• దేశంలో 5వ స్థానం…
  • దక్షిణాదిలో టాప్‌..
  • లంచం ఇస్తేనే 67 శాతం మందికి పని పూర్తవుతోంది
  • రెవెన్యూ, మునిసిపల్‌,
  • పోలీసు శాఖల్లో అవినీతి మరీ ఎక్కువ
  • ఇండియా కరప్షన్‌ సర్వే 2019 నివేదిక

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి పట్టి పీడిస్తోంది. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, మునిసిపల్‌, పోలీసు శాఖల్లో అవినీతి విపరీతంగా ఉంది. రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 67 శాతం అవినీతి జరుగుతున్నట్టు తేలింది. అంటే నూటికి 67 మంది పౌరులు తమ పనుల కోసం అధికారులకు లంచాలు సమర్పించుకుంటున్నారు. ఈ విషయంలో దేశంలో రాజస్థాన్‌ మొదటి స్థానంలో ఉంది. బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేరళలో అవినీతి తక్కువగా ఉంది. ఆ తర్వాతి స్థానం గోవాకు దక్కింది.

రాజస్థాన్‌లో 78 శాతం అవినీతి ఉంటే కేరళలో అది 10 శాతమే కావడం విశేషం. ఇండియా కరప్షన్‌-2019 పేరిట నిర్వహించిన సర్వేలో ఈ అవినీతి లెక్కలు బయటపడ్డాయి. 2018 అక్టోబరు నుంచి 2019 నవంబరు మధ్య ఈ సర్వే నిర్వహించారు. 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9 లక్షల మంది స్థానిక ప్రజలు, సోషల్‌ మీడియా, ఇతర వర్గాల నుంచి సమాచారం సేకరించారు.

భూ దస్త్రాల ప్రక్షాళన తర్వాత…
రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల అవినీతి భారీగా పెరిగిందనే ఆరోపణలను నిజం చేసేలా తాజా సర్వే ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా అధికారం కేంద్రీకృతం అయింది. సీఎం, ఆయన కార్యాలయం చుట్టూ పాలన సాగుతోందని, మంత్రుల నుంచి కింది స్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఎవరి మాటను అధికారులు విన డం లేదనే విమర్శలు ఉన్నాయి.

దాంతో ప్రజల పని జరగాలంటే పైసలు ఇవ్వక తప్పడం లేదు. ముఖ్యంగా భూ దస్ర్తాల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ విభాగంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. న్యాయబద్ధంగా ఉన్న భూములు సైతం వివాదంలో ఇరుక్కుంటున్నాయి. లంచాలు ఇవ్వనిదే వాటిని అధికారులు సరిచేయడం లేదు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కూడా డబ్బు లేనిదే పనికావడం లేదు.

లంచం ఇవ్వకపోతే కొర్రీ
‘ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణ అనుమతి’కీ లంచం బెడద తప్పలేదు. దరఖాస్తు చేసిన వెంటనే అధికారికి కొంత ముట్టచెబితేనే ఫైల్‌ కొర్రీ లేకుండా బయటకు వస్తుంది. వెనక్కి పంపిస్తే రెట్టింపు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ముందుగానే ఇస్తున్నారు. పోలీసు శాఖలో స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే కాదు, ఫిర్యాదుదారూ లంచాలు ఇవ్వక తప్పడం లేని సర్వేలో స్పష్టమైంది.

మళ్లీ మళ్లీ లంచం
తెలంగాణలో లంచం ఇచ్చిన 67 శాతంలో 56 శాతం రెండు కంటే ఎక్కువసార్లు లంచం ఇచ్చారు. కొందరు నేరుగా అధికారులకు సమర్పించుకోగా, కొందరు పరోక్షంగా ఇచ్చారు. 40ు రిజిస్ట్రేషన్‌, భూముల పనుల కోసం లంచం ఇస్తున్నారు. తర్వాత 33 శాతం లంచాలను మునిసిపల్‌ అధికారులకు, మరో 7 శాతం లంచాలను పోలీసులకు, 20 శాతం లంచాలను విద్యుత్తు, రవాణా, ఇతర శాఖలకు చెల్లిస్తున్నట్టు సర్వేలో వెల్లడయింది. గత ఏడాది లంచాలు ఇచ్చామని చెప్పిన వారి శాతం 43 కాగా ఈ ఏడాది అది 67కు పెరిగింది. ఏమీ ఇవ్వకుండానే తమ పని పూర్తయినట్టు 11 శాతం మంది మాత్రమే చెప్పారు.

Courtesy AndhraJyothy…