాలి/ నేను ఎవరినైనా ముట్టుకుంటే, వాళ్లు ఆక్షేపిస్తారు/ ఓ నా విఠలా, చోఖా మేలాకి నీ దయ కావాలి’’ – అని దీనంగా వేడుకున్నాడు.

(Courtesy Andhrajyothi)