• ముంపు సమస్యలేని వారు కూడా దరఖాస్తు.. మీ-సేవలో భారీగా అర్జీలు
  • 6-7 గంటల్లో ఖాతాల్లో డబ్బులు.. మిత్రులకు సమాచారం 
  • మీ-సేవ నిర్వాహకుల చేతివాటం.. బంధువుల పేర్లతో అర్జీ
  • ఇప్పటికే 70 వేల మంది దాకా అనర్హుల ఖాతాల్లో డబ్బు

ముషీరాబాద్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్య ఆధార్‌కార్డు, ఇతర వివరాలను నమోదు చేయించి వరదసాయం పొందాడు. వాస్తవంగా ఆయన ఇంటి సమీపంలోకి వరద తాకిడి లేకున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులను ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో భార్యను మంగళవారం మీ-సేవ కేంద్రం వద్ద క్యూలైన్‌లో ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు నిలబెట్టి వివరాలు నమోదు చేయించాడు. రాత్రి 8.30 గంటలకు బ్యాంకు ఖాతాలో రూ. 10 వేలు పడడంతో సంతోషపడ్డారు.

హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వం అందజేస్తున్న వరద సాయం పక్కదారి పడుతోందని, బాధితులు కాని వారు కూడా అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, మొత్తంగా ప్రభుత్వ సాయం దుర్వినియోగం అవుతోందని చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు! వరద ముంపులో చిక్కుకుపోయిన బాధితులను ప్రత్యక్షంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న తక్షణ సాయం అనర్హులకూ వరమైంది. తమ కాలనీలు.. ఇళ్లు.. నీట మునగకున్నా, ముంపు సమస్యను ఎదుర్కోకపోయినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని గంటల వ్యవధిలో సాయం పొందారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం  సోమవారం నుంచి బుధవారం వరకు రెండు లక్షల అప్లికేషన్లు రాగా, ఇందులో 60 నుంచి లంగర్‌హౌజ్‌కు చెందిన ఇద్దరు యువకులు, పంజాగుట్టలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నారు. మీ-సేవ కేంద్రంలో  దరఖాస్తు చేసుకుంటే వరదసాయం ఇస్తున్నారని తెలుసుకొని సోమవారం తమ సంస్థ సమీపంలోని కేంద్రంలో రూ.75 వెచ్చించి ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకున్నారు. వారు సాయంత్రం 4 గంటలకు దరఖాస్తు చేసుకుంటే రాత్రి 11 గంటలకు ఖాతాలో రూ.10వేలు జమయ్యాయి. వెంటనే విషయాన్ని తమ చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారంతా మంగళవారం మీ-సేవ  కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు పెట్టుకున్నారు.  సాయం పొందిన ఇద్దరు యువకులు కూడా రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్నారు.70 వేల మంది అనర్హులు పరిహారం పొందినట్లు తెలుస్తోంది. గత నెల 13న  భారీ వర్షానికి నగరంలోని దాదాపు 1500 పైగా కాలనీలు నీటమునిగాయి. పలువురి ఇళ్లు పూర్తిగా కూలిపోగా, మరికొందరి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి.

వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 20 నుంచి తక్షణ సాయంగా రూ.10వేల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీకి చెందిన ఇద్దరు, రెవెన్యూ విభాగంలోని ఒక అధికారి కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు సాయం అందించే ప్రక్రియ కొనసాగింది. రెండు రోజుల వరకు సజావుగా జరిగిన సాయం పంపిణీ తర్వాత పక్కదారి పట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నారు. తమ అనుచరులు, తెలిసిన వారికే డబ్బులు ఇప్పించారు. పలువురు అధికారులు కూడా వారితో కుమ్మక్కు కావడంతో అసలు బాధితులకు న్యాయం జరగ లేదు.

ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు… ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడించడంతోపాటు జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలకు దిగారు. కాగా సాయం కోసం మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు బాధితులకు ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్‌ నవంబరు 14న ప్రకటించారు. సోమవారం నుంచి వేల సంఖ్యలో జనం మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల బాటపట్టారు. ప్రభుత్వ ప్రకటనను ఆసరాగా చేసుకొని  వరదలతో ఏమాత్రం ఇబ్బంది పడని చాలామంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవనాల్లో నివాసముండే వారు కూడా క్యూల్లో నిల్చుని దరాఖాస్తు పెట్టుకున్నారు. దీంతో అసలు బాధితుల కంటే ఇతరుల తాకిడితో మీ-సేవ, ఈ-సేవ సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది

బంధువులు, స్నేహితులకే ప్రాధాన్యం..
ప్రభుత్వ సాయాన్ని అడ్డుగా పెట్టుకుని పలువురు మీ-సేవ, ఈ-సేవ సెంటర్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. తమ వద్దకు వచ్చే బాధితుల అప్లికేషన్లను పక్కకు పెట్టి బంధువులు, స్నేహితులకు ప్రాధాన్యమిచ్చారని, రాత్రికి రాత్రే వందలాది దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసి ప్రభుత్వ సాయాన్ని దర్జాగా స్వాహాచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తు ఫారానికి కొన్ని ప్రాంతాల్లో రూ. 20 నుంచి రూ.50 తీసుకుంటుండగా, పూర్తి చేసేందుకు రూ.200 నుంచి రూ.500 వర కు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.

దరఖాస్తుల నమోదు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో నిలబడిన బాధితులను పక్కకు పెట్టిన పలువురు నిర్వాహకులు తమ బంధువులు, స్నేహితుల అప్లికేషన్లను చకాచకా పూర్తిచేసి అప్‌లోడ్‌ చేశారు. దీంతో వారి ఖాతాల్లో డబ్బులు 8-10 గంటల్లోనే పడిన ట్లు తెలిసింది. సోమవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఇలా వేలాది దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 199 మీ-సేవ, 286 ఈ-సేవా కేంద్రాలుండగా, దాదాపు 80 సెంటర్లలో ఈ తతంగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

నిబంధనలు సరిగా లేకనే
మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటే నీట మునిగిన వారికి సాయం అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం నిబంధనలు సక్రమంగా విధించకపోవడంతోనే పెద్ద సంఖ్యలో అనర్హులు డబ్బులు పొందుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వరదలో చిక్కుకుపోయిన కాలనీలను ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం ఆయా ఏరియాల్లోని ఇంటి నంబర్ల ప్రకారమే ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటే డబ్బులు దుర్వినియోగమయ్యే పరిస్థితి ఉండకపోయేదని పలువురు వాపోతున్నారు.

మీ సేవ అక్రమాలపై కొరడా
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న రూ.10 వేల సాయంలో పలువురు మీ-సేవ, ఈ-సేవ సెంటర్ల నిర్వాహకుల అక్రమాలపై రెవెన్యూ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ని సెంటర్లలో దరఖాస్తుల స్వీకరణ జరిగిందో, ఏయే ప్రాంతాల వారిని పరిగణనలోకి తీసుకున్నారో.. వరద ముంపు బాధితుల ఎంత మంది ఉన్నారోనన్న సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అప్‌లోడ్‌ చేసిన సెంటర్లపై గ్రేటర్‌ ఎన్నికల తర్వాత చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Courtesy Andhrajyothi