• – 1.20 లక్షల ఎకరాల్లోనే నష్టం
  • – ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక
  • – 15లక్షల ఎకరాల్లో పంట నష్టం : రైతు సంఘాలు

వర్షాలకు పంటలు ఆగమయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, సోయాబీన్‌ వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో పంట దెబ్బతినడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కష్టానికి ప్రతిఫలం లభిస్తుందనే ఆశలను భారీ వానలు దెబ్బతీశాయి. విత్తనాలు మొలకెత్తిన సందర్భంలో రైతన్న ఎంతో సంతోషపడుతాడో…కోత దశలో గింజలు నేలమట్టమై…తిరిగి మొలకెత్తితే ఆ అంత ఆదేవన మిగులుతుంది. తెంపాల్సిన దశలో పత్తి తడిసిపోయి, పత్తి చేతికి రాకుండా పోతున్నది.ఈ నేపథ్యంలో అసమగ్రంగా పంట నష్టం వేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతు న్నదని రైతు సంఘాలు చెబుతున్నాయి. రైతును పూర్తిస్తాయిలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తున్నది. పరిహారం చెల్లించాల్సిన సర్కారు ఆ పంట నష్టం అంచనాల్లోనే లెక్క తప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంటనష్టాన్ని ఎక్కువగా చూపిస్తే పరిహారం అదే స్థాయిలో ఇవ్వాల్సి ఉంటుందన్న సాకుతో సాధారణ పంటనష్టమే జరిగిందని అధికారికంగా లెక్కలు చూపిస్తున్నది. ఈమేరకు వ్యవసాయ శాఖ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అందులో 1.20 లక్షల ఎకరాల్లోనే పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు నివేదికలో పేర్కొన్నట్టు అధికారులు చెప్పారు. రైతు సంఘాల అంచనా ప్రకారం 15 లక్షల ఎకరాలకు పైబడి పంటలు దెబ్బతిన్నాయని తెలంగాణ రైతు సంఘాలు అంటున్నాయి. ముఖ్యంగా పత్తి 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నదని ఆయా సంఘాల నాయకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల 142 మండలాల్లో పంటనష్ట పోయినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 56వేల మంది రైతులు నష్టపోయినట్టు తన నివేదికలో పేర్కొంది. అనధికారికంగా లెక్కల ప్రకారం అంతకు రెట్టింపు పంటలు దెబ్బతిన్నాయి. అయితే వ్యవసాయ శాఖ మాత్రం తక్కువ ఎకరాల్లో నష్టం చూపించి, దాని ప్రకారమే పరిహారం చెల్లించేలా తప్పుడు లెక్కలు చూపించిందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ఆలస్యం, కరువు పరిస్థితులు, ఆగస్టులో కురిసిన వానల వల్ల రెండోసారి రైతులు విత్తనాలు నాటారు. సూర్యాపేట జిల్లాలో 29వేల ఎకరాలు, పెద్దపల్లిలో 8,350 ఎకరాలు, కరీంనగర్‌లో 25వేల ఎకరాలు, నిజామాబాద్‌లో 8,800 ఎకరాల్లో, పది రోజుల్లో కోతకు వచ్చే వరి అత్యధికంగా 80,447 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అంచనా వేసింది. మొక్కజోన్న పంట 4,022, పత్తి 35వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు నివేదిక సమర్పించింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఖమ్మం వంటి జిల్లాల్లో వరి పంట నీట మునిగింది. వనపర్తి, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, మంచిర్యాల, జగిత్యాల, జనగామా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 142 మండలాల్లో పంటలు నష్టపోయినట్టు వ్యవసాయశాఖ తెలిపింది. మొక్కజొన్న కంకులు, పత్తి కాయలు పూర్తిగా తడిసిపోయాయి. పత్తికి మచ్చలు వచ్చి పూర్తిగా నల్లబడింది. అలా రంగు మారిన నేపథ్యంలో మార్కెట్లో పత్తి ధర తక్కువగా వస్తున్నదని రైతు సంఘాలు చెబుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన సర్కారు…పంటనష్టాన్ని తక్కువగా చూపించి రైతులకు అన్యాయం చేస్తున్నద.

Courtesy Navatelangana…