రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజమహేంద్రవరం ఏవీ ఏ రోడ్డు సమీపంలో నివసిస్తున్న రాజమండ్రి సతీష్‌(40), అతడి భార్య వెంకటలక్ష్మి (35)గా గుర్తించారు. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం సమస్యలతో బలవర్మణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె. లతామాధురి తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సతీష్‌ తన భార్యతో కలిసి ఆనాల వెంటక అప్పారావు రోడ్డులోని నెతన్యా స్కూల్‌ ఎదురుగా ఉన్న వీధిలో నివాసం ఉంటున్నాడు. సతీష్‌ భార్య చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసేది. 20 సంవత్సరాల క్రితం పెళ్లైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఫైనాన్స్‌ మీద అప్పు తీసుకుని ఆటో కొనుకున్న సతీష్‌ అనారోగ్య సమస్యల కారణంగా పూట గడవని పరిస్థితుల్లో వాయిదాలు కట్టలేకపోయాడు. దీనికి తోడు తమకు కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానం మొదలైంది.

అప్పులు, అనారోగ్యం, సంతానలేమితో సతీష్‌, వెంకటలక్ష్మి బాగా కుంగిపోయారు. గురువారం అర్ధరాత్రి తమ ఇంటికి సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పించుకున్నారు. రాత్రి సమయంలో వారిద్దరూ బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సంఘటనా స్థలంలోని బ్యాగ్‌ను, వారి ఇంట్లో దొరికిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ మరణానికి ఎవరూ కారణం కాదని అప్పులు, అనారోగ్య సమస్యల వల్లే ఇలా చేసినట్టు ఈ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.