పెట్టుబడులకు సంపూర్ణ భరోసా
అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
జీవశాస్త్రాలు, ఔషధ, బయోటెక్‌ రంగాల్లో అగ్రస్థానమే లక్ష్యంగా పురోగమిస్తున్నాం
బయో ఏసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: జీవశాస్త్రాలు, ఔషధ, బయోటెక్‌ రంగాల్లో అగ్రస్థానమే లక్ష్యంగా తెలంగాణ పురోగమిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అత్యుత్తమ పారిశ్రామిక విధానం, మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీ పడుతోందన్నారు. ఇక్కడ పెట్టే పెట్టుబడులకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని.. అన్ని విధాలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు.  బుధవారం హెచ్‌ఐఐసీలో ‘బయో ఆసియా’ అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో, సీఈవోల సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘బయో ఏసియా-2020 సదస్సు విజయపరంపర కొనసాగుతోంది. గతంలో కంటే అద్భుతమైన స్పందన లభించింది. దీని ద్వారా రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ సదస్సుతో తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటుకుంది. కొత్త అనుభవాలను గడించింది. ఇక్కడి సానుకూల వాతావరణం గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాం. తెలంగాణలో దేనికీ లోటు లేదు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూములు సిద్ధంగా ఉన్నాయి. సత్వరమే అనుమతులు ఇస్తాం. అన్ని వసతులూ కల్పిస్తాం. భారత్‌లో తయారీ నినాదంతో దేశానికి అవసరమైన వైద్య పరికరాలు ఉత్పత్తి చేయడంలో తెలంగాణ ముందువరుసలో ఉంది. ఔషధనగరి పేరిట అంతర్జాతీయ ఔషధ సమూహాన్ని త్వరలోనే ప్రారంభిస్తున్నాం. దేశీయంగా ప్రముఖ పరిశ్రమలన్నీ ఇందులో భాగస్వాములుగా చేరుతున్నాయి. అంతర్జాతీయ ఔషధ సంస్థల పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. వారితో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మాత్రం పర్యావరణ సమస్య లేకుండా అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నాం. జీనోమ్‌వ్యాలీ అత్యంత విజయవంతమైన జీవశాస్త్రాల సమూహం. దాన్ని విస్తరించి రెండో దశను ప్రారంభిస్తున్నాం.

జీవశాస్త్రాల రంగంలో తెలంగాణ ఇప్పుడు సంచలనాల కేంద్రం. నిత్యం ఆవిష్కరణలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. అంకుర పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ఔషధ, బయోటెక్‌ సంస్థలు ఎదుర్కొనే అనేక సమస్యలకు ఆధునిక సాంకేతికతతో పరిష్కారం చూపుతున్నాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.
ఒడిశా ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రి అశోక్‌చంద్ర పాండా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య పాల్గొన్నారు.

* రెండు గంటలపాటు జరిగిన సీఈవోల సదస్సులో కేటీఆర్‌ పలు అంశాలపై చర్చించారు. వివిధ కంపెనీల సీఈవోలతోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి, రాష్ట్ర జీవశాస్త్రాల విభాగం సంచాలకుడు, బయో ఏసియా సదస్సు సీఈవో శక్తి నాగప్పన్‌ ఈ సదస్సులో పాల్గొన్నారు.

అంకుర పరిశ్రమలకు పురస్కారాలు
సదస్సు సందర్భంగా నిర్వహించిన అంకుర పరిశ్రమల పోటీలకు 75 దరఖాస్తులు రాగా.. అయిదింటిని పురస్కారాలకు ఎంపిక చేశారు. లైకాన్‌ 3 డి, కాల్జీ, ఒంకోసిమిస్‌ బయోటెక్‌, హీమాక్‌ హెల్త్‌కేర్‌, ఫ్లెక్స్‌మోటివ్‌ టెక్నాలజీస్‌లకు కేటీఆర్‌ పురస్కారాలను అందజేశారు.

ఘనంగా ముగిసిన సదస్సు
బయో ఏసియా సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. 37 దేశాల నుంచి 2,100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 100 మంది సీఈవోలు, 800 కార్పొరేట్‌ సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. 2,000 భాగస్వామ్య సమావేశాలు జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌ భాగస్వామ్య దేశంగా, ఒడిశా భాగస్వామ్య రాష్ట్రంగా పాల్గొన్నాయి. ఈ సదస్సు మధురానుభవాలను మిగల్చగా, 2022 సదస్సు కోసం ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నామని కేటీఆర్‌ చెప్పారు.

అయిదు సంస్థలకు భూ కేటాయింపు
హైదరాబాద్‌లోని వైద్యపరికరాల ఉత్పత్తి పార్కు, జీనోమ్‌ వ్యాలీలలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చిన అయిదు సంస్థలకు భూ కేటాయింపు లేఖలను ఈ సందర్భంగా కేటీఆర్‌ అందజేశారు. ఇంటెల్‌ సంస్థ ఏర్పాటుచేసిన కృత్రిమ మేధ పరిశోధన, ఆరోగ్య పరిరక్షణ కేంద్రాన్ని వేదికపై నుంచి ఆయన ప్రారంభించారు. ఇందులో ఇంటెల్‌ భారత విభాగాధిపతి నివృతి పాల్గొన్నారు.

Courtesy Eenadu