వెనకబడిన వర్గాల సంక్షేమానికి అహర్నిశలూ శ్రమించిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ కృష్ణన్‌ ఇక లేరు. దిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.27 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక లోదీ రోడ్డులో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. సీపీఎం నేత బృంద కారాట్‌, కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ఏపీభవన్‌ సిబ్బంది తదితరులు కృష్ణన్‌ పార్థివదేహానికి నివాళులర్పించారు. పీఎస్‌ కృష్ణన్‌కు భార్య శాంతాకృష్ణన్‌, కుమార్తె శుభ ఉన్నారు. రెండువారాల క్రితం కృష్ణన్‌ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. స్టంటు వేశాక కొన్నిరోజులు కోమాలోకి వెళ్లి.. ఇటీవలే కోలుకున్నారు. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ ఉత్సవాల్లో పాల్గొనాలని భావించినా, ఆరోగ్యం సహకరించక రాలేకపోయారు.
తెలుగులో అనర్గళంగా….కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆయన 1956 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా, పలు శాఖల కార్యదర్శిగా, ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా, కేంద్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ‘సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ జస్టిస్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకం రాశారు. వెనకబడిన వర్గాల సంక్షేమంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వీపీ సింగ్‌ హయాంలో కేబినెట్‌ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుపై కేబినెట్‌ నోట్‌ రూపొందించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడం, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధచట్టం అంశాల్లో కీలకపాత్ర పోషించారు. పదవీ విరమణ అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా, వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్‌ నిపుణుల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లింలకు రిజర్వేషన్ల కల్పనపై పలు సూచనలు, సలహాలు అందించారు. వెనకబడిన వర్గాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలతో ఆయన పనిచేశారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన పీఎస్‌ కృష్ణన్‌ తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. తనను కలవడానికి తెలుగువారు ఎవరైనా వస్తానంటే ఏదోరకంగా సమయం కేటాయించేవారు. పీఎస్‌ కృష్ణన్‌ మృతికి కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాస్వాన్‌ ట్విటర్‌లో సంతాపం తెలిపారు. కృష్ణన్‌ కేబినెట్‌ నోట్‌ ఆధారంగానే మండల్‌కమిషన్‌ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందని, వెనకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు అమలుచేశారని గుర్తుచేశారు. కాలు గాయం కారణంగా అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నానని పాస్వాన్‌ ట్విటర్‌లో ఆవేదన వ్యక్తంచేశారు.

ఏపీ భవన్‌తో అనుబంధం
ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన పీఎస్‌ కృష్ణన్‌.. భవన్‌లో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న గోదావరి, స్వర్ణముఖి బ్లాకులకు ఆ పేర్లు పెట్టింది ఆయనే. గురజాడ హాలు, అంబేడ్కర్‌ ఆడిటోరియాలకూ ఆయనే పేర్లు నిర్ణయించారు. చెన్నారెడ్డి హయాంలో భవన్‌ నిర్మాణ పనుల సమయంలోనూ, ఎన్టీఆర్‌ హయాంలో ప్రారంభోత్సవ సమయంలోనూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పదవీవిరమణ పొందిన తర్వాత ఏపీ భవన్‌లో ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పకుండా వచ్చేవారు.

సంక్షేమ విధానాల రూపశిల్పి కృష్ణన్‌
సీఎం కేసీఆర్‌ ఘన నివాళి…..ఈనాడు, హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీఎస్‌ కృష్ణన్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనలో కృష్ణన్‌ ఎనలేని కృషి చేశారని  నివాళులర్పించారు.ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణన్‌ మృతికి తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య సంతాపం తెలిపారు.

అంబేడ్కర్‌ బాటలో నడిచిన అధికారి
కేఆర్‌ వేణుగోపాల్‌ సంతాపం….పీఎస్‌ కృష్ణన్‌ అంబేడ్కర్‌ బాటలో నడిచిన ఐఏఎస్‌ అధికారి అని విశ్రాంత ఐఏఎస్‌, ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి కేఆర్‌ వేణుగోపాల్‌ నివాళులర్పించారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కృష్ణన్‌ ‘‘కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ఇతర పదవుల్లో విశేష సేవలు అందించారు. దళితులకు ప్రత్యేక ప్రణాళిక,  రాష్ట్రాల్లోని ఎస్సీల అభివృద్ధి సంస్థలకు ప్రత్యేక కేంద్రసాయం, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం రూపకల్పన, ‘మండల్‌’ సిఫారసుల అమలు, ఎస్సీ, ఎస్టీల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా తేవటంలో కీలక పాత్ర పోషించారు’’ అని కేఆర్‌ వేణుగోపాల్‌ ప్రస్తుతించారు. కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖను సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషించారని గుర్తుచేశారు.

Courtesy Eenadu…