భూవినియోగంపై సిఆర్‌డిఎ ప్రతిపాదనలు…
రాజధాని నగరంలో పూలింగు ద్వారా సేకరించిన భూమిలో 8,039 ఎకరాలను పూర్తిగా అమ్మకానికే పెట్టారు. దానిలో 5,020 ఎకరాలు భవిష్యత్‌లో నిధుల సేకరణకు, 3,019 ఎకరాలు నగర ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల కోసం కేటాయించారు. 2015 జనవరిలో పూలింగు మొదలుపెట్టిన సమయంలో అప్పటి సిఆర్‌డిఎ ఛైర్మన్‌గా ఉన్న చంద్రబాబునాయుడు ఎకరం భూమి కూడా అమ్మబోమని, మొత్తం రాజధాని కోసమే వినియోగిస్తామని తెలిపారు. ఆచరణలో 8,039 ఎకరాలు పూర్తిగా నిధుల సేకరణ కోసం వెచ్చించారు. దీనిలో కృష్ణానదిలో ఉన్న లంక భూములనూ కలిపారు. వీటిలో రైతుల నుంచి తీసుకున్న భూములతోపాటు కృష్ణానది లంకల్లో ఉన్న భూములనూ అమ్మాలని ప్రతిపాదించారు. కృష్ణానది లంకల్లో ఉన్న భూములు ఎసైన్‌ చేసినవని, దళితులు సాగు చేయడానికి వీల్లేదని అప్పటి ఇరిగేషన్‌ అధికారులు వాటి లీజు పునరుద్ధరణను నిలిపేశారు. లంకలకు పరిహారం ఇవ్వాలా వద్దా అనేది ఇప్పటికీ తేల్చలేదు. అసైన్డ్‌ భూములకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. రైతులు కూడా తమ భూములు రాజధాని కోసమే ఇచ్చామని, అమ్మకానికి పెడితే ఊరుకోబోమని తెలిపారు. సిఆర్‌డిఎ వారికి తెలియకుండా భూపరిపాలనకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని నడిపేసింది. కృష్ణానదిలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అప్పట్లో ఐలాండ్‌ భూములు తీసుకోబోమంటే రైతులు తక్కువ ధరకు అమ్మేసుకున్నారు. వాటిని అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు కొనుగోలు చేసి పూలింగుకు ఇచ్చేశారు. అనంతరం వాటికి పరిహారం ప్రకటించారు. ఇది మోసపూరితమని ప్రస్తుత మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం రాజధానిలో 53,748 ఎకరాల భూమి ఉంది. దీనిలో నిధుల సమీకరణ కోసం కేటాయించిన భూమిలో 3,988 ఎకరాలు ప్రధాన భూమి, 1032 ఎకరాలు కృష్ణానదిలో ద్వీపాలని స్పష్టంగా ప్రతిపాదించారు. అలాగే రాజధాని నగర ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించిన 3,019 ఎకరాల్లో 1513 ఎకరాలు ప్రధాన భూమి, 1506 ఎకరాలు కృష్ణానదిలో దిబ్బలని చూపించారు. ఇవిగాక సామాజిక సదుపాయాలు, ఇతర అవసరాల కోసం మరో 1099 ఎకరాలు ప్రతిపాదించారు. ఇందులో ఇతర అవసరాలు ఏమిటనే అంశాన్ని మాత్రం పొందుపర్చలేదు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు 1293 ఎకరాలు కేటాయించారు. వీటిల్లో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూములే 800 ఎకరాల వరకూ ఉన్నాయి. వాటికి ఎకరా రూ.25 లక్షల నుండి రూ.50 లక్షల వరకూ కేటాయించారు. లీజుకిచ్చిన భూములు కూడా ప్రైవేటు సంస్థలవే ఎక్కువగా ఉన్నాయి.

Courtesy Prajasakthi…