• ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా కన్నయ్య కుమార్‌
 • ముగిసిన సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు
  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ) 11వ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన ఎంపీ డి. రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 19 నుంచి 21 వరకు సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్‌)లో జరిగిన నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌, నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురవరం సుధాకర్‌ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యతల నుంచి తప్పు కున్నారు. ఆయన స్థానంలో ప్రస్తుత సీపీఐ కార్యదర్శి, రాజ్య సభ సభ్యులు రాజా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రకటించారు. వివిధ అంశాలకు సంబంధించి 11 తీర్మానాలు ఆమోదించినట్టు తెలిపారు. కన్నయ్య కుమార్‌ను నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఎన్నికైయ్యారని అన్నారు. ఒడిషాకు చెందిన రామకృష్ణ పండ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మనీష్‌ కుంజంను నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఆహ్వానితులుగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలకు ఎదురుదెబ్బ తగిలిందనీ, ఈ విషయాన్ని వామపక్షాలూ అంగీకరించాయని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్‌ ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ చేసేందుకు బ్లూ ప్రింట్‌లా ఉందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడం తగదని అన్నారు.
  సీపీఐ నూతన ప్రధాన కార్యదర్శి రాజా నేపథ్యం…
  రాజా తమిళనాడులోని వెల్లూరు జిల్లా చిత్తతూర్‌లోని ఓ వ్యవసాయ కూలీ కుటుంబంలో 1949 జూన్‌ 3న జన్మించారు. ఆయన తల్లి నయగమ్‌, తండ్రి పి.దొరైస్వామి. 1990 జనవరి 7న అనియమ్మ(అనీ రాజా)ను వివాహమా డారు. తల్లిదండ్రులు భూమి లేని వ్యవసాయ కూలీలు. వీరికి 1991 జనవరి 24న అపరజిత రాజా పుట్టారు. అపర జిత ప్రస్తుతం జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చదువుతున్నారు. అనీ రాజా ప్రస్తుతం సీపీ ఐ అనుబంధ మహిళా సంఘం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలుగా బాధ్యతల్లో ఉన్నారు. రాజా వెల్లూర్‌లోని గుడియట్టమ్‌లో జీటీఎం కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్సీ), చెన్నైలోని ప్రభుత్వ ఉపాధ్యాయ కాలేజీలో బీఈడీ పూర్తి చేశారు. చిత్తతూర్‌లో డిగ్రీ చేసిన తొలి వ్యక్తి డీ రాజానే. 1975-80 మధ్య ఏఐవైఎఫ్‌ తమిళ నాడు రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. 1985-90 వరకు ఏఐవైఎఫ్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తమిళనాడు నుంచి 2007లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన 2013లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. జులై 24తో ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుతుంది. ఆయ న అనేక పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలకు సభ్యులుగా ఉన్నారు. డి.రాజా దళిత క్వచిన్‌ (2007), ది వే ఫార్వర్డ్‌: ఫైట్‌ ఎగినెస్ట్‌ అన్‌ఎంప్లాయిమెంట్‌ పుస్తకాలు రాశారు. ఆయన వివిధ అంశాలపై తమిళ్‌, ఇంగ్లీష్‌ భాషల్లో వందల ఆర్టికల్స్‌లు రాశారు.
  ఆయన పార్టీవ్యవహారాల సందర్భంగా సోవియట్‌ యూనియన్‌, యూఎస్‌ఏ, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, బెల్జీయం, యూకే, జర్మనీ, హోలాండ్‌, హాంగేరీ, పోలాండ్‌, క్యూబా, వియుత్నాం, నేపాల్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, చైనా, నార్త్‌ కోరియా, గ్రీస్‌, మంగోలియా, సిరియా, కూవైట్‌తో సహా 25 దేశాల్లో పర్యటించారు.
  న్యూఎజ్‌ఎడిటర్‌ బినరు విశ్వం నియామకం
  సీపీఐ అధికారిక జాతీయ పత్రిక న్యూఎజ్‌ ఎడిటర్‌గా సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బినరు విశ్వం నియామకం అయ్యారు. న్యూఎజ్‌ ఎడిటర్‌ సమీమ్‌ ఫైజీ అకాల మరణంతో ఆయన స్థానంలో బినరు విశ్వం నియమించారు.
  ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడుగా కన్నయ్య కుమార్‌
  సీపీఐ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడుగా జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఎన్నికైయ్యారు. కన్నయ్య కుమార్‌ జేఎన్‌యూలో పీహెచ్‌డీి పూర్తి చేశారు. 2019 ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసెరారు నుంచి ఎంపీిగా పోటీచేశారు. అంతకు ముందు జేఎన్‌యూ ఎస్‌యూ విద్యార్థి సంఘ సభ్యుడుగా పనిచేశారు. ఆకాలంలోనే అన్యాయంగా దేశద్రోహం కేసులో తీహార్‌ జైల్‌కి వెళ్లారు. తీహార్‌ నుంచి బయటకొచ్చిన కన్నయ్యకుమార్‌ ‘బీహార్‌ టూ తీహార్‌’ పుస్తకాన్నిసైతం రాశారు. కన్నయ్య కుమార్‌ ప్రస్తుతం జాతీయ కౌన్సిల్‌ సభ్యుడుగా ఉన్నారు. ”న్యూఎజ్‌” ఎడిటర్‌, ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు సమీమ్‌ ఫైజీ అకాల మరణంతో ఆయన స్థానంలో కన్నయ్య కుమార్‌ను ఎన్నుకున్నారు.

(నవ తెలంగాణ సౌజన్యంతో)