.. నిరుపేదలకు వరం! వారికి కార్పొరేట్‌ వైద్యం అందించే మంచి పథకం! కానీ, ఇప్పుడు కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రెండు మూడు నెలలుగా పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదు. అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీకంటూ ప్రత్యేకంగా కొన్ని వార్డులు ఉండేవి. ఇప్పుడు వాటిని ఎత్తివేశాయి. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలను అందించనప్పుడు వార్డులు మాత్రం ఎందుకని తీసివేశాయి. ఒకటి రెండు ఆస్పత్రుల్లో ఆ వార్డులకు తాళాలు వేసినట్లు సమాచారం.

  • సేవలను నిలిపివేసిన కార్పొరేట్‌ ఆస్పత్రులు
  • 2 నెలలుగా రోగులను చేర్చుకోవడానికి నో
  • బకాయిలే కారణమంటున్న ఆస్పత్రులు
  • లాభమొచ్చే మోకీలు, గుండె చికిత్సలకే ఓకే
  • మళ్లీ రూ.500 కోట్లకు పెరిగిన బకాయిలు
  • ఉద్యోగుల ఆరోగ్య పథకానికీ అదే గతి
  • ఆయుష్మాన్‌ భారత్‌కు ముందుగానే కొర్రీ

తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (తాషా)లో పది వరకు కార్పొరేట్‌ ఆస్పత్రులున్నాయి. రెండు నెలలుగా ఆరోగ్యశ్రీ కార్డుల కింద అసలు రోగులను చేర్చుకోవడం మానేశారు. వీటిలో కొన్నింటిలో ఏకంగా ఆరోగ్యశ్రీ వార్డులనే ఎత్తి వేశారు. ప్రభుత్వంతో అతి సన్నిహితంగా మెలిగే ఓ కార్పొరేట్‌ ఆస్పత్రి యాజమాన్యం కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆరోగ్యశ్రీ కింద అన్ని సేవలనూ నిలిపి వేస్తే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు వస్తాయేమోనన్న భావనతో ఉన్న కార్పొరేట్‌ ఆస్పత్రులు చాలా తెలివిగా ఒకటి రెండు సర్జరీలను మాత్రం ఆ పథకం కింద కొనసాగిస్తున్నాయి. అవి కూడా లక్ష రూపాయలకు మించిన ప్యాకేజీలు అయితేనే..! వాటిలో ఒకటి మోకీలు మార్పిడి.. రెండోది గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు! ఈ రెండింటిలో 50 శాతానికిపైగా లాభం ఉండడమే ఇందుకు కారణం. ఇక, విదేశీ సంస్థల రాకతో ప్రభుత్వ బీమా వైద్యానికి కాలం చెల్లిపోతోంది. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స, జేహెచ్‌ఎ్‌స, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల కింద వైద్యం అందించడానికి సుముఖత చూపడం లేదు. డాక్టర్ల చేతిలోనే ఆస్పత్రులు ఉన్నప్పుడు చెల్లింపులు కాస్త ఆలస్యమైనా అనుమతించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

బకాయిలతోనే సమస్య….ఏకంగా ఆరు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కార్పొరేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా 832 జబ్బులకు సేవలందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 329 నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 41,300 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏటా సగటున రూ.800 కోట్లు ఈ పథకం కింద సర్కారు కేటాయిస్తోంది. కానీ, ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటికప్పుడు భారీగా పెండింగ్‌లో ఉంటున్నాయి. అవి రూ.500 కోట్లకు పెరిగిపోవడంతో ఆగస్టులో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సేవలను పూర్తిస్థాయిలో నిలిపివేశాయి. ప్రభుత్వం చర్చలు జరిపి రూ.200 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత దాదాపు రూ.350 కోట్లు పెండింగ్‌ బకాయిలున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల బకాయిలు కలిపితే తాజాగా బకాయిలు మళ్లీ రూ.500 కోట్లకు చేరుకున్నాయని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నాయి. ఆగస్టులో వైద్య మంత్రి ఈటలతో జరిగిన సమావేశంలో ఇకపై క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని చెప్పినా.. ఆ దిశలో చర్యలు లేవని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.

కోతలే కోతలు
ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసి ఆస్పత్రులు పెడుతున్న బిల్లుల్లోనూ సర్కారు వేలకు వేలు కోత విధిస్తోంది. నిజానికి, ఆరోగ్యశ్రీ కింద మూడు రకాల చెల్లింపులతో వైద్య సేవలందిస్తారు. అవి.. ప్రీ ఆథరైజేషన్‌, బిల్లు అమౌంట్‌, ప్లెయిన్‌ పెయిడ్‌ అమౌంట్‌. అత్యవసరంగా రోగి ఇన్‌పేషెంట్‌గా చేరితే ప్రీ ఆథరైజేషన్‌ అప్రూవల్‌ తీసుకొని చికిత్స చేస్తారు. ఉదాహరణకు, ఒక రోగికి ఒక శస్త్ర చికిత్సకు రూ.40 వేలు అవుతాయని అంచనా వేసి.. దానికి ప్రీ ఆథరైజేషన్‌ కింద అనుమతి తీసుకుంటారు. శస్త్రచికిత్స చేస్తారు. ఇతర కాంప్లికేషన్స్‌ కారణంగా ఒక్కోసారి అది రూ.60 వేలకు చేరుతుంది. దాన్ని బిల్లు అమౌంట్‌ కింద ఆస్పత్రులు క్లెయిమ్‌ చేస్తాయి. అయితే, చేసిన శస్త్రచికిత్సకు ఇవ్వాల్సిన రూ.40 వేలల్లోనే ఆరోగ్యశ్రీ ట్రస్టు కోత పెట్టి రూ.20 వేలు మాత్రమే ఇస్తోంది. దీనిని ప్లెయిన్‌ పెయిడ్‌ అమౌంట్‌ అంటారు. దీంతో, ఆస్పత్రులు నష్టపోతున్నాయి. పైగా, ఆ 20 వేలు కూడా ఎప్పటికో కానీ రావట్లేదు. అందుకే ఇవన్నీ వర్కవుట్‌ కావడం లేదని కార్పొరేట్‌ ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి.

బీ, సీ కేటగిరీలకే రోగులు
కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డుల ఎత్తివేతతో రోగులు బీ, సీ కేటగిరీ ఆస్పత్రులకు వెళుతున్నారు. వాటిలో కొంత మేరకు వీటిని అంగీకరిస్తున్నారు. అయితే, కార్పొరేట్‌కు అనుబంధంగా ఉన్న చిన్న చిన్న ఆస్పత్రులు కూడా ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఒక ఆస్పత్రి సేవలందిస్తే.. మిగిలిన ఆస్పత్రులు కూడా ఇవ్వాల్సి వస్తుందన్న భావనలో అవి కూడా సేవలను నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డయాలసిస్‌ సేవలను కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులు అందించడం లేదు.

ఈహెచ్‌ఎ్‌స కథ ఇంతే..

ఒక్క ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు.. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎ్‌స) కింద అందించే సేవలను కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులు దాదాపుగా నిలిపి వేశాయి. కొన్నిచోట్లఈహెచ్‌ఎ్‌స కార్డులతో పరిమితంగానే వైద్యం చేస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈహెచ్‌ఎ్‌స కార్డులను కేవలం 50ు ఆస్పత్రుల్లోనే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛనర్లకు కలిపి 5.70 లక్షల కార్డులున్నాయి. వారి కుటుంబ సభ్యులను కలిపితే మొత్తం 12 లక్షల మంది ఉన్నారు. ఈహెచ్‌ఎ్‌స కింద ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కీలక వ్యాధులకు పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. వాటికి ఈహెచ్‌ఎ్‌స కింద సేవలందించేందుకు ఆస్పత్రులు అస్సలు అంగీకరించడం లేదు. ఉదాహరణకు, కేన్సర్‌ చికిత్స. ఉద్యోగులు ఎక్కువ మంది ఇటువంటి పెద్ద పెద్ద వ్యాధులకు చికిత్స అందించాలని కోరుకుంటున్నారు. వాస్తవ పరిస్థితుల్లో అది జరగడం లేదు. దాంతో, వారు తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తోంది.

ఆయుష్మాన్‌ భారత్‌దీ అదే దారి

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలుకు కేంద్రం రాష్ట్రాలవారీగా ఆస్పత్రుల ఎంప్యానెల్‌మెంట్‌ ఇస్తోంది. తెలంగాణ, ఏపీల్లో ఇంతవరకు ఇవ్వలేదు. కానీ, ఆయుష్మాన్‌ భారత కింద అందించే చికిత్సలు, వాటి ధరలను, మార్గదర్శకాలను తెలిపింది. తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని నెలల కిందటే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశాయి. ఆ పథకం కింద ఇచ్చే ధరలు తమకు వర్కవుట్‌ కావని, తాము చేయలేమని తేల్చి చెప్పాయి. సీజీహెచ్‌ఎ్‌స కింద అందించే సేవల్లోని ధరల కంటే 15ు తక్కువకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద అందించాలని కేంద్రం ప్రైవేటు ఆస్పత్రులను కోరుతోంది.

ఈహెచ్‌ఎ్‌సపై పర్యవేక్షణ ఏదీ!
?
ఉద్యోగుల ఆరోగ్య పథకంపై సర్కారు పర్యవేక్షణ కొరవడింది. దీనిపై ఇంతవరకూ సమీక్షనే పెట్టలేదు. అసలు ఆరోగ్యశ్రీ సీఈవోనే దొరకడం లేదు. ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్‌ కోరినా ఆయన ఇవ్వలేదు. ఒక్క రోజు కూడా ఆయన ఈహెచ్‌ఎ్‌స అమలవుతున్న ఆస్పత్రులను సందర్శించలేదు. ఐఏఎస్‌ అధికారి బదులు ప్రొఫెషనల్‌ వైద్యుడిని సీఈవోగా నియమిస్తే బావుంటుంది.

                                                                           – కారం రవీందర్‌ రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు
మేం ఎందుకు సేవలందించాలి?
ఆరోగ్యశ్రీని కొనసాగించాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదు. అలాంటప్పుడు మేం ఎందుకు సేవలందించాలి? ఖర్చులు పెరిగాయి. సర్కారు మాత్రం 2007 ప్యాకేజీలనే 2019లోనూ అమలు చేస్తోంది. ఇవి మాకెలా వర్కవుట్‌ అవుతాయి? సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు ఇవి ఎలా సరిపోతాయి? అందుకే సేవలు నిలిపివేస్తున్నాయి. ఇప్పటికీ రెగ్యులర్‌ పేమెంట్లు లేవు.

                                                                       – డాక్టర్‌ రాకేశ్‌, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌

                                                                                ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు.

                                                                                              Courtesy Andhrajyothy…