• దేశంలో రోజూ 10 మందిపై అకృత్యాలు
  • యూపీ, బీహార్​, రాజస్థాన్​లలోనే ఘటనలు ఎక్కువ

అది 2006వ సంవత్సరం.. ఓ భూమి వివాదానికి సంబంధించి ఇద్దరు దళిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. దాన్ని సహించలేకపోయిన పెద్ద కులపోళ్లు ఆ కుటుంబంలోని దళిత మహిళను, ఆమె 17 ఏళ్ల బిడ్డను, ఇద్దరు కొడుకులను అతి కిరాతకంగా చంపేశారు. మహారాష్ట్రలోని ఖైర్లాంజీ అనే ఓ మారుమూల ఊర్లో జరిగిందీ ఘటన. ఆ ఘటనే దేశంలో దళితులు గళమెత్తేందుకు టర్నింగ్​ పాయింట్​ అయింది. అప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్​ సర్కార్​పై పెద్దపెట్టున ఉద్యమాలు చేశారు దళితులు. ‘ఇంకెన్నాళ్లిలా అణచివేతను, వివక్షను భరించాలి’ అంటూ రోడ్డెక్కారు. తమ హక్కుల కోసం పోరాడారు. మరి, ఆ ఉద్యమం దళితుల తలరాతను మార్చిందా.. అంటే లేదనే చెప్పాలి. అవును మరి, ఈ శకంలోనూ ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న వాళ్లలో దళిత మహిళలే ఎక్కువగా ఉంటున్నారంటే వాళ్ల మీద ఏ రీతిలో దాడులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న ఉత్తర​ప్రదేశ్​లోని హత్రాస్​లో ఓ 19 ఏళ్ల దళిత అమ్మాయిపై నలుగురు పెద్ద కులపోళ్లు అత్యంత కిరాతకానికి పాల్పడిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పెద్ద కులపోళ్లకు, బాధిత దళిత కుటుంబానికి మధ్య 20 ఏళ్ల నుంచే భూ వివాదం కొనసాగుతోంది. ఆ వివాదంతోనే పెద్ద కులం అనే అహంకారం ఆ అమ్మాయిని బలి తీసుకుందని స్వచ్ఛంద కార్యకర్తలు, దళిత హక్కుల ఉద్యమ నేతలు, చరిత్రకారులు అంటున్నారు. ఈ ఘటనే కాదు.. అంతకుముందు అదే ఉత్తరప్రదేశ్​లోని ఉన్నావ్​లో రెండున్నరేళ్ల క్రితం 17 ఏళ్ల దళిత అమ్మాయిపై రేప్​ ఘటన కూడా పెద్ద దుమారమే సృష్టించింది. ఒక్క ఉత్తరప్రదేశే కాదు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో రోజూ ఏదో ఒక చోట దళిత మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

మూడు రెట్లు ఎక్కువ
దేశంలో దాదాపు 8 కోట్ల మంది దళిత మహిళలున్నారు. దేశంలోని మహిళల జనాభాలో వారి వాటా 16 శాతం. అయితే, మిగతా వాళ్లతో పోలిస్తే వాళ్లపై ఎన్నో రకాలుగా జరుగుతున్న అణచివేతలు మూడు రెట్లు ఎక్కువ. లింగ వివక్ష కావొచ్చు, కుల వివక్ష అయి ఉండొచ్చు, ఆర్థిక వెనుకబాటుతనం వంటి విషయాల్లో దళిత మహిళలే అన్యాయానికి, అణచివేతకు గురవుతున్నారు. ‘‘ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న వాళ్లలో దళిత మహిళలే ఎక్కువ. సంస్కృతులు, వ్యవస్థల నిర్మాణాల సుడుల్లో ఆమెనే బాధితురాలు. లోలోపల, బాహాటంగా ఎన్నో రకాలుగా దళిత మహిళలు అణచివేతలకు గురవుతున్నారు. వాళ్లపై హింస, దాడులు జరుగుతున్నాయి’’ అని క్యాస్ట్​ మ్యాటర్స్​ రచయిత డాక్టర్​ సూరజ్​ యెంగ్డె అంటున్నారు.

దండగ చట్టం
దళిత మహిళలపై జరుగుతున్న అకృత్యాలు ఎక్కువగా పల్లెల్లోనే జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూములు, వనరులు, అధికారం వంటివన్నీ పెద్ద, మధ్యస్థ కులపోళ్ల చేతుల్లోనే ఉన్నాయి. నిజానికి దళితులపై అకృత్యాలను అరికట్టేందుకు 1989లోనే చట్టం తీసుకొచ్చారు. అయినాగానీ దళిత మహిళలపై అకృత్యాలను ఆ చట్టం అడ్డుకోలేకపోతోంది. ఇప్పటికీ దళిత మహిళలుహేళన, లైంగిక వేధింపులు, తిట్లు, అత్యాచారాలు, హత్యలకు గురవుతూనే ఉన్నారు. దీంతో అదో దండగ చట్టం అన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఆమెపై సొంత కులం నుంచీ వేధింపులు తప్పట్లేదు. మొత్తంగా అన్ని కులాల నుంచీ దళిత మహిళ వేధింపులను ఎదుర్కొంటోంది.

రోజూ 10 మందిపై
దేశంలో రోజూ పది మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్టు గత ఏడాది లెక్కలు చెబుతున్నాయి. ఆ ఘటనలూ ఎక్కువగా ఉత్తర​ప్రదేశ్​లోనే జరుగుతున్నట్టు ఎన్​సీఆర్​బీ లెక్కలు తేల్చి చెబుతున్నాయి. బీహార్​, రాజస్థాన్ లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2006లో చేసిన ఓ స్టడీలోనూ 4 రాష్ట్రాల్లో దళిత మహిళలపై అకృత్యాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తేలింది. 54% మందిపై దాడులు, 46% మందిపై లైంగిక వేధింపులు, 43% మందిపై గృహ హింస,  23% మందిపై అత్యాచారాలు జరిగినట్టు ఆ స్టడీ వెల్లడించింది. 62% మంది అనరాని వినలేని మాటలతో వేధింపులకు గురైనట్టు వివరించింది. 2004 నుంచి 2013 మధ్య 16 రాష్ట్రాల్లో దళిత మహిళలపై జరిగిన 100 రేప్​ ఘటనలపై సెంటర్​ ఫర్​ దళిత్​ రైట్స్​ గ్రూప్​ కూడా ఓ సర్వే చేసింది ఆ సర్వే ప్రకారం బాధితుల్లో 46 శాతం మంది 18 ఏళ్లలోపు వాళ్లు కాగా, 85 శాతం మంది 30 ఏళ్లలోపు వాళ్లే. దళితులు సహా 36 కులపోళ్లు దళిత మహిళలపై ఈ అకృత్యాలకు పాల్పడినట్టు సర్వేతేల్చింది.

గొంతెత్తడమే పాపమా?
చట్టాలు చేసినా.. కాలం మారుతున్నా దళిత మహిళలే ఎందుకు ఎక్కువగా అణచివేతకు గురవుతున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం.. జరుగుతున్న అకృత్యాలపై వాళ్లు గొంతెత్తడమే!! 2006లో మహారాష్ట్రలో జరిగిన దారుణం కావొచ్చు.. ఇప్పుడు జరిగిన హత్రాస్​ ఉదంతం కావొచ్చు.. రెండింట్లోనూ కారణం అదేనన్న వాదన వినిపిస్తోంది. దళిత అమ్మాయిలు స్కూళ్లకు పోతున్నారు. ఏది మంచి.. ఏది చెడు అనే విషయాలు వాళ్లకు తెలుస్తున్నాయి. ప్రశ్నించే తత్వం పెరిగింది. దానికి తోడు ఫెమినిస్ట్​ గ్రూపులు వాళ్లకు అండగా నిలుస్తున్నాయి. వాళ్లు గొంతెత్తి మాట్లాడేందుకు హెల్ప్​ చేస్తున్నాయి. దాన్నే పెద్ద కులపోళ్లు తట్టుకోలేకపోతున్నారని హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేనంతగా దళిత మహిళలు తమ కష్టాలపై గొంతెత్తుతున్నారు. ఎవరి సాయం లేకుండానే తమ సమస్యలపై పోరాడుతున్నారు’’ అని సూరజ్​ యెంగ్డె చెబుతున్నారు. దళిత మహిళలు తిరగబడడం సహించలేని పెద్ద కులపోళ్లు మరిన్ని దాడులకు పాల్పడుతున్నారని దళిత హక్కుల నేత మంజులా ప్రదీప్​ చెబుతున్నారు. ఒకప్పుడు వాళ్లపై జరిగిన హింస, దాడులు బయటకు తెలిసేవి కాదని, కానీ, ఇప్పుడు ప్రతి విషయం ప్రపంచానికి తెలిసిపోతుందని అన్నారు. అందుకే ఇప్పుడు దాడులు మరింతగా పెరిగాయని, మరింత పోరాడాలని ఈ ఉదంతాలు చాటుతున్నాయన్నారు.

కులంతో సంబంధమే లేదా!
హత్రాస్​ ఘటన పెద్ద కులపోళ్ల తీరు ఎట్లుంటుందో మరోసారి రుజువు చేసిందని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. అన్యాయం జరిగిందని బాధితులు పోలీస్​స్టేషన్​ మెట్లెక్కినా ఫిర్యాదు తీసుకునే దిక్కు లేదు. చాలా లేట్​గా కేసు బుక్​ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసినా.. దర్యాప్తు సాగిన తీరు నత్తను తలపించింది. తల్లిదండ్రులను ఇంట్లో బంధించేసి పోలీసులే ఆ అమ్మాయికి అంతిమ సంస్కారాలు చేసి వాళ్లకు కడచూపు దక్కకుండా చేశారు. రాజకీయ పార్టీల నేతలను ఆ కుటుంబాన్ని కలవనియ్యలేదు. పైగా అసలు అత్యాచారమే జరగలేదంటూ పోలీసులు స్టేట్​మెంట్​ ఇవ్వడం ఇంకో డౌట్​ను రేకెత్తించింది. ఈ ఘటనకు అసలు కులంతో సంబంధమే లేదన్న కామెంట్​ కూడా చేశారు. పెద్ద కులపోళ్లతో నిండిపోయిన కొన్ని మీడియా సంస్థలూ అసలు రేప్​తో కులానికి సంబంధమేంటన్న వాదనలు చేశాయి. ఇంకా చెప్పాలంటే ఉత్తర​ప్రదేశ్​ కావొచ్చు.. లేదా దేశంలోని ఏ ప్రాంతమైనా కావొచ్చు.. దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు కులం కారణం కాదని పెద్ద కుల సంస్థలు, నాయకులు వాదిస్తున్నారు.

Courtesy V6Velugu