* ఆర్థిక మాంద్యాన్ని కారణంగా చూపుతున్న హోంశాఖ
న్యూఢిల్లీ : సెంట్రల్‌ రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్‌)కు ప్రతినెలా అందించే ”రేషన్‌ భత్యం (రేషన్‌ అలవెన్స్‌)”కు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. దేశానికి రక్షణ కల్పించే సిఆర్‌పిఎఫ్‌ బలగాలు మోడీ ప్రభుత్వపు చర్యల కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన నగదు కొరతే వారికి రేషన్‌ అలవెన్స్‌ అందకుండా చేస్తున్నది. దీనికి ప్రస్తుతం దేశంలో నెలకొన్న మాంద్యాన్ని హోంశాఖ కారణంగా చూపుతోంది. తమకు అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అందించే ఈ భత్యం వారికి ఎంతో సహాయ పడుతోంది. దాదాపు 3 లక్షల మంది వరకు ఉన్న సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందిలో అత్యధికులకు తమ నెలవారీ వేతనంతో పాటు రేషన్‌ అలవెన్స్‌గా రూ.3,000లను ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొత్తాన్ని సిబ్బంది తమ స్థావరాలలో భోజనం కోసం ఖర్చు పెడుతుంటారు. ఈ సెప్టెంబరు నెల వేతనంతో, అలవెన్స్‌ చెల్లించడం లేదని పేర్కొంటూ ఒక అంతర్గత సమాచారాన్ని దేశవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందికి పంపింది. హోం మంత్రిత్వ శాఖ దాదాపు రు.800 కోట్లను సిఆర్‌పిఎఫ్‌కు విడుదల చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నెలతో పాటు గత జులై, ఆగస్టు నెలల్లో కూడా నిధులు విడుదల చేయాల్సిన విషయాన్ని మంత్రిత్వ శాఖకు పలుమార్లు గుర్తు చేసినప్పటికీ లాభం లేపోయింది. దీంతో రేషన్‌ భత్యంపై కోత పెడుతున్నట్లు సిఆర్‌పిఎఫ్‌ తన సిబ్బందికి తెలిపింది. ఈ నెల 13వ తేదీతో ఉన్న ఈ కాపీ మీడియాకు లభ్యమైంది.
”రూ.800 కోట్లు అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ జులై 22, ఆగస్టు8, సెప్టెంబరు 9 తేదీలలో సిఆర్‌పిఎఫ్‌ హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. నెలవారీ వేతనంతో పాటు, రేషన్‌ అలవెన్స్‌ చెల్లింపులకు ఆ మొత్తం కేటాయించాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖ నుండి అదనపు బడ్జెట్‌ కేటాయింపు జరుగుతుందని ఆశిస్తున్నాం. నిల్వ నగదు (కాష్‌ ఆన్‌ రిజర్వు) ప్రస్తుతం అందుబాటులో లేనందున, సెప్టెంబరు నెల వేతనంతో పాటు రేషన్‌ అలవెన్స్‌ను తీసుకోవడం సాధ్యపడదు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సెప్టెంబరు నెల నుండి రేషన్‌ అలవెన్స్‌ను నిలిపివేస్తున్నాం. సంబంధిత సిబ్బందికి ఈ సమాచారాన్ని తెలియజేయగలరు” అని ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌లో సిఆర్‌పిఎఫ్‌ పేర్కొంది.

రేషన్‌ అలవెన్స్‌ నిలిపివేయడం ఇదే తొలిసారి
ఢిల్లీలోని సిఆర్‌పిఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ రేషన్‌ అలవెన్స్‌ను నిలుపుదల చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. గతవారంలో తాము మంత్రిత్వ శాఖ అధికారులను కలిసి బకాయిల గురించి అడిగామని, వారు ఆర్థిక వ్యవస్ధ క్షీణించిన పరిస్థితిని ఏకరువు పెట్టారని ఆయన చెప్పారు. బకాయిలు విడుదల చేయడానికి, రేషన్‌ అలవెన్స్‌ను ఆపివేయడానికి అధికారికంగా ఒక్క కారణాన్ని కూడా మంత్రిత్వ శాఖ తెలపలేకపోయిందన్నారు. ఆహారం కొనుక్కునే సమయంలో తమ జేబులు తడుముకోకుండా సిబ్బందికి అలవెన్స్‌ ఎంతగానో తోడ్పడుతుందని ఆయన చెప్పారు. మిలిటెంట్లు, మావోయిస్టులపై పోరాడేందుకు సిబ్భందిని ధృఢంగా ఉంచడానికి ఇది ఎంతగానో సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఎప్పుడు అవసరమైనా పోరాడేందుకు సిబ్బందిని బలోపేతం చేసి సిద్ధంగా ఉంచుతామని మోడీ చెప్పిన దానికి వ్యతిరేకంగా అలవెన్స్‌ను ఉపసంహరించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నదని ఆయన అన్నారు. జమ్ముకాశ్మీర్‌, ఈశాన్య ప్రాంతం, మావోయిస్టు ప్రాంతాల్లో సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది తీవ్రవాదంపై పోరాడుతోంది.

ప్రభుత్వ ప్రాధాన్యతేంటో తెలుస్తోంది
* సీతారాం ఏచూరి
”ఒక వ్యక్తి వ్యక్తిగత ప్రచారానికి, విపరీత తమాషాలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది. కాని మన సైనికుల ఆహారం కోసం చెల్లించేందుకు తగినంత సొమ్ము ఉండదు. ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటో తెలియజేస్తోంది” అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.

Courtesy Prajashakthi…