పోలీసులపై రుజువు కాని నేరారోపణలు
కస్టోడియల్‌ డెత్‌లలో మూడో స్థానంలో గుజరాత్‌
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ద్వారా వెలుగులోకి..

గాంధీనగర్‌ : ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 2001 నుంచి 2016 వరకు పోలీసు కస్టడీలలో 180 మంది మరణించారు. అయితే ఇందులో 26 మంది పోలీసులపై కేసులు నమోదుకాగా ఏ ఒక్క కేసులోనూ నేరారోపణలు రుజువు కాలేదు. జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్సీఆర్బీ) ఈ మధ్యే వెలువరించిన నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం.. పదిహేనేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా పోలీసు కస్టడీలలో 1,557 మంది మరణించారు. కాగా ఇందులో మహారాష్ట్ర మొదటిస్థానం (362)లో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానం(242)లో ఉంది. ఈ జాబితాలో గుజరాత్‌ మూడో స్థానంలో ఉంది. అయితే దేశవ్యాప్తంగా నమోదైన నిర్బంధ మరణాల్లో పోలీసులపై 704 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 188 కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో పోలీసులపై 43 కేసులున్నాయి. గుజరాత్‌లో 26 కేసులు మాత్రమే పోలీసులకు వ్యతిరేకంగా దాఖలయ్యాయి.
ఈ తరహా మరణాల్లో దేశవ్యాప్తంగా పోలీసులపై 294 చార్జిషీట్లు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్ర నుంచి 28 మంది పోలీసులుండగా, ఏపీలో 13 మందిపై దాఖలయ్యాయి. కానీ గుజరాత్‌లో మాత్రం ఒక్క పోలీసుపైనా చార్జిషీటు లేకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఉత్తరప్రదేశ్‌లో 75 మంది పోలీసులపై చార్జిషీట్లు (128 మరణాలు, 122 కేసులు) దాఖలుచేయగా వారిలో 17 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. ఇదిలాఉండగా గుజరాత్‌లో కొత్తగా తెచ్చిన ఉగ్రవాద నిరోధక చట్టం (జీసీటీవోసీ) బిల్లుకు రాష్ట్రపతి ఈ మధ్యే ఆమోదం తెలపడం వివాదాస్పదమైంది. ఈ చట్టం ప్రకారం.. కస్టోడియల్‌ మరణాలను చట్టబద్దంగా, సాక్ష్యానికి ఆమోదయోగ్యంగా మార్చడం మరింత ఆందోళనకు గురిచేసే అంశంగా మారిందని హక్కుల నేతలు అభిప్రాయపడుతున్నారు.

Courtesy Nava telangana