* సిఆర్‌డిఏ పనులపై నిపుణుల కమిటీ అభిప్రాయం
– అమరావతి బ్యూరో:
రాజధాని నిర్మాణం విషయంలో గత ఫ్రభుత్వం అంచనాలకు మించి ఖర్చు చేసిందని, స్తోమతకు మించి టెండర్లు పిలిచిందని, టెండర్లు దక్కించుకున్న వారు ఎటువంటి గ్యారెంటీ లేకుండా పనులు మొదలుపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిపుణుల కమిటీ అంచనా వేసింది. దీనిపై త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే ప్రాథమిక వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై మరో కమిటీ వేయడం, రాజధానిని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై అది కూడా నివేదిక ఇవ్వనుండటంతో రెండిటినీ పరిశీలించిన అనంతరం సమగ్ర నివేదికను బయటపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా టెండర్లు పిలిచిన సందర్భంలో రెండు మూడు కంపెనీలే ఎక్కువ టెండర్లు దక్కించుకున్నాయని, వాటికి కూడా ఉన్నవాటికంటే అదనపు ధరను నిర్ణయించి టెండర్లు పిలిచారని నిర్థారించారు. రోడ్ల పనులు కిలోమీటరుకు రూ.11 కోట్ల వరకూ ఖర్చవుతుందని ఆ మేరకు టెండర్లు పిలిచారని, ఇది చాలా ఎక్కువని తెలిపారు. తాత్కాలిక సెక్రటేరియట్‌ నిర్మాణంలోనూ ఖరీదైన అపార్టుమెంట్లు కట్టడానికి ఎక్కువ ధర నిర్ణయించారని, అపార్టుమెంటుకు చదరపు అడుగు రూ.3200 అవుతుందనుకుంటే సెక్రటేరియట్‌కు రూ.10,200 వరకూ ఖర్చు చేశారని, ఇంత పెద్దమొత్తం నిర్మాణం చేసినా భవనాలు వర్షపునీరు కారుతున్నాయని, గతంలో అసెంబ్లీలో లాబీలు తడిసిన విషయాన్ని, ప్రస్తుతం తాత్కాలిక హైకోర్టు భవనంలోకి నీరు చేరిన అంశాన్ని ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా సెక్రటేరియట్‌ నిర్మాణానికి రూ.168 కోట్లతో టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రాలేదని, చర్చల పేరుతో రూ.220 కోట్లకు పనులు అప్పగించారని, ఇంత పెద్దఎత్తున ధర పెంచడానికి ఎవరు అనుమతిచ్చారనేది తేల్చాల్సి ఉందన్నారు.

చర్చల ప్రక్రియ పేరుతో టెండర్లు ఇవ్వడం చట్ట విరుద్ధమని చెప్పినట్లు తెలిసింది. ప్లాట్ల కేటాయింపుల్లోనూ వేసిన లాటరీ పద్ధతి సరిగా జరగలేదని, అప్పటి తెలుగుదేశం నాయకులు ఎవరికి ఎక్కడ కావాలో ముందుగానే నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ప్లాట్లు కేటాయించారని, ఇది కూడా రాజధాని భూ వ్యవహారంలో పెద్ద కుంభకోణమని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. సిఆర్‌డిఏ వద్ద రూ.140 కోట్లు ఉంటే అదే సమయంలో రూ.1400 కోట్లకు టెండర్లు పిలిచారని, ఇదెలా సాధ్యమని నిపుణులు ప్రశ్నించారు. అంతలా డబ్బులు ఎక్కడ నుండి తీసుకొస్తారనే విషయం అప్పటి అధికారులు కూడా అంచనా వేయలేదని, కేవలం ప్రచారం కోసమే పనులు, టెండర్లు కేటాయింపులు జరిపినట్లు అర్థమవుతోందని తెలిపారు. అప్పట్లో దీన్ని వ్యతిరేకించిన అధికారులపై కక్షసాధింపు చర్యలకూ దిగారని తమకు సమాచారం ఉందని, దీనిపైనా విచారణ జరపాలని సూచించినట్లు తెలిసింది. కృష్ణానదిపై బ్యారేజీ విషయంలోనూ ఎటువంటి అనుమతులూ లేకుండా సర్వేల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించారని, తొలుత జాతీయ రహదారులకు చెందిన వంతెన నిర్మాణాన్ని చేపడతామని చెప్పి అనంతరం సిఆర్‌డిఏ ఆధ్వర్యాన వంతెన నిర్మించాలని ప్రతిపాదించారని, దీనికి రూ.1100 కోట్లు ఖర్చవుతుందని చెప్పినట్లు నివేదికల ద్వారా తెలిసిందని, ఓ మంత్రికి లబ్దికలిగించాలనే ఉద్దేశంతోనే వంతెనను మార్చారని నిపుణులు అభిప్రాయపడ్డట్లు సమాచారం.

courtesy prajashakti