– కార్పొరేషన్‌లపై టీఆర్‌ఎస్‌ నజర్‌
– మేయర్‌ సీటుకు రూ.4కోట్లు
– కార్పొరేటర్‌ టికెట్‌కు రూ.25లక్షలు
– ‘రియల్‌’ కేంద్రాలుగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కార్పొరేషన్‌లు
– రంగంలోకి వ్యాపారులు

మనీ పాలిటిక్స్‌లో ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికలు మరింత హాట్‌గా మారాయి. లక్షలు, కోట్లు ఉంటేనే టికెట్లు దక్కేలా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాజకీయమంతా ‘కోట్ల’ చుట్టే తిరుగుతోంది. అంత డబ్బుంటేనే టికెట్లు ఇస్తామని పలువురు అధికార పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే, డబ్బు రాజకీయంపై మొద టి నుంచి పార్టీలో పనిచేసిన నేతలు, ఉద్యమకారులు పెదవి విరుస్తు న్నారు. మేడ్చల్‌ జిల్లాలోని జవహర్‌నగర్‌, బోడుప్పల్‌, ఫీర్జాదిగుడ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న తమకు టికెట్టు ఇవ్వకుండా నేతల భార్యలకు ఎందుకిస్తారని మంత్రి మల్లారెడ్డిని మహిళా కార్యకర్తలు నిలదీశారు. ఈ క్రమంలోనే జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్ప పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా, శివారు ప్రాంతాల్లోని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రాజకీయాల్లోకొచ్చి ప్లాట్ల ధరలు పెంచినట్టే.. కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ టికెట్ల రేటు కూడా అమాంతం పెంచేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనే రీతిలో ఎన్నికలు జరుగుతున్నాయని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే..
రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుంటే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే ఏడు ఉన్నాయి. 120 మున్సిపాలిటీలకు గాను 21మున్సిపాలిటీలు ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, బండ్లగుడ జాగీర్‌, బోడుప్పల్‌, ఫీర్జాదిగుడ, జవహర్‌నగర్‌, నిజాంపేట్‌ కార్పొరేషన్లు కీలకంగా ఉన్నాయి. ఈ ఏడు కార్పొరేషన్లు రియల్‌ఎస్టేట్‌కు కేంద్రాలుగా ఉండటంతో అందరి దృష్టి వీటిపైనే ఉంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైతం వీటిపై దృష్టి కేంద్రీకరించింది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. వీటితోపాటు పెద్ద అంబర్‌పేట్‌, తుర్కయంజాల్‌, మణికొండ, మేడ్చల్‌, నార్సింగి, దుండిగల్‌, కొంపల్లి, షాద్‌నగర్‌, ఆదిబట్ల మున్సిపాలిటీలు సైతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ సైతం ఈ ప్రాంతాలపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

టికెట్ల కోసం కోట్లు..
శివారు ప్రాంతాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లలో టికెట్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చించే అవకాశం ఉంది. కార్పొరేషన్లలో కార్పొరేటర్‌ టికెట్టు కోసం రూ.25లక్షల నుంచి 50లక్షల వరకు పలుకుతోంది. మేయర్‌ పదవి దక్కాలంటే సుమారు రూ.4కోట్లు ముట్టజెప్పుకోవాల్సిందేనని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌ సీటు కోసం తనను రూ.25లక్షలు డిమాండ్‌ చేశారని టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు పుష్ప బహిరంగంగానే ఆరోపణలు చేశారు. బోడుప్పల్‌, ఫీర్జాదిగుడ కార్పొరేషన్లలోనూ మహిళలు ఆందోళన చేశారు. అధికార పార్టీలో పోటీ తీవ్రంగా ఉండటంతో భారీగా డబ్బులు ఖర్చు పెట్టేవారికే టికెట్టు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. జవహర్‌నగర్‌లో బండకింద ప్రసాద్‌గౌడ్‌, బల్లి శ్రీనివాస్‌గుప్ప, బోడుప్పల్‌లో మంద సంజీవరెడ్డి, రాపోలురాములు, ఫీర్జాదిగుడలో జక్క వెంకట్‌రెడ్డి, దర్గ దయాకర్‌రెడ్డి, మీర్‌పేట్‌లో శ్రీనివాస్‌నాయక్‌, దీప్‌లాల్‌చౌహాన్‌, బడంగ్‌పేట్‌లో భీమిడి జంగారెడ్డి, రామిడి రాంరెడ్డి, ఆనంద్‌రెడ్డి, బండ్లగూడ జాగీర్‌లో మహేందర్‌గౌడ్‌, ప్రేంగౌడ్‌, సురేష్‌గౌడ్‌, నిజాంపేట్‌లో కొలను శ్రీనివాస్‌రెడ్డి, రంగరాయ ప్రసాద్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే, పోటీలో ఉండే వారిలో ఎక్కువ మంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులే కావడం గమనార్హం. వీరిలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే వారివైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

(Courtesy Nava Telangana)