– మిస్త్రీని తిరిగి చైర్మెన్‌ చేయాలంటూ ఎన్‌క్లాట్‌ తీర్పు
– చంద్రశేఖరన్‌ నియామకం ఆర్డరు నిలుపుదల…!
– చివరకు విలువలే గెలిచాయన్న మాజీ చైర్మెన్‌ సైరస్‌

ముంబయి: టాటా సన్స్‌పై న్యాయ పోరాటంలో ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ సైరస్‌ మిస్త్రీ ఎట్టకేలకు విజయం సాధించారు. టాటా సన్స్‌ చైర్మెన్‌గా మిస్త్రీని నియామకాన్ని పునరుద్దరించాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌క్లాట్‌) బుధవారం తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ నియామకాన్ని ఎన్‌క్లాట్‌ నిలుపుదల చేసింది. ఎన్‌.చంద్రశేఖరన్‌ నియామకం చట్ట విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది. దాదాపు మూడేళ్ల తర్వాత మిస్త్రీ మళ్లీ ఆ పదవిని చేపట్టే అవకాశం ఉంది. దిగువ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన ఎన్‌సీఎల్‌ఏటీ.. షాపూర్‌ పల్లోంజీ కుటుంబానికి చెందిన సైరస్‌ మిస్త్రీ టాటా సన్స్‌ గ్రూపులో 10శాతం షేరుతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారని పేర్కొంది. మిస్త్రీ పునర్నియామక ఉత్తర్వులు నాలుగు వారాల తర్వాత అమల్లోకి రానున్నాయి. ఈలోపు టాటా సంస్థ కావాలంటే పైకోర్టులకు అప్పీల్‌కు దాఖలు చేసుకోవచ్చని ఎన్‌క్లాట్‌ తెలిపింది. 2012లో టాటా సన్స్‌ చైర్మెన్‌గా రతన్‌ టాటా వైదొలగడంతో.. సైరస్‌ మిస్త్రీ ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అయితే మిస్త్రీ పదవీ కాలం పూర్తి కాకముందే అక్టోబర్‌ 24, 2016న ఆయనకు టాటా సన్స్‌ ఉద్వాసన పలికింది. కార్పోరేట్‌ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించడంపై ఆయన న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యలో ట్రిబ్యునల్‌ ఆయనకు అనుకూలంగా తీర్పునివ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా, సైరస్‌ మిస్త్రీ తొలగింపును సవాల్‌ చేస్తూ సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కార్ప్‌ సంస్థలు పిటిషన్‌ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్‌ కొట్టివేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ మిస్త్రీ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపిన కోర్టు బుధవారం ఎట్టకేలక తన తీర్పును ప్రకటించడం విశేషం.

నా విజయం కాదు.. విలువల విజయం
టాటా గ్రూప్‌ చీఫ్‌గా సైరస్‌ మిస్త్రీ తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న నేషనల్‌ కంపనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌క్లాట్‌) ఉత్తర్వులపై మిస్త్రీ స్పందించారు. ట్రిబ్యునల్‌ తీర్పును సుపరిపాలన సూత్రాల విజయంగా ఆయన అభివర్ణించారు. టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా సైరస్‌ మిస్త్రీ నియామకాన్ని ఎన్‌క్లాట్‌ పునరుద్ధరించిన అనంతరం ట్రిబ్యునల్‌ తీర్పును స్వాగతిస్తున్నట్టుగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈరోజు వెలువడిన తీర్పు తనకు వ్యక్తిగత విజయం ఎంతమాత్రం కాదని, సుపరిపాలన సూత్రాలు, టాటా సన్స్‌ మైనారిటీ వాటాదారు హక్కుల విజయమేనని వ్యాఖ్యానించారు. మిస్త్రీ కుటుంబం గత యాభై సంవత్సరాలుగా టాటా సన్స్‌లో ప్రాముఖ్యత కలిగిన మైనారిటీ వాటాదారుగా.. దేశం గర్వించదగిన సంస్థకు బాధ్యతాయుతమైన సంరక్షకుడిగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. మూడేళ్ల క్‌ిందట టాటా సన్స్‌ చీఫ్‌గా బోర్డు తనను తొలగించిన అనంతరం తాను చేపట్టిన పోరాటానికి ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని అన్నారు. అయితే ఎన్‌క్లాట్‌ తీర్పును పైకోర్టుల్లో సవాలు చేయాలని టాటా గ్రూపు అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మిస్త్రీ విషయంలో ప్రతికూల ఫలితం వచ్చిన నేపథ్యంలో ఎలాంటి చర్యలతో ముందుకు సాగాలనే విషయమై ఇప్పటికే టాటా గ్రూపు న్యాయకోవిధులతో చర్చలు జరిపి ప్లాన్‌-బీ తయారు చేసి ఉంచినట్టుగా తెలుస్తోంది.

Courtesy Nava telangana