– 2017కన్నా 6.9 శాతం అధికం : 2018 ఎన్సీఆర్బీ డేటా
సగం వరకట్నపు హత్యలే
రికార్డులకెక్కనివి ఇంకా ఎన్నో : మహిళా సంఘాలు

ఆకాశంలో సగం మీరూ.. సగం మేమూ అన్నాడు ఓ అభ్యుదయవాది. పురుషులతోపాటు మహిళలకూ సమాన హక్కులుంటాయన్న స్ఫూర్తిని కలిగించే హితోక్తి అది. మహిళలకు సమున్నత గౌరవమిచ్చే సమాజం మాదే అంటూ గొప్పలు చెప్పుకునే భారతావనిలో వనితలపై దౌర్జన్యాలు, దమనకాండ, శారీరక హింస, మానసిక వేధింపులు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయని ఎన్సీఆర్బీ అధికారిక డేటాను విశ్లేషిస్తే అర్థమవుతోంది…

న్యూఢిల్లీ:ఏటేటా దేశంలో మహిళల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) అధికారిక లెక్కల ప్రకారమే 2018లో రోజుకు సగటున 63మంది వివాహిత మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒక్క ఏడాదిలోనే 22,937మంది వివాహిత మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. 2017తో పోలిస్తే వివాహిత మహిళల ఆత్మహత్యలు 6.9 శాతం పెరిగాయి. 2017లో ఆత్మహత్యల సంఖ్య 21,453. 2018లో మహిళల ఆత్మహత్యల సంఖ్య మొత్తం 42,391 కాగా, వివాహిత మహిళలది 22,937 అన్నది గమనార్హం. అంటే వీరిలో వివాహితులది 54.1 శాతమని అర్థం.
దేశంలో 2018లో రికార్డయిన మొత్తం ఆత్మహత్యల సంఖ్య 1,34,516. ఆత్మహత్యల్లో మొదటిస్థానం రోజు కూలీలది(22.4 శాతం) కాగా, రెండో స్థానం వివాహిత మహిళలది 17.1 శాతం. 2016లో ప్రపంచం మొత్తమ్మీద ఆత్మహత్యలకు పాల్పడ్డ మహిళల్లో మూడోవంతు లేదా 36.6 శాతం భారత్‌లోనే అన్నది గమనార్హం. 1990లో ఇది 25.3 శాతం ఉండగా, క్రమక్రమంగా పెరిగింది. ఎన్సీఆర్బీ డేటాను విశ్లేషిస్తే 2001 నుంచి ఏటా సగటున 20,000మంది వివాహిత మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని మహిళా సంఘాలు చెబుతున్నాయి. తమ కుటుంబ విషయాలు సమాజానికి తెలియకుండా ఉంచాలన్న ఆలోచనతో చాలామంది మహిళల ఆత్మహత్యలపై పోలీస్‌ స్టేషన్ల దాకా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని వారు వివరిస్తున్నారు.

కారణాలు..
చిన్న వయసులోనే పెండ్లిళ్లు-పిల్లల్ని కనడం, పెద్దలు కుదిర్చిన సంబంధాలు, బలవంతపు పెండ్లిళ్లు(ఇష్టం ఒకరిపై పెండ్లి మరొకరితో), గృహ హింస, ఆర్థిక సాధికారిత లేకపోవడం, పేదరికం, చాలా తక్కువ కేసుల్లో అనారోగ్యం, మానసిక సమస్యలు.. కొన్ని కేసుల్లో పెండ్లి తర్వాత భర్త ఇష్టంలేదని అతని నుంచి విడాకులు కావాలని తల్లిదండ్రులకు చెప్పినా వారు పట్టించుకోని సందర్భాల్లోనూ మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

వివాహిత మహిళల ఆత్మహత్యల్లో 50 శాతం కట్నం వేధింపులకు సంబంధించినవేనని విమోచన అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన దొన్నా ఫెర్నాండేజ్‌ తెలిపారు. కట్నం ఇవ్వడం కూడా నేరమే అయినందున ఆ మహిళల తల్లిదండ్రులు కూడా పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయడానికి వెనకాడుతున్నారని ఆమె వివరించారు. ఇటువంటి సందర్భాల్లో అత్తింటివారు ప్రమాదవశాత్తు చనిపోయినట్టుగా సమాజాన్ని నమ్మిస్తున్నారని ఆమె తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్ల, బాత్‌రూంలో కాలు జారి పడటం వల్ల అంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆమె వివరించారు.

ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో రోజుకు సుమారు 20మంది మహిళలు వరకట్నం వేధింపులతో చనిపోతున్నారు. పోలీస్‌ స్టేషన్లలో రోజుకు వరకట్నం కేసులు 35, భర్త అతని సంబంధీకుల వేధింపుల కేసులు 283 నమోదవుతున్నాయి. 2018లో ఆక్స్‌ఫాం ఇండియా ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా మహిళల్ని భర్తలు, అత్తమామలు తిట్టడం సహజమే అని 53 శాతంమంది, చెప్పినట్టు వినకపోతే మహిళల్ని కొట్టే హక్కు భర్తలకుంటుందని 33 శాతం అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి మహిళలకు సమాన హక్కులుంటాయన్న స్ఫృహ భారత సమాజంలో ఇంకా తక్కువస్థాయిలోనే ఉన్నదని స్పష్టమవుతోంది.

Courtesy Nava Telangana