కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో టాప్‌ 1,000 లిస్టెడ్‌ కంపెనీలకు పన్ను ఆదా : క్రిసిల్‌

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం తీసుకున్న నిర్ణయం వల్ల కంపెనీలకు వేల కోట్ల రూపాయల పన్ను ఆదా కానుంది. క్రిసిల్‌ రీసెర్చ్‌ అంచనా ప్రకారం.. స్టాక్‌ మార్కెట్లో నమోదైన టాప్‌ 1,000 కంపెనీల పన్ను ఆదా మొత్తమే రూ.37,000 కోట్ల వరకు ఉండనుంది. ‘‘గత కొన్ని రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. శుక్రవారం నాటి ప్రకటన చాల ముఖ్యమైనది. మా విశ్లేషణ ప్రకారం.. 1,000 కంపెనీల పన్ను ఆదా మొత్తం రూ.37,000 కోట్ల వరకు ఉండనుంది. లేదా ప్రభుత్వం భావిస్తున్న మొత్తం పన్ను ఆదాలో నాలుగో వంతుకు అవకాశం ఉంది’’ అని క్రిసిల్‌ రీసెర్చ్‌ పేర్కొంది. పన్ను రేటు తగ్గింపుతో చాలా ఆసియా దేశాల సరసన భారత్‌ కూడా చేరిపోయిందని తెలిపింది. 80కి పైగా రంగాలకు చెందిన 1,000 కంపెనీలను క్రిసిల్‌ రీసెర్చ్‌ విశ్లేషణ చేసింది. ఈ కంపెనీల వాటా ఎన్‌ఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో 70 శాతానికి పైగా ఉంటుంది. భారత కంపెనీలు చెల్లిస్తున్న మొత్తం పన్నులో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫైనాన్షియల్‌ సర్వీసుల రంగం వాటా దాదాపు మూడో వంతు ఉంటుంది. కాగా 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపునకు ముందు లాభాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అంచనాలు వెలువరించినట్టు క్రిసిల్‌ పేర్కొంది.

బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు ప్రయోజనం

కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలకు అధికంగా ప్రయోజనం లభించనున్నట్టు ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. అయితే ఐటీ, ఫార్మా వంటి కంపెనీలకు ఈ పన్ను తగ్గింపు ద్వారా చెప్పుకోదగిన స్థాయిలో ప్రయోజనం ఉండకపోవచ్చని, ఇప్పటికే ఈ రంగాలకు సంబంధించిన ప్రభావిత పన్ను రేటు తక్కువ స్థాయిలో ఉందని తెలిపింది. ‘‘ఊహించని విధంగా ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటన చేసింది. దీంతో ఈ పన్ను రేటు 35 శాతం నుంచి 25.17 శాతానికి చేరుకుంది. డైరెక్ట్‌ టాక్స్‌ కోడ్‌ (డీటీసీ) అమలు అజెండాలో ఇది కీలకమైన నిర్ణయం. వృద్ధికి పునరుజ్జీవం కల్పించడానికి ఇది దోహదపడుతుంది. సెంటిమెంట్లు మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది’’ అని నివేదిక వివరించింది. తక్షణ ప్రయోజనం ఏమిటంటే కార్పొరేట్‌ కంపెనీల్లో నగదు ప్రవాహం పెరుగుతుంది. దీని వల్ల అప్పును తగ్గించుకోవడానికి లేదా పెట్టుబడులతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి పన్ను రేటును 15 శాతంగా నిర్దేశించడం వల్ల గ్లోబల్‌ క్యాపిటల్‌ను ఆకర్షించడానికి, ఇన్వె్‌స్టమెంట్‌ సైకిల్‌ను

ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. ‘‘కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాల్లో వార్షిక సగటు వృద్ధి వరుసగా 48.2 శాతం, 18 శాతంగా ఉండవచ్చు. ఇంతకు ముందు ఇది వరుసగా 42.2 శాతం, 12.2 శాతంగా ఉంది. అయితే ఇప్పటికే పన్ను రేట్లు తక్కువగా ఉన్నందు వల్ల ఐటీ, ఫార్మా రంగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చు’’అని నివేదిక విశ్లేషించింది. పన్ను రేటు తగ్గింపుతో ఆటో ఎక్వి్‌పమెంట్‌ తయారీదారులు ఎక్కువ లబ్ది పొందే అవకాశం ఉందని పేర్కొంది. బ్యాంకులు తమ పన్ను తర్వాతి లాభాల్లో 11-13 శాతం వృద్ధిని ప్రకటించవచ్చని తెలిపింది. దీంతో బ్యాంకు ల సవరించిన పుస్తక విలువ 1-3ు పెరిగే ఆస్కారం ఉందని పేర్కొంది.

పరిశ్రమకు ఊతం: ఆది గోద్రెజ్‌

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటన మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రగతిని మారుస్తుందని అని గోద్రెజ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఆది గోద్రెజ్‌ అన్నారు. ఇంతకు ముందు 1991 జూలైలో వెలువడిన ప్రకటనకే ఇప్పటిదాకా గొప్ప ప్రాధాన్యత ఉంది. తాజాగా ప్రకటించిన పన్ను రేట్లు సానుకూల ప్రభావం చూపుతాయని త్వరలోనే టర్న్‌ఎరౌండ్‌ సాధించే అవకాశం ఉందని గోద్రెజ్‌ పేర్కొన్నారు.

Courtesy AndhraJyothi..