రాత్రివేళ ఆసుపత్రిలో చేరితే.. 30-40 శాతం అదనంగా వసూలు
వైద్యసేవలు, పరీక్షలపై ఛార్జీల మోత

బీమా ఉన్నా నగదు కట్టాలని ఒత్తిడి
వార్డు, గదిని బట్టి భారీగా వ్యత్యాసం
స్టార్‌ హోటళ్లను మించిన ఖరీదు
రోగిని, బంధువులను భయపెట్టి రకరకాల పరీక్షలకు సిఫారసు
ఆ విషయంలో విఫలమైతే వైద్యుడికి అవమానాలు

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సల ధరలు చుక్కలనంటుతున్నాయి. గదుల అద్దెలు స్టార్‌ హోటళ్లను మించి ఉంటున్నాయి. రాత్రి, పగలును బట్టి ఒక ధర.. వార్డు, గదుల స్థాయిని బట్టి మరో ధర.. ఇలా ఇష్టానుసారంగా నిర్ణయించేసుకుంటున్నాయి. పగటి పూట చేరి చికిత్స పొందితే రూ.లక్ష అయ్యే ఖర్చు కాస్తా.. రాత్రివేళ చేరితే రూ. 1.40 లక్షల వరకూ అవుతోంది. ఒకవేళ అత్యవసర వైద్యం అయితే కొంత ఎక్కువ కావచ్చేమో కాని.. దానితో సంబంధం లేకుండా రాత్రిపూట వస్తే చాలు బిల్లు పెంచేస్తున్న తీరే విచిత్రంగా ఉంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జనరల్‌ వార్డు ధర కనీసం రూ. 2,000 నుంచి రూ. 6,000. గరిష్ఠంగా రూ. 15,000 నుంచి రూ. 25,000. అంతే కాదు.. గదుల స్థాయి మారిన కొద్దీ వైద్యసేవల్లోనూ 30-40 శాతం వరకూ పెరుగుతుంది. మొత్తంగా రోగి అత్యవసర పరిస్థితిని, బలహీనతలను ఆసరా చేసుకుని కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు కాసులు పిండుకుంటున్నాయి. వీటిలో ధరలపై నియంత్రణ లేదు. ఏడాదికోసారి సుమారు 10-20 శాతం వరకూ ఛార్జీలు పెంచుకుంటున్నాయి.  ఏ ఆసుపత్రి ఎంత పెంచింది? ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుంటూ.. వాటిని బట్టి తమ ధరలనూ పెంచుకుంటున్న ఆసుపత్రులూ ఉన్నాయి. ప్రత్యేకంగా కొందరు సిబ్బంది వీటి కోసమే పనిచేస్తున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడున్న ధరలను గమనిస్తే.. బిల్లు చూస్తేనే బేర్‌మనే పరిస్థితి నెలకొంది. కార్పొరేట్‌ వైద్యం వ్యాపారమే కావచ్చు. అయితే మాత్రం సామాజిక బాధ్యతే లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే వైద్యుడు-రోగుల మధ్య సంబంధం బలహీనపడుతోంది. ప్రతీది లాభాపేక్షతోనే ముడిపెడుతూ మానవతా విలువలకు ఆసుపత్రులు నీళ్లొదులుతున్నాయి. ఇది ఏ దశకు చేరుకుందంటే.. దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ వారంవారం ఆదాయం లెక్కలేసుకోవడం ఇప్పుడు సాధారణమైంది. ఇందుకోసం ప్రత్యేక ఉన్నతాధికారిని నియమించుకుంటున్నాయి.

కార్పొరేట్‌ ఆసుపత్రి కథ ఇది..
 ప్రైవేటు ఉద్యోగి(40)కి రాత్రి 10 గంటల సమయంలో ఛాతీలో నొప్పి వచ్చింది. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అత్యవసర సేవల్లో చేర్చుకొని వెంటనే ఈసీజీ తీశారు. తర్వాత మరిన్ని పరీక్షలు అవసరమవుతాయని చెప్పారు వైద్యులు. సదరు ఉద్యోగికి రూ. 2 లక్షల వరకూ బీమా కార్డుందనీ, ఆ పరిధిలో చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే బీమా పరిధిలో చేర్చుకోడానికి ఆసుపత్రి సిబ్బంది ససేమిరా అంగీకరించలేదు. కనీసం రూ. 30,000 కట్టాల్సిందేనని చెప్పారు. గత్యంతరం లేక అంత చెల్లించి ఆసుపత్రిలో చేర్చారు. అవసరమైన పరీక్షలు చేశారు. మర్నాడు యాంజియోగ్రామ్‌ చేశారు. ఎలాంటి సమస్యా లేదని చెప్పి రెండురోజుల తర్వాత ఇంటికి వెళ్లమన్నారు. మామూలుగా పగటి పూట వచ్చి పరీక్షలు చేయించుకుంటే.. రూ. 20,000 – 25,000 అయ్యేది కాస్తా.. రూ. 40,000 అయింది. రాత్రివేళ అత్యవసర వైద్యం కనుక 30-40 శాతం అదనంగా వసూలు చేస్తామని ఆసుపత్రివర్గాలు చెప్పడంతో.. చేసేదిలేక చెల్లించి బయటపడ్డారు.

మోకీలు నొప్పితో బాధపడుతున్న మహిళ (50) హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ వైద్యుణ్ని సంప్రదించింది. రూ. 1.5 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఆమెకు వర్తించే బీమా మొత్తానికి జనరల్‌ వార్డు కేటాయించడంతో.. ఇద్దరు రోగులుండే (షేరింగ్‌) గదిని కేటాయించాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరారు. జనరల్‌ వార్డుకు రోజుకు రూ. 2,000 చొప్పున బీమాలో అర్హత ఉందనీ, అదే షేరింగ్‌ గది తీసుకుంటే రోజుకు రూ. 3,500 కట్టాల్సి వస్తుందని సిబ్బంది చెప్పారు.. ‘రోజుకు రూ. 1,500 మాత్రమే కదా.. మూడురోజులకు రూ. 4,500 కడితే సరిపోతుంది’ అనుకొని ఆ గదిని ఎంచుకున్నారు. తర్వాత బిల్లు చూసిన వారికి కళ్లు బైర్లుకమ్మాయి. బీమా సంస్థ ఇచ్చిన రూ. 1.2 లక్షలు కాకుండా మరో రూ. లక్ష కట్టాలని చెప్పడంతో నివ్వెరపోయారు. అంతెందుకు అవుతుందని నిలదీశారు. షేరింగ్‌ గదికి మారితే.. అద్దె మాత్రమే కాదనీ, ఆ గదికి వచ్చే వైద్యుడు, నర్సు సేవలతో పాటు నిర్ధారణ పరీక్షలు, శస్త్రచికిత్స గది ఛార్జీలన్నింటికీ అదనంగా ఉంటాయని.. అంతా చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. తమకా విషయం తెలియదని ఎంతగా చెప్పినా.. చివరకు ఓ రూ. 10,000 మాత్రం తగ్గించారు.

పరీక్షలు రాయకపోతే వైద్యుడికి తలంటుడే!
కన్సల్టెంట్ల వివరాలు పరిశీలించడంతో పాటు నాలుగైదు రోజులు గనుక వరుసగా ఏ డాక్టర్‌ నుంచైనా ఎంఆర్‌ఐలు, సీటీలు, ఇంకా ఇతర పరీక్షలు చేయించకపోతే.. ఆ వైద్యుడి పనితీరు బాగోలేదంటూ నేరుగా నిలదీసే పరిస్థితి ఉందని కొందరు వైద్యులే వాపోతున్నారు. రోగి ఆసుపత్రిలోకి ప్రవేశించగానే.. మాములూ తలనొప్పితో వచ్చినా.. సాధారణ నడుము నొప్పితో వచ్చినా.. అది ట్యూమర్‌ కావచ్చేమో, డిస్క్‌ జారి ఉండొచ్చేమో.. వంటి అనుమానాలు రేకెత్తించేలా.. రోగిలో ఆందోళన పెరిగేలా కొందరు వైద్యులు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి భయాలు రేకెత్తేసరికి తప్పనిసరై పరీక్షలు, చికిత్స చేయించుకుని.. రోగి తల తాకట్టు పెట్టుకుని అయినా.. కొందరైతే ఇల్లో, పొలమో అమ్మేసి మరీ ఈ ‘కాసు’పత్రులకు సమర్పించుకోవలసి వస్తోంది. కార్పొరేట్‌ ధరల నియంత్రణపై సర్కారు దృష్టిపెట్టకపోతే ఈ దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశం లేనట్లే.

అదే నిర్ధారణ పరీక్షల్లో ఉదాహరణకు ఎంఆర్‌ఐ స్కాన్‌కు..
జనరల్‌ వార్డులో రూ. 8,000, షేరింగ్‌లో రూ. 10,000, సింగిల్‌ గదిలో రూ. 13,000 వరకూ వసూలు చేస్తున్నారు.
గది మారితే.. ధర మారుతుంది..
నర్సింగ్‌, సహాయక సిబ్బంది, సీటీ, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే, ఈసీజీ, 2డీ ఎకో, ఇతర రక్తపరీక్షలు సహా అన్నింటికీ.. వార్డు నుంచి గదులవారీగా, చివరకు శస్త్రచికిత్స గదికి కూడా.. ప్రదేశం మారుతున్న కొద్దీ 30-40 శాతం దాకా ఖరీదు మారుతుండడం గమనార్హం.

ఇదే ఆసుపత్రిలో.. ఒక సూపర్‌ స్పెషలిస్టు వైద్యుడికి సంప్రదింపుల రుసుం
 జనరల్‌ వార్డులో రోజుకు ఒకసారి చూస్తే  రూ. 1,000
 షేరింగ్‌ గదిలో రోజుకు ఒకసారి చూస్తే రూ. 1,300
 సింగిల్‌ గదిలో రోజుకు ఒకసారి చూస్తే రూ. 2,000
 ఐసీయూలో రోజుకు ఒకసారి చూస్తే రూ.3,000

Courtesy Eenadu