2018లో అరెస్టయిన వారిలో సగం మంది 18-36 ఏళ్లలోపువారే
రోడ్డు ప్రమాద మృతుల్లోనూ వీరే ఎక్కువ
యువత పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ…

యువతరం..  దేశానికి వెన్నెముక.
నవ్య శక్తికి, కొత్త ఆలోచనలకు వేదిక.
ఆ శక్తులు, యుక్తులు సద్వినియోగం అయితే వారి భవిత  బంగారమవుతుంది.
దేశం సుసంపన్నం అవుతుంది.
ఆ యవ్వన శక్తి పక్కదారి పడితే..
వారి జీవితం, కుటుంబం ఇక్కట్ల పాలవుతాయి.

రాష్ట్రంలో వివిధ నేరాల్లో అరెస్టవుతున్న వారిలో యువతరమే ఎక్కువగా ఉంటోంది. ఇది వారి కుటుంబాలతో పాటు సమాజంలోనూ అశాంతికి దారితీస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం మరింత క్రియాశీలకం కావాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

విలాసాల మోజులో దొంగతనాలు
గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ దొరుకుతున్న వారిలో మూడొంతుల మంది పాతికేళ్లలోపు వారే ఉంటున్నారు.  రోడ్లపై రాకెట్‌లా దూసుకుపోవాలనే మోజు.. యువత ప్రాణాలనే దోచుకుపోతోంది. రోడ్డు ప్రమాద మరణాల్లో సగం మంది 18-35 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న వారిలో సగం మంది 35 ఏళ్లలోపు వారేనని కేంద్ర ఉపరితల రవాణాశాఖ లెక్కలు చెబుతున్నాయి.

మత్తులో చిత్తు
మత్తుమందుల వాడకం దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి.  ఈ నేరాల్లో ఏటా రాష్ట్రంలో దాదాపు 400 కేసులు నమోదు అవుతున్నాయి. అరెస్టవుతున్న వారిలో మూడొంతుల మంది 35 ఏళ్ల లోపువారే. మత్తుమందులకు అలవాటుపడుతున్న వారిలో అత్యధికం 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారు.

బయటపడలేని దుస్థితి
ఒకసారి జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఎక్కడా ఉపాధి లభించని పరిస్థితిలో, నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకుంటున్నారు. అలాంటివారు మళ్లీ నేరాల బాట పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చక్కదిద్దాల్సింది కుటుంబ సభ్యులే
పిల్లల ప్రవర్తనపై ఇంటి పెద్దలే కన్నేసి ఉంచాలి. డబ్బు కోసం కొందరు నేరాలకు పాల్పడుతుంటే, విచ్చలవిడిగా డబ్బు అందుబాటులో ఉన్న వారిలో పలువురు మద్యం, మత్తుమందులకు బానిసలవుతున్నారు. ఇలాంటి వారి ప్రవర్తన తల్లిదండ్రులకే తెలుస్తుంది. మొదట్లోనే చక్కదిద్దకపోతే కేసుల వరకూ వెళ్లి కుటుంబం పరువు బజారున పడుతుంది. పిల్లల జీవితం జైలు పాలవుతుంది.

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2018లో తెలంగాణ రాష్ట్రంలో 80,987 మంది వివిధ నేరాల్లో అరెస్టయ్యారు. వారిలో ఇంచుమించు సగం మంది 18-30 ఏళ్ల మధ్యవారే.

Courtesy Eenadu