• డయల్‌-100కు ఫోన్‌ చేస్తే తిప్పలు
  • కాలర్‌కు పోలీసుల ప్రశ్నాస్త్రాలు
  • ఘటనా స్థలాన్ని చేరడంలోనూ జాప్యం

హైదరాబాద్‌: ‘‘ఆపదలో ఉన్నవారు డయల్‌-100కు కాల్‌ చేయండి.. వెంటనే సహాయం అందుతుంది’’.. ‘‘డయల్‌-100 రెస్పాన్స్‌ సమయం సగటున 8 నిమిషాలే.. హైదరాబాద్‌లో ఆ సమయం 5 నిమిషాలే’’.. ఇవీ పోలీసు ఉన్నతాధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు. వెటర్నరీ వైద్యురాలి  ఉదంతం తర్వాత.. మరోమారు ఉన్నతాధికారులు డయల్‌-100 ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకటనలు చేశారు. కానీ.. వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. డయల్‌-100కి ఫోన్‌చేస్తే.. అరగంట తర్వాతగానీ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకోవడం లేదు. 100కు ఫోన్‌ చేసేవారి నుంచి అక్కడి సిబ్బంది ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. స్థానిక పోలీసులు బాధితుడికి ఫోన్‌చేసి ఎక్కడున్నారు? ఏం జరిగింది? ఎలా జరిగింది? పరిస్థితి ఎలా ఉందంటూప్రశ్నాస్త్రాలను సంధిస్తారు. సగటు రెస్పాన్స్‌ సమయం 8 నిమిషాలు అని అధికారులు చెబుతున్నా.. వరుస ప్రశ్నలతోనే కాలయాపన చేస్తారు. గత గురువారం హయాత్‌నగర్‌లోని కుంట్లూరులో చెడ్డీగ్యాంగ్‌ హల్‌చల్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం. బాధితులు అర్ధరాత్రి 1.20 గంటలకు డయల్‌-100కు ఫోన్‌ చేస్తే.. పోలీసులు 40 నిమిషాల తర్వాత అక్కడకు చేరుకున్నారు. చెడ్డీగ్యాంగ్‌ కళ్లముందు నుంచే పరారవుతున్నా.. పట్టుకునే ప్రయత్నం చేయలేదు. గతంలో గతంలో సనత్‌నగర్‌లో జరిగిన ఓ హత్య కేసులో కూడా డయల్‌-100కు ఫోన్‌ చేసినా సరిగా స్పందించకపోవడం వల్లే ప్రాణం పోయిందని స్థానికులు ఆరోపించారు.

ఇవీ మరికొన్ని ఇబ్బందులు

  • చాలా సందర్భాల్లో డయల్‌-100కు కూడా ఎంగేజీ వస్తోంది. నిత్యం బిజీగా ఉందనే టోన్‌ వినబడుతోంది.
  • కొంత మంది మొబైల్‌ ఆపరేటర్లు డయల్‌-100కు సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ఆ ఆపరేటర్ల సిమ్‌కార్డులు వాడేవారికి డయల్‌-100 ఎన్నటికీ కలవదు. మరికొందరు ఆపరేటర్ల విషయంలో.. 100కు ముందు +91 జోడిస్తేనే కాల్‌ వెళ్తోంది.

ఆపదలో ఉన్నారా? డయల్‌ ‘100’: సీపీ
ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆపదలో ఉన్నామని భావిస్తే వెంటనే ‘100’ నంబర్‌కు డయల్‌ చేయాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్వీట్‌ చేశారు. బాధితులు ఫోన్‌ చేసిన 6 నుంచి 8 నిమిషాల్లో పోలీస్‌ పెట్రో కార్‌ ఆ ప్రాంతానికి చేరుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆపదల్లో ఉన్నవారు లేదా ఫిర్యాదు చేయాలనుకునేవారు తెలంగాణ పోలీస్‌ యాప్‌ ‘హాక్‌ ఐ’ వినియోగించాలని కోరారు.

Courtesy AndhraJyothy…