– అగ్రకులాలకు ఒక న్యాయం, అణగారిన కులాలకు మరో న్యాయమా ?
– మాకూ సత్వర న్యాయం జరగాలి
– తమను వరద బాధిత కుటుంబాల్లా చూస్తున్నారంటూ రోదన
– న్యాయం జరిగేంతవరకు ఐక్యంగా పోరాడుదాం: లైంగికదాడికి గురైన
వారి తల్లిదండ్రుల ఆవేదన
బ్యూరో-హైదరాబాద్‌
‘అణగారిన కులాలకు చెందిన ఆడపిల్లలను లైంగిక దాడి చేసి హత్య చేసినా పట్టించుకోరు. తమ కుటుంబాలను ప్రజలు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పరామర్శించరు. న్యాయం కోసం పోరాడితే వరద బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు ఇంత బియ్యం, ఉప్పు, పప్పులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇదే అగ్రకులాలకు చెందిన వారు లైంగికదాడులకు గురైతే ప్రజల నుంచి ప్రభుత్వాల వరకు పరామర్శలు, దేశ వ్యాప్త ఉద్యమాలు చేస్తారు. వారికి సత్వర న్యాయం దొరుకుతుంది. అగ్రకులాలకు ఒక న్యాయం, అణగారిన కులాల వారికి మరో న్యాయమా’? లైంగికదాడులకు గురై హత్యలకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ బాధితుల తల్లిదండ్రుల ఆవేదన ఇది.

ఆదివారం ఎమ్మెఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై లైంగికదాడులు, హత్యలను నిరసిస్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో అంబేద్కర్‌ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జేబీ రాజు, కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కాడిగళ్ల భాస్కర్‌, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, బీసీ సంక్షేమ సంఘం నేత దాసు సురేశ్‌ తదితర ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ లైంగికదాడులకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కుటుంబాలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 24 నుంచి 27వ తేదీ వరకు మగ్గురు మహిళలు లైంగికదాడి, హత్యలకు గురవుతే ఒక దిశ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు.

దిశ హత్యకు నాలుగు గంటల ముందు వరంగల్‌ జిల్లాకు చెందిన బీసీ యువతి మానస హత్యకు గురైందనీ, అదే రాత్రి దిశ హత్య జరిగిందనీ తెలిపారు. కానీ దిశ కుటుంబాన్ని పరామర్శించిన నేతలు మానస కుటుంబాన్ని ఎందుకు పరామార్శించలేదని ప్రశ్నించారు. అంతకు ముందు ఆసిఫాబాద్‌ జిల్లాల్లో నాలుగు రోజుల ముందు టేకులక్ష్మి, నాలుగేండ్ల క్రితం సంధ్య అనే యువతులపై లైండికదాడి హత్య చేసినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. లైంగికదాడులు, హత్యలకు కులాలు అంటగట్టొదని సూచించారు.

అణగారిన కులాల వారి పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని విమర్శించారు. జేబీ రాజు మాట్లాడుతూ అణగారిన వారిపై లైంగికదాడులు జరిగితే కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కావడం లేదు. నాటి నుంచి వివక్ష ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై సంవత్సవానికి 32 వేల లైంగికదాడులు జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
లైంగికదాడులు, హత్యలకు గురైన కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాములు నాయక్‌ మాట్లాడుతూ లైంగికదాడులు, హత్యలకు గురైన ఎస్సీ,ఎస్టీ, బీసీ కుటుంబాలకు న్యాయం కోసం ఒక నిజనిర్ధారణ కమిటీ వేసి ఆ కుటుంబాలకు న్యాయం చేకూరుస్తామన్నారు. కాడిగళ్ల భాస్కర్‌ మాట్లాడుతూ మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగుతున్నా బయటకు పొక్కడం లేదన్నారు. రవీంద్ర నాయక్‌ మాట్లాడుతూ అందరికీ సమ న్యాయం జరగాలన్నారు. సమాజంలో నెలకొన్న వివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు.

(Courtesy Nava Telangana)