– కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆగడాలు
– కరోనా నియంత్రణ మందులంటూ లక్షల దోపిడీ
– ఆ ఆస్పత్రులపై చర్యలేవీ..!?
– చోద్యంగా చూస్తున్న సర్కారు

హైదరాబాద్‌ : ‘కరోనాకు మందు లేదు…జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం…’ సైన్స్‌ చెబుతున్న నిజం. ఇదే జగమెరిగిన సత్యం. కానీ, అదే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అంతా భిన్నం. రోగుల ప్రాణాపాయ స్థితి, కుటుంబ సభ్యుల బాధాకరమైన భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయి. మందులేని రోగానికీ ఈ మందు ఇవ్వాలి.. ఆ మందు ఇవ్వాలి… స్టాక్‌ లేదు… అక్కడ తెప్పించాలి.. ఇక్కడ తెప్పించాలి… అంటూ ఆ కార్పొరేట్‌ ఆస్పత్రులు దోపిడీ పర్వానికి తెరలేపాయి. అక్కడ జరిగే హడావుడికి రోగుల బంధువులు ఆందోళనకు గురై లక్షలకు లక్షల రూపాయలు ధారబోస్తూ లబోదిబో మంటున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కరోనాకు మందు లేదు…..ఇది సైన్స్‌. మందులేని కరోనాకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు….ఇది ఆర్ట్‌’ అని ప్రస్తుతం కార్పొరేట్‌ ఆస్పత్రుల తీరుకు అద్దం పడుతున్న ఈ కొటేషన్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. ఇందులో మందుల కంపెనీల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైద్యం పేరిట ఇంత దోపిడీ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టు ఉండటంపైనా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్‌ సామాజిక కోణం గల డాక్టర్ల నుంచి వినిపిస్తున్నది.

కరోనాతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చేరే రోగులకు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌, ప్లాస్మాథెరపీ, తదితర పద్ధతుల్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ జరుగుతున్నది. కరోనా ఇంకా మందు రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో దగ్గు, జ్వరం, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలను బట్టి ఉపశమనం కోసం మందుగోలీలు, టానిక్‌లు ఇస్తున్నారు. మరీ పరిస్థితి విషమంగా ఐసీయూలలో, వెంటిలేటర్ల మీద పెడుతున్నారు. ఇతర దీర్ఘకాలిక ఇబ్బందులుండి, కరోనా తీవ్రస్థాయి చేరేవరకు చికిత్స పొందని వారి పరిస్థితే విషమంగా ఉంటున్నది. మిగతా వాళ్లంతా మామూ లుగానే కోలు కుంటున్నారు. కొందరైతే ఆవిరి పట్టడం, బలమైన పౌష్టికా హారం, నిమ్మకాయ రసం, పండ్లు తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఇదీ వాస్తవం. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో దీనికి భిన్నంగా సాగుతున్నది. ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని తమ ధనార్జనకు అను కూలంగా మార్చు కునేందుకు ఎదురు చూస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రులకు డీజీసీఐ కొన్ని మందులను ప్రత్యేక పరిస్థితిలో వాడుకునేందుకు ఇచ్చిన అనుమతి కలిసి వచ్చింది. గతంలో ఇతర వ్యాధుల కోసం చేసిన పరిశోధనల్లో కనుగొన్న కొన్ని మందులు కోవిడ్‌-19 రోగుల్లోనూ పని చేస్తున్నాయని ప్రయివేటు ఫార్మా కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తు మేరకు షరతులతో కూడిన అనుమతిని డీజీసీఐ మంజూరు చేసింది. కోవిడ్‌-19 రోగుల్లో కేవలం మూడు శాతం వరకు మాత్రమే రోగుల పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి ఔషధాల్లో రెమిడెసివిర్‌ కేవలం రూ.3500 నుంచి రూ.5000 వరకు మాత్రమే ఖర్చయ్యేది. అతి కొద్ది మందికి ఉపయోగించే ఈ మందు ఏ మేరకు పని చేస్తుందో ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలే రాలేదు. కానీ, దాని వల్ల పూర్తి కరోనా తగ్గుముఖం పడుతున్న దనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కొరత లేకున్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఆ మందు బ్లాక్‌ మార్కెట్‌ అవుతున్నట్టు అపోహను కలగజేశారు. దీంతో ఆ మందు దొరికితే తమ వారు బతుకుతారనే భ్రమను కల్పించి దాదాపు పది రెట్లు అంటే దాదాపు రూ.50,000 వరకు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్‌ మార్కెట్లో మందును కొంటున్నట్టు బలమైన విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే భౌతిక దూరం, మాస్కులు, పీపీఈ కిట్లు తదితర రూపాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కన్నా చాలా ఎక్కువ మొత్తం కార్పొరేట్‌ ఆస్పత్రులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రయివేటు హెల్త్‌ ప్యాకేజీలు అమలు చేస్తూ ప్రభుత్వ ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకపోవడంతో కార్పొరేట్‌ వైద్యం ఇప్పటికీ కేవలం ధనవంతులకే పరిమితమైంది. దీనికి తోడు గతంలో సౌతాఫ్రికాలో ఎబోలా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం కాలిఫోర్నియాకు చెందిన ఒక కంపెనీ పరిశోధనతో కనుగొన్న రెమిడెసివిర్‌ లాంటి మందుల పేరుతో దోపిడీ చేయడాన్ని మేధావులు, డాక్టర్లు తప్పుబడుతున్నారు. పాలిపిలావిర్‌, ఎమిడిసవిర్‌ అనే మందులు కూడా ఆయా సందర్భాల్లో ఇతర వ్యాధుల కోసం చేసిన పరిశోధనల్లో కనుగొన్నవే. కరోనా విషయంలో ఈ మందుల పనితీరుపై ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు తెలియాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో బ్లాక్‌ మార్కెట్‌ పేరుతో కృత్రిమ కొరత సృష్టించి జరుగుతున్న కార్పొరేట్‌ దోపిడీ నుంచి ప్రజలను ఆదుకోవాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నది.

మోసపోవద్దు
కరోనాకు అసలు మందే లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రుల ఉచ్చులో పడి ప్రజలు దోపిడీకి గురికావద్దు. గతంలో ఆయా రోగాలకు ఉపయోగించిన మందులనే కరోనాకు పని చేస్తున్నాయన్నట్టు చెబుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. కేవలం ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు మాత్రమే ఉపయోగించుకునేందుకు డీజీసీఐ నుంచి మాత్రమే అనుమతి తీసుకున్న మందుల లభ్యతలో అసలు లోటే ఉండకూడదు. కొరత అనేది ప్రజలను దోచుకోవడంలో భాగంగా ఓ ఎత్తుగడ. ఆ దోపిడీ నుంచి ప్రజలను సర్కారు కాపాడాలి.
డాక్టర్‌ సంజరు రెడ్డి,
ఫార్మకాలజిస్ట్‌, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యులు

Courtesy Nava Telangana