హైదరాబాద్‌ : కరెంట్‌ చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపై రూ.1500 కోట్లకు పైగా భారం పడనుంది. చార్జీలు చెల్లించే స్తోమత ఉన్న వర్గాలపైనే ఈ భారం ఉంటుందని, పేద వర్గాలపై ఉండబోదని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే హామీ ఇచ్చారు. విద్యుత్తు సంస్థలు బతకాలంటే చార్జీల పెంపు అనివార్యమని ఆయన అన్నారు. పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెండు వారాల క్రితమే డిస్కమ్‌లను నిర్దేశించారు. దీంతో డిస్కమ్‌లు.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటిని పెంచడానికి వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి సమర్పించనున్నాయి. రెండేళ్ల వార్షికాదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌) ప్రస్తుతం పెండింగ్‌లో ఉండగా.. వీటిని సమర్పించ డానికి ఈ నెలాఖరు వరకు డిస్కమ్‌లు గడువు కోరాయి. కాగా, గత ఏడాది డిసెంబరు నెలాఖరు నాటికి  మూడో త్రైమాసికంలో ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరం అనూహ్యంగా యూనిట్‌కు 27 పైసలు ఉంది. ఎస్పీడీసీఎల్‌(హైదరాబాద్‌) పరిధిలో యూనిట్‌కు 47 పైసలు, ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 19 పైసలుగా ఉంది. మూడు త్రైమాసికాల్లోనే ఎస్పీడీసీఎల్‌ రూ.1562 కోట్ల మేర నష్టం మూటగట్టుకుంది. చివరి త్రైమాసికంతో కలిపి ఇది రూ.2 వేల కోట్లు దాటనుంది. 2019-20లో ప్రభుత్వం రూ.4913 కోట్లను సబ్సిడీ రూపంలో ఇచ్చినా.. నష్టాలను ఇవి ఏమాత్రం పూడ్చలేకపోయాయి. 2020-21లోనూ రూ.7642 కోట్లు సబ్సిడీగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో విద్యుత్తు శాఖకు రూ.10416 కోట్లు కేటాయించినా.. సబ్సిడీ రూపంలో రూ.7642 కోట్లు మాత్రమే అందే అవకాశాలున్నాయి.

భారీ లోటులో..
2018-19లో రూ.9 వేల కోట్లకు పైగా ఆర్థిక లోటు ఉండనుందని అంచనా వేస్తూ డిస్కమ్‌లు రెండేళ్ల క్రితం వార్షికాదాయ అవసరాల నివేదికను సమర్పించాయి. ఈ లోటును భర్తీ చేసేందుకు విద్యుత్తు చార్జీలను పెంచాల్సి ఉండగా.. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ పూచీతో.. ఆర్థిక లోటును రూ.5980 కోట్లకు కుదించి, పాత విద్యుత్తు చార్జీలను యథాతథంగా అమలు చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. అయినా ప్రభుత్వం రూ.4980 కోట్ల సబ్సిడీ మాత్రమే చెల్లించింది. దాంతో డిస్కంలు ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అంతకుముందు 2016-17లో రూ.2585.67 కోట్ల నష్టం వచ్చింది. ఇది ఏటా పెరుగుతూ వచ్చింది. 2019-20లో రూ.4500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కేవలం నాలుగేళ్లలోనే డిస్కమ్‌ల నష్టం రూ.13,763 కోట్లు అయింది. కమిషన్‌ ఆమోదించిన దానికంటే.. వాస్తవిక ఖర్చు ఎక్కువ అయినందున 2014-18 మధ్యకాలంలో వినియోగదారుల నుంచి ట్రూఅప్‌ చార్జీలుగా రూ.1300 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతినించాలని ఈఆర్‌సీలో ఎస్పీడీసీఎల్‌ ఫైలింగ్‌ చేసింది. ఈ ఖర్చు పెరగడానికి వేతన సవరణ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డీఏ అమలు కారణమని పేర్కొంది. మరోవైపు ఆర్టిజన్ల క్రమబద్ధీకరణకు 2018-19లో రూ.296 కోట్లు అయిందని తెలిపింది. దీనిపై కూడా కమిషన్‌ నిర్ణయం పెండింగ్‌లో ఉంది.

Courtesy Andhrajyothi