– రోజుకు 6 వేల మందిచనిపోయే ప్రమాదం
– మాతాశిశుమరణాలూ పెరగొచ్చు.. : యూనిసెఫ్‌ హెచ్చరిక

ఐరాస : కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఆరోగ్య సంక్షోభం బాలల హక్కుల సంక్షోభంగా మారే ప్రమాదం ఉన్నదని యూనైటైడ్‌ నేషన్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌ (యూనిసెఫ్‌) హెచ్చరించింది. కోవిడ్‌-19తో సాధారణ వైద్య సేవలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాబోయే ఆరు నెలల్లో రోజుకు 6 వేల మంది పిల్లలు మరణించవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. వీరంతా ‘నివారించగల కారణాల’తో వైద్య సేవల అంతరాయం కారణంగా వీళ్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని యూనిసెఫ్‌ తెలిపింది. ప్రఖ్యాత లాన్సెట్‌ జనరల్‌లో జాన్స్‌ హౌప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ బుధవారం ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ఆధారంగా యూనిసెఫ్‌ స్పందిస్తూ… ‘ఈ ఆరోగ్య సంక్షోభం పిల్లల హక్కుల సంక్షోభంగా మారొచ్చు. దీనిమీద తక్షణ చర్యలు తీసుకోకుంటే ఐదేండ్ల లోపున్న చిన్నారుల్లో రోజుకు ఆరు వేల మంది వివిధ కారణాల వల్ల మరణించవచ్చు. పిల్లలకు సరిపడా మందులు, వైద్య సదుపాయాలు అందకపోవడంతో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే ఆయా ప్రభుత్వాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి. ఇందుకోసం సుమారు రూ. 12 వేల కోట్ల అవసరం అవుతాయి’ అని పేర్కొంది.

ఈ పరిస్థితి అల్పాదాయ దేశాల్లో ఎక్కువగా ఉంటుందనీ, సుమారు 118 దేశాలలో మరణాలు ఎక్కువగా ఉంటాయని యూనిసెఫ్‌ తెలిపింది. వైద్య సదుపాయాలు అందక, రోగ నిరోధక శక్తి కరువై వచ్చే ఆరు మాసాల్లో ఈ దేశాల్లో సుమారు 10.2 లక్షల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. వీటితో పాటు మాతా శిశు మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండొచ్చని అంచనా వేసింది.
ఇదే విషయమై యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్రిట్ట ఫొరె స్పందిస్తూ.. చిన్నారులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉందన్నారు. ‘కొద్దిరోజులుగా బడులన్నీ మూసి ఉంచడం, తల్లిదండ్రులు పనుల్లేకుండా ఇంట్లో ఉండటంతో కుటంబాలు మానసికంగా చితికిపోతున్నాయి. లాక్‌డౌన్‌ల తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేం. బాలలను రక్షించుకోవడానికి ప్రతిపాదిత నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి’ అని తెలిపారు. ఐదేండ్లలోపు చిన్నారులకు పోషకాహారం అందిస్తూ వారి రోగ నిరోధక శక్తిని పెంచాలనీ, అలాగే గర్భిణీ స్త్రీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని అన్నారు. పాఠశాలలు మూసేయడం, ఆర్థికంగా చితికిపోతుండటం కారణంగా పిల్లలు మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారనీ, వారికి కౌన్సిలింగ్‌ ఇప్పించాల్సిన అవసరం ఉన్నదని ఫొరె చెప్పారు. శరణార్థులు, వలసకూలీల చిన్నారుల రక్షణ కూడా ఎంతో కీలకమని ఆమె తెలిపారు.

Courtesy Nava Telangana