• యూపీలో రౌడీ షీటర్‌ దూబే గ్యాంగ్‌ దుశ్చర్య!
  • దూబే అరెస్టుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు
  • డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్ల మృతి
  • రంగంలోకి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌.. ఇద్దరి ఎన్‌కౌంటర్‌
  • యూపీలో రౌడీ రాజ్యానికి నిదర్శనమన్న విపక్షాలు
  • పోలీసులకే భద్రతలేదు.. ప్రజల పరిస్థితేంటి: రాహుల్‌

కాన్పూర్‌ : యూపీలోని కాన్పూర్‌ సమీపంలోని ఓ గ్రామంలో ఘోరం జరిగింది. ఓ కరడుగట్టిన రౌడీ షీటర్‌, అతడి అనుచరులు జరిపిన కాల్పుల్లో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్‌ఐలు సహా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసుల నుంచి దుండగులు ఆయుధాలను లాక్కొని పారిపోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తర్వాత పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. యూపీ డీజీపీ హెచ్‌సీ అవస్తీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి వికాస్‌ దూబే అనే రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకునేందుకు అతడు నివసిస్తున్న బిక్రూ అనే గ్రామానికి వాహనాల్లో కాన్పూర్‌ నుంచి పోలీసులు బయలుదేరారు. దూబే, ఇంట్లోనే ఉన్నాడనే సమాచారం అందడంతో, నివాసాన్ని చుట్టుముట్టి. అతడిని అరెస్టు చేయాలనేది ప్రణాళిక. అయితే దాడి గురించి ముందే సమాచారం అందుకున్న దూబే, అతడి అనుచరులు.. తాము నక్కిన ప్రాంతానికి పోలీసులు రాకుండా పఽఽఽథకం ప్రకారం వ్యవహరించారు.  అడ్డంగా జేసీబీ యంత్రాలు పెట్టి రోడ్డును దిగ్బంధించారు. దీంతో పొలిమేరలోనే వాహనాలను ఆపిన పోలీసులు వాటిల్లోంచి కిందకు దిగారు. అప్పటికే మాటువేసిన దూబే, అతడి బృందం.. వాహనాల్లోంచి దిగిన పోలీసులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకొని ఎదురుకాల్పులు జరిపేలోపే తీవ్ర నష్టం జరిగింది. దుండగుల కాల్పుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా.. ఎస్సైలు మనీశ్‌ చంద్ర యాదవ్‌, అనూప్‌ కుమార్‌ సింగ్‌, నబూ లాల్‌.. కానిస్టేబుళ్లు జితేంద్ర పాల్‌, సుల్తాన్‌ సింగ్‌, బబ్లూ కుమార్‌, రాహుల్‌ కుమార్‌ మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, ఒక పౌరుడు గాయపడ్డారు. పథకం ప్రకారం ఎత్తయిన ప్రాంతంలో మాటువేసి.. కాల్పులు జరపడంతో పోలీసులకు తేరుకునే అవకాశం లభించలేదు. ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతిచెందిన, గాయపడ్డ పోలీసుల వద్ద నుంచి దూబే గ్యాంగ్‌… ఏకే 47, ఐఎన్‌ఎ్‌సఏఎస్‌ రైఫిల్‌, గ్లాక్‌ పిస్తోలు, రెండు పాయింట్‌ ఎమ్‌ఎమ్‌ పిస్తోళ్లను తీసుకొని ఉడాయించింది. అనంతరం పోలీసులు ఆ ప్రదేశాన్నంతా తమ స్వాధీనంలోకి తీసుకొని.. ముష్కరుల కోసం వేటాడారు. సమీపంలోని నివాడా గ్రామంలో దూబే మనుషులు ఇద్దరు ప్రేమ్‌ ప్రకాశ్‌, అతుల్‌ దూబేలను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. ఆ మృతదేహాల వద్ద పోలీసుల నుంచి లాక్కెళ్లిన పిస్తోలు కనిపించింది. అనంతరం దూబే, అతడి మిగతా బృందం కోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పెద్ద ఎత్తున అన్వేషణ మొదలుపెట్టారు. కాల్పులు జరిపి 8మంది పోలీసులను హత్య చేసిన ఘటనపై బిక్రూలో దూబే కుటుంబీకులు స్పందించారు. ఆ సమయంలో దూబే ఇంట్లో లేడని.. రెండు రోజులు ఇంటికే రాలేదని తెలిపారు.

సంతాపం వ్యక్తం చేసిన యోగి
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కాన్పూర్‌కు వెళ్లి, పోలీసుల మృతదేహాల వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. కాగా పోలీసులకే భద్రత లేనప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటి? అంటూ కాం గ్రె స్‌ నేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో భద్రత కరువైందని కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి ప్రియాంక, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. యూపీ.. హత్యాప్రదేశ్‌గా మారిందని సమాజ్‌వాదీ పార్టీ పేర్కొంది.

Courtesy Andhrajyothi