భర్తల క్రూరత్వంలో రాష్ట్రానికి అయిదో స్థానం
ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక వెల్లడి

రాష్ట్రంలో మహిళలపై 873 అత్యాచారాలు జరగ్గా.. ఇందులో తెలిసిన వ్యక్తులు చేసినవి 868.

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 2018తో పోల్చితే 2019లో నేరాలు స్వల్పంగా పెరిగాయి. జాతీయ స్థాయిలో 51,56,172 నేరాలు నమోదవ్వగా రాష్ట్రంలో ఆ సంఖ్య 1,31,254 (2.54 శాతం)గా ఉన్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాది రాష్ట్రంలో 1,26,858 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆర్థిక నేరాలు, షెడ్యూల్‌ కులాలకు చెందిన వ్యక్తులపై, సైబర్‌, మహిళలపై నేరాల్లో పెరుగుదల ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై నేరాల్లో దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌ 59,853 కేసులతో తొలిస్థానంలో ఉండగా.. 18,394 కేసులతో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2018లో 16,027 కేసులు నమోదయ్యాయి.

* కస్టడీ,లాకప్‌లో మరణాలు దేశవ్యాప్తంగా 31 నమోదవ్వగా ఆరు చొప్పున మరణాలతో మధ్యప్రదేశ్‌, తెలంగాణ మొదటిస్థానాల్లో ఉన్నాయి.
* రాష్ట్రంలో అభియోగపత్రాల దాఖలు శాతం 81.4. జాతీయ సగటు 67.2. నేరాల్లో జాతీయ శిక్షల సగటు 50.4 కాగా.. రాష్ట్ర శాతం 42.5.
* 2019లో దేశవ్యాప్తంగా షెడ్యూల్‌ కులాలపై జరిగిన నేరాలు 45,935 కాగా రాష్ట్రంలో ఏటేటా ఈ దాడులు పెరుగుతున్నాయి.2018లో 1,507, 2019లో 1,690 జరిగాయి. 2019లో షెడ్యూల్‌ కులాలకు చెందిన మహిళలపై దాడులు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

మానవ అక్రమ రవాణా
* 2019లో జరిగిన మానవ అక్రమరవాణా కేసులన్నింటిలో తెలంగాణ పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. 51 కేసుల్లో నిందితులకు శిక్ష పడగా.. 124 కేసులు వీగిపోయాయి.
* సైబర్‌ కేసుల్లో తెలంగాణ స్థానం4. 2,691 కేసులు నమోదయ్యాయి.

ఆర్థిక నేరాల్లో నాలుగో స్థానం

* ఆర్థికనేరాల్లో రాష్ట్రం 4వ స్థానంలో ఉంది.
* 7,718 ఫోర్జరీ, ఛీటింగ్‌, ఫ్రాడ్‌ కేసులతో రాష్ట్రానిది మూడో స్థానం.
* ఆర్థిక నేరాల్లో అరెస్టయిన మహిళలు రాష్ట్రంలో 842 మంది ఉండగా.. విముక్తి పొందిన స్త్రీ,పురుషులు 3,462 మంది.
* భర్తల క్రూరత్వంలో రాష్ట్ర స్థానం ఐదు.  నమోదైన కేసులు 8,541.
* రాష్ట్రంలో చిన్నారులపై జరిగిన 99.7 శాతం  అఘాయిత్యాల కేసుల్లో నిందితులు వారికి తెలిసినవారే.
* చిన్నారులపై జరుగుతున్న నేరాలను నిరూపించడంలో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు తేలిపోయింది. నిందితులకు శిక్షల శాతం 14.1 గానే ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 61.2 శాతం ఉండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైల్వే నేరాలు
2018తో పోలిస్తే 2019లో అధికంగా నమోదు
ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రైల్వేస్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులపై నేరాలు పెరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశంలో 2018తో పోలిస్తే 2019లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా ఈ కేసులు 6.8 శాతం తగ్గాయి. అదేసమయంలో ఏపీలో 6.6, తెలంగాణలో 14.86 శాతం చొప్పున పెరిగాయి. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

సంఖ్యాపరంగా తక్కువే
స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల నుంచి నగలు, నగదు చోరీ, మత్తుమందు ఇచ్చి దోపిడీకి పాల్పడటం వంటి వాటితో పాటు.. అపహరించడం, హత్య చేయడం, మారణాయుధాలతో రైళ్లలో ప్రయాణం చేయడం వంటి ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపే నేరాలపై కేసుల నమోదు, విచారణ ప్రభుత్వ రైల్వేపోలీసుల(జీఆర్‌పీ) పరిధిలోకి వస్తాయి. రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, రైళ్లు, స్టేషన్లలో రైల్వే ఆస్తుల చోరీ, టికెట్‌ లేకుండా ప్రయాణం, సిగ్నల్‌ ట్యాంపరింగ్‌, ఈవ్‌టీజింగ్‌ తదితర నేరాలపై రైల్వేపరిరక్షణ దళం కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంది.

* ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణమధ్యరైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రైల్వేనేరాలు సంఖ్యాపరంగా తక్కువే. అయితే కీలకమైన ప్రయాణ సమయంలో ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభావం చూపే నేరాలు మాత్రం ద.మ.రైల్వే పరిధిలో పెరుగుతున్నాయి. ఈ కేసుల్ని జీఆర్‌పీ నమోదుచేసి విచారిస్తోంది.

రైల్వే నేరాలు ఇలా..
2019లో దేశవ్యాప్తంగా జీఆర్‌పీ నమోదు చేసిన రైల్వేనేరాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 45,431 కేసులున్నాయి. దేశంలో జరిగిన మొత్తం రైల్వేనేరాల్లో దాదాపు 45 శాతం అక్కడే నమోదయ్యాయి. 8,570 కేసులతో యూపీ రెండో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3,342 కేసులే ఉన్నప్పటికీ.. 2018తో పోలిస్తే మాత్రం 312 రైల్వేనేరాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చూస్తే వాటి సంఖ్య 7,382కి తగ్గింది.
————————————————————–
సంవత్సరం   దేశవ్యాప్తంగా    ఏపీలో    తెలంగాణలో  

              నమోదైనవి
————————————————————–
2017         90,556          2,049       1,387
2018         1,07,092        1,685       1,345

2019         99,710          1,797       1,545

Courtesy Eenadu