– వి.వి.ఆర్‌ కృష్ణంరాజు Image result for వి.వి.ఆర్‌ కృష్ణంరాజు

కార్పొరేట్‌ మీడియా, ప్రజలకు మేలు చేస్తున్నట్లు నటిస్తూ పాలకుల ప్రయోజనాలు కాపాడుతూ, తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటోంది. కార్పొరేట్‌ సంస్థలు-రాజకీయ శక్తుల మధ్య ఎన్నటికీ విడదీయరాని బంధాన్ని ఏర్పరచడానికి జాతీయ మీడియా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జిగురుగా మారింది.

ఎన్నో దశాబ్దాల క్రితమే దేశంలోని ‘పత్రికలు’ పెట్టుబడిదారులకు, కట్టు కథలకు పుట్టిన విష పుత్రికలని మహా కవి శ్రీశ్రీ చాలా కచ్చితంగా చెప్పారు. ఆయన చెప్పినట్లే ప్రస్తుతం జాతీయ మీడియాలో అత్యధిక శాతం పత్రికలు కార్పొరేట్‌ శక్తుల గుప్పెట్లో బందీగా మారాయి. స్వార్ధ చింతనతో వార్తలను వక్రీకరిస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పౌరసత్వ బిల్లు ఎందుకని గాని, బాలాకోట్‌ దాడులకు సాక్ష్యాలు ఎక్కడని గాని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దేశ ద్రోహుల జాబితాలో చేరుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పే వారిపై ‘అర్బన్‌ నక్సలైట్‌’ ముద్ర వేస్తున్నాయి. దేశం వెలిగిపోతోందని, (ఇండియా షైనింగ్‌) అత్యధికంగా ఆర్థిక వృద్ధి రేటు నమోదవుతోందని ఒక వైపు ప్రభుత్వం ప్రకటిస్తూ వుంది. మరోవైపు లాభాలు ఆర్జిస్తూ, ప్రభుత్వానికి ఏటా వేలాది కోట్ల రూపాయల నిధులిస్తున్న ఎల్‌.ఐ.సి వంటి సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. కాని దేశభక్తి నిండుగా(!) ఉన్న ఈ జాతీయ మీడియా తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఈ కార్పొరేట్‌-మీడియా అపవిత్ర కలయిక నానాటికి బలపడుతూ దేశం లోని మీడియా మొత్తాన్ని కబళించే స్థాయికి చేరింది. ప్రస్తుతం దేశ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన 250 కార్పొరేట్‌ కంపెనీలకు పత్రికలు, న్యూస్‌ ఛానళ్ళు, ఆన్‌లైన్‌ ఎడిషన్లు ఉన్నాయి.

రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మాట్లాడుతూ, తమ సంస్థకు 72 టెలివిజన్‌ ఛానెళ్లు ఉన్నాయని, వీటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది వీక్షకులు వున్నారని, మొత్తం వీక్షకుల్లో వీరు 95 శాతమని ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక సర్క్యులేషన్‌ (34 లక్షలు) గల ఆంగ్ల దిన పత్రిక ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ బెన్నెట్‌, కోల్‌మన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ అనే కార్పొరేట్‌ సంస్థ చేతిలో ఉంది. ఈ సంస్థకు మూవీస్‌ నౌ, ఎం.ఎన్‌.ఎక్స్‌, ఎం.ఎన్‌ ప్లస్‌, రోమెడీ నౌ, జూమ్‌, టైమ్స్‌ నౌ, టైమ్స్‌ నౌ వరల్డ్‌, మిర్రర్‌ నౌ, ఇ.టి.నౌ శాటిలైట్‌ ఛానళ్లు ఉన్నాయి.
1924లో మహాత్మాగాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన ‘హిందుస్థాన్‌ టైమ్స్‌’ హెచ్‌.టి.మీడియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. దీని యజమానులు కె.కె.బిర్లా కుటుంబ సభ్యులు. బ్లూమ్‌ బర్గ్‌లో ప్రధానంగా రెండు విదేశీ పెట్టుబడుల కంపెనీలకు వాటాలున్నాయి. ‘ఓ.బి.పి న్యూస్‌ ఛానల్‌’, ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ పత్రికను క్యూములస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నడుపుతున్నాయి.

ఈ మీడియా యజమానులు రాజకీయ పార్టీల అడుగులకు మడుగులొత్తుతూ తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు. సుమారు మూడు దశాబ్దాల నుంచి మీడియాను కబళిస్తూ వస్తున్న కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు సామాన్య ప్రజల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించాయి. పేదరికం, ప్రజా సమస్యలు గాలికొదిలేసి, హంగులు, ఆర్భాటాలు, పబ్‌లు, ఫ్యాషన్‌ వార్తలకు, నిరాధార, తప్పుడు కథనాలకు ఈ కార్పొరేట్‌ మీడియా పెద్ద పీట వేస్తోంది. ‘సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌’ అధ్యయనం ప్రకారం కార్పొరేట్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న పత్రికల ప్రధాన పేజీల్లో గ్రామీణ వార్తలు 0.18 శాతం, న్యూస్‌ ఛానళ్ళలో 0.16 శాతం మాత్రమే కనిపించాయి. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే గత మూడు దశాబ్దాలుగా ఈ కార్పొరేట్‌ మీడియా ఒక్కటంటే ఒక్క కుంభకోణాన్ని కూడా వెలికితీయక పోవడం. దేశాన్ని కుదిపిన కుంభకోణాల్లో బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు ఒప్పందం ఒకటి.

ఈ కుంభకోణంపై రాజకీయ కోణంతో కొన్ని పత్రికలు పుంఖాను పుంఖాలుగా వార్తలను ప్రచురించాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ కుంభకోణాన్ని మొదట 1986 మే నెలలో వెలుగులోకి తెచ్చింది స్వీడన్‌కు చెందిన స్థానిక రేడియో. అనంతరం వెలుగులోకి వచ్చిన ‘ఆదర్స్‌ హౌసింగ్‌ సొసైటీ’ కుంభకోణాన్ని మరాఠీ స్థానిక పత్రిక, కామన్‌ వెల్త్‌ స్కాం, 2జి స్పెక్ట్రమ్‌, తెల్గీ స్టాంప్‌ స్కాం, బొగ్గు కుంభకోణం, వక్ఫ్‌బోర్డ్‌ భూముల కుంభకోణాన్ని ‘విజిల్‌ బ్లోయర్స్‌’ లేదా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందిన వారు వెలికి తీశారు. అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణాన్ని ఇటలీకి చెందిన ఒక వార్తా వెబ్‌సైట్‌ వెలికితీయగా, సత్యం కుంభకోణాన్ని సత్యం రామలింగరాజు స్వయంగా వెల్లడి చేసేంత వరకూ ఘనత వహించిన జాతీయ మీడియాకు తెలియదు.

ఈ పత్రికలు, న్యూస్‌ ఛానళ్ళు స్టాక్‌ మార్కెట్‌లో జరిగే అవకతవకలపై నోరు మెదపవు, ఎందుకంటే వాటి యజమానులకు లక్షలాది కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయి గనుక. తమ షేర్‌ విలువను పెంచుకోవడానికి కార్పొరేట్‌ మీడియా సంస్థల యజమానులు తమ మీడియాను విజయవంతంగా ఉపయోగించుకుంటున్నారు. కార్పొరేట్‌ మీడియా విశ్వాస ఘాతుక చర్యలకు చిన్న, మధ్య తరగతి మదుపరులు బలౌతున్నారని, ఆ మీడియా సలహాలపై షేర్లు కొనవద్దని ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాధ్‌ ఇటీవల తన ప్రసంగంలో చెప్పారు. కార్పొరేట్‌ మీడియా సహకారంతో స్టాక్‌ మార్కెట్‌ను ఎలా తమకు అనుకూలంగా మలచుకోవచ్చో చెప్పడానికి ఒక ఉదాహరణ కృష్ణా-గోదావరి బేసిన్‌ గ్యాస్‌ నిక్షేపాలు.

2002లో కె.జి.బేసిన్‌ లోని ధీరూభారు-6 బ్లాక్‌లో తాము దేశం లోనే అతి పెద్దవైన, అపారమైన సహజవాయు నిక్షేపాలు కనుగొన్నామని ముఖేష్‌ అంబానీ ప్రకటించడంతో కార్పొరేట్‌ మీడియా దానికి విస్తృత ప్రచారం కల్పించింది. రిలయన్స్‌ షేర్ల విలువ ఒక్క సారిగా పెరిగింది. అక్కడ 2009కి గాని ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ధీరూభారు-6 బ్లాక్‌లో మొదటి సారిగా వెలికి తీసిన క్రూడ్‌ ఆయిల్‌ నమూనాను అంబానీ దంపతులు జాతీయ మీడియాకు ప్రదర్శించి మరో 20 ఏళ్ళ పాటు అక్కడ చమురు, సహజ వాయువు లభిస్తుందని ప్రకటించడంతో వారి షేర్ల ధరలు ఆకాశాన్నంటాయి. అయితే అక్కడ వారు గతంలో ప్రకటించినంత నిక్షేపాలు లేవని వెల్లడి కావడంతో షేర్ల విలువ బాగా తగ్గింది. ఈ భాగోతంలో బాగా నష్టపోయింది చిన్న, మధ్య తరగతి మదుపరులే. 2018 సెప్టెంబర్‌లో డి-6 బ్లాక్‌ నుంచి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ సహజ వాయు నిక్షేపాల విషయంలో దేశ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించారని ఏనాడూ జాతీయ కార్పొరేట్‌ మీడియా రిలయన్స్‌ను ప్రశ్నించే సాహసం చేయలేదు. కె.జి.బేసిన్‌లో రిలయన్స్‌ తమ క్షేత్రాల్లోకి చొరబడి వేలాది కోట్ల రూపాయల విలువైన చమురు, సహజ వాయువును దొంగిలించిందని ఒ.ఎన్‌.జి.సి ఎంత మొరపెట్టుకున్నా జాతీయ కార్పొరేట్‌ మీడియా రిలయన్స్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించలేదు.

నోమ్‌ చోమ్‌స్కీ, ఎడ్వర్డ్‌ ఎస్‌. హెర్మన్‌లు ‘మానుఫ్యాక్చ్యురింగ్‌ కన్సెంట్‌’ గ్రంథంలో చెప్పినట్లుగానే భారత దేశంలో కూడా కార్పొరేట్‌ మీడియా, ప్రజలకు మేలు చేస్తున్నట్లు నటిస్తూ పాలకుల ప్రయోజనాలు కాపాడుతూ, తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటోంది. కార్పొరేట్‌ సంస్థలు-రాజకీయ శక్తుల మధ్య ఎన్నటికీ విడదీయరాని బంధాన్ని ఏర్పరచడానికి జాతీయ మీడియా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జిగురుగా మారింది. అమెరికా అధ్యక్ష పదవి నాలుగేళ్ళే, కాని మీడియా పాలన శాశ్వతం అంటారు ప్రముఖ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌. మన దేశంలో ఇప్పటికే నాయస్థానాలకు వెలుపల కార్పొరేట్‌ మీడియాలో ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్‌లో అమాయకులను నేరస్థులుగానూ, నేరస్థులను అమాయకులుగానూ తీర్పులు ఇస్తున్నారు. కార్పొరేట్‌ మీడియా ఇప్పటికే మన జీవితాలను శాసించే పనిలో పడింది. దీనికి అడ్డు కట్ట వేయకపోతే మరో సారి మనం స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

( వ్యాసకర్త ఎ.పి.ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, జర్నలిస్ట్‌ న్యూస్‌ అండ్‌ వ్యూస్‌ పత్రిక చీఫ్‌ ఎడిటర్‌

Courtesy Prajashakti