సమన్వయలోపం అటుంచి, రాష్ట్రాలకు ఆర్థికసాయం విషయంలో కేంద్రం మౌనం వహిస్తున్నది. చాలా రాష్ట్రాల్లో 90 శాతం రెవెన్యూ ఆదాయం పడిపోయిందని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమస్య ముందుకువస్తున్నది. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలనే వాదనలు ముందుకువస్తున్నాయి.

కరోనా నియంత్రణలో భాగంగా దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ చివరి రోజుల కు చేరుకున్నది. ఏది ఎలా ఉన్నా లాక్‌డౌన్‌ ఫలితంగా కరోనా కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాం. కానీ, ఆరోగ్య వ్యవస్థలో అవసరమైన మేరకు సామర్థ్యాలు సంతరించుకున్నామా అన్నది చర్చనీయాంశమే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. కరోనా వైరస్‌తో ఆరోగ్యానికి జరిగిన నష్టం కన్నా ఆర్థిక వ్యవస్థకు చేకూరిన నష్టమే అపారం. ఇన్నాళ్ల పోరాటం, అనుభవం చెబుతున్నదేమంటే, కొవిడ్‌-19ను నిర్మూలించటం ఇప్పటికిప్పుడు అసాధ్యమైనా, అతి తక్కువ నష్టంతో దాని ప్రమాదం నుంచి బయటపడటం ఎలా అన్నదే మనం ఆలోచించాలి. మన విధానకర్తలు కూడా ఈ క్రమంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. లాక్‌డౌన్‌లను పొడిగించే క్రమంలో కరోనాతో కలిసి జీవించటం నేర్చుకోవాలంటున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ కాలంలో ఇస్తున్న అనేక సడలింపుల్లో భాగంగా ఆర్థిక, ఉత్పత్తి కార్యకలాపాలను మే 4 నుంచి ప్రారంభించటం అనేది మొదటి అడుగుగా భావించాలి. కానీ, కొవిడ్‌-19తో స్తంభించిపోయిన ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్ధరించడానికి తగిన వ్యవస్థాగత, ప్రభుత్వపర విధానరూపకల్పన అనేదేమీ లేదు. అలాగే, పాలనాపరమైన ఆదేశాలు, కార్యనిర్వాహణ పద్ధతిలో ఉండే అలసత్వం ఉండనే ఉంటుంది.

మొట్టమొదట వలస కార్మికుల విషయమై సత్వరమే దృష్టి కేంద్రీకరించాలి. వలసకార్మికుల సమస్య రాజకీయ నేతలకు కనిపించనిదైపోయింది. వలసకూలీలు తమ సొంత ఇండ్లకు పోయేందుకు గుంపులు గుంపులుగా నడిచివెళ్తున్న దీన స్థితి ఉన్నది. వారికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చటంలో, ఆహారం అందించటంలో ఘోరవైఫల్యం కనిపిస్తున్నది. వారిని ఏ కార్మిక సంస్కరణలు సంతృప్తి పర్చలేదు. లాక్‌డౌన్‌ కారణంగా వలసకార్మికుల దుస్థితి ప్రపంచానికి తెలిసివచ్చింది. అలాగే కార్మికులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో నిరసన వ్యక్తంచేయగలరో కూడా చాటిచెప్పారు. కార్మికులు నగరాల్లో ఉండలేని స్థితిలో వారిని ఎంత వారిస్తున్నా, కాలినడకన గ్రామాలకు తరలిపోతున్నారు. కార్మికులు తిరిగి వచ్చి ఆయా కంపెనీల్లో పనికి చేరుతారా అన్నది జవాబులేని ప్రశ్నగా మారింది. ఈ సందర్భంలో కార్మిక చట్టాలకు నీల్లొదిలే బదులు కార్మికుల జీవన పరిస్థితులు, సామాజిక భద్రతపై దృష్టిసారించాలి. ఇలా చేసినప్పుడే కార్మికులు తిరిగి పనిలో చేరటానికి ఆశ్వాసాన్ని అందించగలం. ప్రస్తుతం కార్మికుల హక్కుల విషయంలో దేశంలో నెలకొన్న వాస్తవ స్థితిని విస్మరించలేం. కార్మికుల రక్షణ చట్టాలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. ఏదేమైనా.. కార్మికుల హక్కులను హరించటం తగదు. దేశంలో ప్రవేశపెడుతున్న సంస్కరణల విషయంలో చర్చలను పునరుద్ధరించాలి, వాటిని పునర్నిర్మించాలి.

రెండో అతిముఖ్యమైన విషయం.. కొవిడ్‌-19తో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొ నేందుకు వ్యవస్థాగతమైన నిర్మాణం గురించి చెప్పుకోవాలి. లాక్‌డౌన్‌ను కొనసాగించాలంటే.. ప్రభుత్వం 2005 నాటి డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ యాక్ట్‌ను అమలుచేయాలి. వ్యవస్థాగతమైన నిర్మాణంలో భాగంగా.. కరోనా నియంత్రణకు కేంద్రీకృతమైన నియంత్రణ వ్యవస్థ పకడ్బందీగా పనిచేయాలి. కొన్ని రోజుల వ్యవధిలోనే దాని కార్యాచరణను ప్రారంభించాలి. ప్రజలకు నిత్యావసరాల సరఫ రాలో సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రస్తుతం ఎరుపు, ఆరెంజ్‌ జోన్లలో కూడా సరఫరాలకు ఆటంకం కలుగకుండా చూడాలి. సరఫరాలు నిరాటంకంగా కొనసాగేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో సమన్వయం ఉండాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని, సహకారాన్ని సాధించేందుకు కృషి చేయాలి.

సమన్వయలోపం అటుంచి, రాష్ట్రాలకు ఆర్థికసాయం విషయంలో కేంద్రం మౌనం వహిస్తున్నది. చాలా రాష్ట్రాల్లో 90 శాతం రెవెన్యూ ఆదాయం పడిపోయిందని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలని పలు రాష్ర్టాలు కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల సమస్య ముందుకువస్తున్నది. రాష్ర్టాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలనే వాదనలు ముందుకువస్తున్నాయి.

మూడో అంశం-సమాచార వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. కరోనా సమాచార మంతా ప్రభుత్వ యంత్రాంగంపై ఆధారపడి ఉన్నది. స్థానిక క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే లాక్‌డౌన్‌ను ఎత్తేయకూడదు. సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు భవిష్యత్తుపై విశ్వాసాన్ని కల్పించాలి. ఇది అన్నిరకాలుగా, అన్ని ప్రభుత్వ వ్యవస్థలనుంచి కొనసాగాలి. ఆర్థికవ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు అన్నిరకాల చర్యలు సమన్వయంతో సాగాలి. ఈ ఏడు వారాల లాక్‌డౌన్‌ కాలంలో ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవనం కోసం కేంద్రం ఆలోచించకపోవటం పెద్ద వైఫల్యం.

కరోనా కట్టడి కోసం మొదటిసారి లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఇది రాష్ర్టాలకు విషమ పరీక్ష అని అన్నాను. ఏడు వారాల లాక్‌డౌన్‌ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అగాధాలున్నాయని తేటతెల్లమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో విశ్వాసం నెలకొనేందుకు చేయాల్సిన పనుల గురించి ఆలోచించాలి. ఇది చాలా క్లిష్ట, కష్టతరమైన విషయంగా మారింది. దీన్ని పరిష్కరించలేకపోతే, పరిణామాలు వినాశకరంగా ఉంటాయి.

యామిని అయ్యర్‌
(వ్యాసకర్త: సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ అధ్యక్షురాలు)

Courtesy Namasthe Telangana