న్యూఢిల్లీ : భారత బ్యాంకింగ్‌ రంగాన్ని ఇప్పటికే మొండి బాకీలతో బొప్పి గట్టిస్తున్న కార్పొరేట్‌ కంపెనీలు మరింత ముప్పును పెంచే పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేట్‌ రంగానికి సంబంధించి రూ.37.72 లక్షల కోట్ల అప్పులు ఒత్తిడిలో ఉన్నాయని ఇటీవల ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మెన్‌ హర్ష్‌ గోయాంక పేర్కొన్నారు. మొత్తం బ్యాంకింగ్‌ రంగంలో ఈ వాటా 38 శాతంగా ఉందన్నారు. రాజకీయ పలుకుబడి, ఒత్తిడితో ఈ వర్గాలకు బ్యాంక్‌లు ఇబ్బడిమబ్బడిగా రుణాలు ఇస్తున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత కొన్ని త్రైమాసికాలుగా భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) భారీగా పడిపోతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత కుబేరుల ఆస్తులు మాత్రం రేసు గుర్రంలా పరుగెడుతున్నాయి. కానీ వారి కంపెనీలు మాత్రం ఒత్తిడిలో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ పరిణామాల వల్ల తమ సంస్థలు ఒత్తిడికి గురైతున్నాయనీ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు. మరోవైపు పలు కంపెనీల పరపతికి రేటింగ్‌ ఎజెన్సీలు కోత పెడుతున్నాయి. 2019-20లో దాదాపుగా 584 కంపెనీల పరపతిని తగ్గిస్తూ ఇక్రా రేటింగ్‌ ఎజెన్సీ నిర్ణయం తీసుకుంది. గత ఐదేండ్లలో సగటున పరపతికి కోత పడిన సంస్థలు 9 శాతంగా ఉంటే.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇది 16 శాతానికి చేరింది. వీటి మొత్తం విలువ రూ.7 లక్షల కోట్లుగా ఉంది. ఐదేండ్ల సగటు విలువ రూ.3 లక్షల కోట్లుగా ఉంది. ఆయా కంపెనీలు రేటింగ్‌ ఎజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ పరపతి పెంపునకు సుముఖంగా లేవని పరిశ్రమ వర్గాల సమాచారం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 10 శాతం పడిపోవచ్చని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఏజెన్సీలు అంచనాలు వేశాయి. ఈ ప్రభావం అనేక కంపెనీల అప్పులు డీఫాల్ట్‌ కావడానికి, రుణాల పునర్‌ వ్యవస్థీకరణ, వాటాలు లేదా ఆస్తుల విక్రయానికి దారి తీయనుందని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన ఐదు సంవత్సరాల నుంచి భారత బ్యాంకింగ్‌ రంగంలో మొండి బాకీలు వేగంగా పెరగడం ద్వారా పలు ఆందోళనలకు దారి తీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ వర్గానికి ఇచ్చిన అప్పులు మొండి బాకీలుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ ఏకంగా మైనస్‌ 23.9 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరితే పలు కార్పొరేట్‌ కంపెనీలు చేతులెత్తేసే ప్రమాదం లేకపోలేదనీ.. దీని వల్ల బ్యాంక్‌లకు భారీ నష్టం వాటిల్లనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బ్యాంక్‌లు ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడంతో రూ.7 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. మోడీ సర్కార్‌ గడిచిన ఐదేండ్లలో అత్యధికంగా రూ.5.55 లక్షల కోట్ల అప్పులను రద్దు చేసింది. ఇందులో గరిష్ట వాటా కార్పొరేట్‌ కంపెనీలవే అన్నది జగమెరిగిన సత్యం.

కంపెనీ ఆదాయం అప్పులు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
హిందుస్థాన్‌ కాపర్‌ 889 1,564
చెన్నై పెట్రోలియం కార్ప్‌ 37,196 8,698
భారతీ ఎయిర్‌టెల్‌ 56,107 82,363
వొడాఫోన్‌ ఐడియా 46,153 1,15,118
నెట్‌వర్క్‌18 మీడియా 123 2,218
టాటా మోటార్స్‌ 45,311 25,445
వేదాంత 38,726 38,937
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 1,163 8,876
అదానీ పవర్‌ 1,916 14,372
ఆధారం : ఏస్‌ ఈక్విటీ (2019-20కి సంబంధించిన గణంకాల సమాచారం.)

Courtesy Nava Telangana