పోలీసుల దర్యాప్తు తీరుపై ప్రకాశ్‌ అంబేద్కర్‌ అసంతృప్తి
మహారాష్ట్ర హోం మంత్రి ఇలాఖాలో ఘటన

ముంబయి : గతనెల 27న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో దళిత కార్యకర్త అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నాయకులు అనిల్‌ దేశ్‌ముఖ్‌ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనలో నిందితుడు ఎన్సీపీ నాయకుడు కావడంతో దళిత సంఘాల నాయకులు అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు తమ దర్యాప్తును నిష్పక్షపాతంగా జరపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వంచిత్‌ బహుజన్‌ అఘాడీ(వీబీఏ) నాయకుడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ ఈ ఘటనపై, పోలీసుల తీరుపై అసంతృప్తి తెలిపారు.

 అసలేం జరిగింది?
నార్ఖేడ్‌లోని పింపల్‌ధర గ్రామానికి చెందిన అరవింద్‌ బాన్సోడ్‌.. వీబీఏ కార్యకర్త. గతనెల 27న గ్యాస్‌ కనెక్షన్‌ నిమిత్తం తాడిపావని పట్టణంలో గల ఓ గ్యాస్‌ ఏజేన్సీ ముందు స్పృహ కోల్పోయి కనిపించాడు. అయితే ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కాగా, సదరు గ్యాస్‌ ఏజేన్సీ ఎన్సీపీ నాయకుడు మయూర్‌ ఉమార్కర్‌కి చెందిందనీ అంబేద్కర్‌ చెప్పారు. గ్యాస్‌ ఏజేన్సీ బోర్డును అరవింద్‌ తన ఫోన్‌ సహాయంతో ఫోటో తీస్తుండగా.. అరవింద్‌పై ఉమార్కర్‌ తన అనుయాయులతో కలసి కులం పేరుతో దూషించి భౌతికంగా దాడికి దిగాడని అన్నారు. ”కొంత సమయానికి ఏజేన్సీ మెట్ల వద్ద చేతిలో పెస్టిసైడ్‌ బాటిల్‌తో అరవింద్‌ కిందపడి ఉండటం గమనించిన ఉమార్కర్‌.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడు మృతి చెందారు” అని అంబేద్కర్‌ వివరించారు. ఉమార్కర్‌, ఆయన తండ్రి మితిలేష్‌లు ఇద్దరూ ఎన్సీపీకి చెందిన కార్యకర్తలు కావడంతో పోలీసులు దీనిని ఆత్మహత్యగా కేసు నమోదు చేశారని అంబేద్కర్‌ ఆరోపించారు. నిందితులను కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారనీ, దర్యాప్తును నిష్పక్షపాతంగా జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Courtesy Nava Telangana