– నితీశ్‌ క్యాబినెట్‌ నుంచి మేవాలాల్‌ రాజీనామా

పాట్నా : అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న జేడీ(యూ) నేత, బీహార్‌ విద్యా శాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి మంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చ టే అయింది. ఆర్జేడీతో సహా ప్రతిపక్షాలు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని పట్టుబట్టడం తో గురువారం ముఖ్యమంత్రితో 30 నిమిషాల సేపు రహస్య సంభాషణలు జరిపిన అనంతరం చౌదరి తన రాజీనామాను ప్రకటించారు. బీహార్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఉండగా అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌, జూనియర్‌ సైంటిస్టుల నియామకాల్లో అవినీతికి పాల్పడినట్టు 2017లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 2019 జూన్‌2న మేవాలాల్‌ చౌదరి భార్య, మాజీ ఎమ్మెల్యే నీతా చౌదరి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరిపించాలని మాజీ ఐపీఎస్‌ అధికారి ఒకరు డీజీపీకి లేఖ రాశారు. అగ్రికల్చరల్‌ యూనివర్సిటిలో అవినీతికి సంబంధించిన వివరాలు ఆమెకు తెలుసు గనుక మేవాలాల్‌యే ఆమెను చంపించేశా రన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న మేవాలాల్‌ను పార్టీ నుంచి ఒకసారి సస్పెండ్‌ చేశారనీ, అటువంటి వ్యక్తికి మంత్రి పదవిని నితీశ్‌ కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అసలు దోషి నితీషేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ విమర్శించారు.

Courtesy Nava Telangana